ఆమె వయసింకా నూటెనిమిదే! | Florence Millicent Jenkins 108 birth day celebrations | Sakshi
Sakshi News home page

ఆమె వయసింకా నూటెనిమిదే!

Sep 2 2014 11:20 PM | Updated on Sep 2 2017 12:46 PM

ఆమె వయసింకా నూటెనిమిదే!

ఆమె వయసింకా నూటెనిమిదే!

మిల్లీగా అందరికీ సుపరిచితురాలైన ఫ్లోరెన్స్ మిల్లిసెంట్ జెన్‌కిన్స్... మొన్నీమధ్యే జోరుగా, హుషారుగా తన జన్మదిన వేడుకలు జరుపుకుంది.

మిల్లీగా అందరికీ సుపరిచితురాలైన ఫ్లోరెన్స్ మిల్లిసెంట్ జెన్‌కిన్స్... మొన్నీమధ్యే జోరుగా, హుషారుగా తన జన్మదిన వేడుకలు జరుపుకుంది. బర్త్‌డే జరుపుకోవడంలో వింతే మీ లేదు కానీ... మూడుపదులకే ముక్కుతూ మూలుగుతూ ఉండేవాళ్లు ఎక్కువవతున్న ఈ కాలంలో ఆమె ఏకంగా పదిపదులు కూడా దాటి, పదకొండో పదికి చేరువ కావడం వింతేకదా మరి! మరికాస్త వివరంగా చెప్పాలంటే ఆమె జరుపుకున్నది తన నూట ఎనిమిదో పుట్టినరోజును. ఈ పుట్టినరోజుకు ఆమె ఇద్దరు కుమారులు డెనిస్, అలన్‌లతో సహా తొమ్మిదిమంది మనుమళ్లు, పదమూడు మంది మునిమనుమలు, పదిమంది ముని ముని మనుమలు హాజరయ్యారు.
 
స్కూల్ టీచర్‌గా రిటైరై అర్ధశతాబ్దానికి పైబడిన మిల్లీ దగ్గర ఎప్పుడో డెబ్భయ్ళేళ్ల క్రితం చదువుకున్న స్టూడెంట్స్ కొందరు తమ మనుమళ్లను, మనుమరాళ్లను ఊతకర్రలుగా చేసుకుని మరీ ఈ బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. అన్నట్లు టీచర్‌గా రిటైరైన తర్వాత ఆమె దాదాపు పదేళ్లకుపైగా ఓ నర్సింగ్ హోమ్‌లోనూ, తర్వాత ఒక క్యాంటీన్‌లో డిన్నర్ లేడీగానూ పని చేసింది. నల్లగౌను, దానిమీద ఎరుపు రంగు కోటును ధరించిన మిల్లీ, రాణీగారు తనకోసం ప్రత్యేకంగా పంపిన గిఫ్ట్‌బాక్స్‌ను తెరిచి, సంభ్రమాశ్చర్యాలతో కేరింతలు కొట్టి మరీ, కేకు కట్ చేసింది.
 
 కారణం... అందులో  తనకిష్టమైన తెలుపు, ఎరుపు పూల గుత్తులు, ఖరీదైన చాక్లెట్లు కొన్ని డజన్ల సంఖ్యలో  ఉన్నాయి మరి! వాటితోపాటు అత్యంత విలువైన దుస్తులు కూడా! తమ అత్తగారు ఎంతో కమ్మటి కంఠంతో పాటలు పాడతారని, ఆమె గొంతు అంటే తనకెంతో ఇష్టమని ఆమె కోడలు ఎల్స్‌పెత్ జెన్కిన్స్ ఎంతో ఇష్టంగా చెప్పింది. లండన్‌కు చెందిన ఈ బామ్మగారు జీసస్‌పై సరికొత్త కీర్తనలు రచించడమేకాదు, గానం కూడా చేస్తారట. తన ఆరోగ్యానికి, ఆయుష్షుకు అదే కారణమని ఈమె విశ్వాసం. ఈ బామ్మగారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement