పొట్లకాయ పుష్టికరం

Gourds Are Very Good For Health - Sakshi

ఆయుర్వేదం

అనాదిగా వస్తున్న ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకైనా, వ్యాధి చికిత్సకైనా ఔషధం కన్నా ఆహారవిహారాలకు  అధిక ప్రాధాన్యం ఉంది. మూలికా ద్రవ్యాలతో బాటు ఆహార పదార్థాలను కూడా విశ్లేషిస్తూ ‘భావమిశ్రుడు’ ఒక సంహితనే రూపొందించాడు.

∙‘....చిచిండో వాత పిత్తఘ్నో బల్యః పథ్యో రుచి ప్రదః‘ శోషణోతి హితః కించిత్‌ గుణైః న్యూనః పటోలతః‘‘
పొట్లకాయ సంస్కృత నామం ‘చిచిండః’. దీనికే ‘సుదీర్ఘ, గృహకూలక, శ్వేతరాజి మొదలైన పర్యాయ పదాలున్నాయి. వృక్షశాస్త్రపు పేరు Trichosanthes cucurmerina మరియుT. Anguina.

►ఇది శరీరానికి మిక్కిలి బలకరం, పథ్యం (హితకరం), రుచికరం. కొవ్వును కరిగించి బరువుని తగ్గిస్తుంది. వాతపిత్త దోషాలను పోగొట్టి మేలు చేస్తుంది.
►చేదు పొట్ల (పటోల) అనే మరొక శాకం ఉంది. దీనిని ఔషధంగా మాత్రమే వాడతారు, ఆహారంలో ఉపయోగించరు. పైన చెప్పిన గుణ ధర్మాలు దీనికి మరీ అధికంగా ఉంటాయి.
►దీని ఆకులు, వేళ్లు, కాయలోని గింజలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.
 ►పొట్లకాయను కోడిగుడ్డుతో కలిపి తింటే వికటిస్తుందని కొన్ని ప్రాంతాలవారి నమ్మకం.

ఆధునిక శాస్త్ర విశ్లేషణ
పొట్లకాయలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. పిండి పదార్థాలు, మాంసకృత్తులు తగుపాళ్లలో ఉంటాయి. కొలెస్ట్రాల్‌ శూన్యం. పొటాషియం అధికంగా (359 శాతం), సోడియం తక్కువగా (33 శాతం) ఉంటుంది. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, అయోడిన్‌ వంటి అంశాలు తగినంత లభిస్తాయి. నీరు అధిక శాతంలో ఉంటుంది.

►యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నొప్పులు, వాపులు తగ్గటానికి ఉపకరిస్తుంది. జీర్ణాశయ కృత్యాల్ని పెంపొందించి దేహపుష్టి కలిగిస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహ వికారాలలో గుణకారి. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. బరువును తగ్గించడం, నిద్ర కలిగించే గుణాలు ఉన్నాయి.
►విటమిన్‌ ఎ, బి 6, సి, ఇ సమృద్ధిగా ఉన్నాయి.
►పొట్ల కాయల రసాన్ని తల మీద పైపూతగా రాస్తే, చుండ్రు తగ్గి కేశవర్థకం గా పనిచేస్తుంది. చర్మకాంతిని మెరుగు పరుస్తుంది.
►తేలికగా జీర్ణమై నీరసం తగ్గిస్తుంది కనుక ఎటువంటి అనారోగ్యం ఉన్నవారికైనా ఇది పథ్యంలా పనిచేస్తుంది.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top