నాట్‌ ఓకే బంగారం

Father And Child Relationship Special Story - Sakshi

‘నాన్నా.. నాకది కావాలి’’‘‘ఓకే బంగారం’’‘‘అమ్మా.. నాకిది వద్దు’’‘‘ఓకే బంగారం’’ఏం కోరితే అది. ఏం చెబితే అది.అయితే..‘ఓకే బంగారం’ అనలేని రోజొకటిప్రతి పేరెంట్‌కీ వస్తుంది.ఆ మాటను తట్టుకోలేని రోజు మాత్రంఏ పిల్లలకూ రాకూడదు.

నాన్న బయటకెళ్తే వచ్చేటప్పుడు తమకేదో తెస్తాడని పిల్లలు ఎదురు చూసేవాళ్లు. నాన్న తెచ్చిన చిన్న మిఠాయి పొట్లంతో ఆకాశాన్నంటే ఆనందాన్ని పొందేవారు. నాన్న తిరునాళ్లలో కొనిచ్చిన బొమ్మంటే పిల్లలకు ప్రాణం. ఆ బొమ్మతో ఏళ్లకేళ్లు ఆడుకునేవాళ్లు. ఆ బొమ్మతో అనుబంధాన్ని పెంచుకునేవాళ్లు. మరో బొమ్మ కొనిస్తే ఆ బొమ్మకు తోడుగా కొత్త బొమ్మను జత చేసుకుని ఆనందాన్ని రెట్టింపు చేసుకునేవాళ్లు. నాన్న అడుగుల చప్పుడు కోసం ఎదురు చూడడంలో కూడా వారికి సంతోషం ఉండేది. ఇది ఎనభైలు, తొంభైల వరకు గడిచిన బాల్యం.
తొంభైల తర్వాత రెండు వేలు సంవత్సరం వచ్చేసింది. ఇరవై ఒకటో శతాబ్దంలోకి వచ్చేశాం. కొత్త శతాబ్దం తెచ్చిన మార్పుల్లో బాల్యమూ మారిపోయింది. బాల్యంలో సున్నితత్వం లోపించింది. నాన్నలో తమకు అన్నీ అమర్చి పెట్టే ‘ఫెసిలిటేటర్‌’ ను మాత్రమే చూస్తున్నారు పిల్లలు. తాము అడిగినవి ఇప్పించకపోతే నాన్నలో శత్రువుని చూడడానికి కూడా వెనుకాడడం లేదిప్పుడు. ఈ దుష్పరిణామానికి తాజా నిదర్శనమే బెంగుళూరు ఘటన.

బెంగళూరులోని రాజాజీ నగర్‌లో ఓ టీనేజ్‌ అమ్మాయి తండ్రిని చంపేసింది. తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయి తండ్రికి విషం కలిపిన పాలు ఇచ్చింది. బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తండ్రి దేహం మీద పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. ఎందుకిలా చేశావంటే... ‘‘నేను కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి పొందడానికి’’ అని చెప్పింది ఎంతో స్థిరంగా. ‘‘నువ్వు కోల్పోయిన స్వేచ్ఛ ఏమిటి’’ అని అడిగితే... ‘‘మా నాన్న నా దగ్గర నుంచి ఫోన్‌ తీసేసుకున్నాడు. ఇంటర్నెట్‌ డిస్‌కనెక్ట్‌ చేశాడు. నేను నా ఫ్రెండ్‌తో మాట్లాడితే ఒప్పుకోవడం లేదు. ప్రవీణ్‌తో మాల్స్‌లో కనిపిస్తున్నానని కోప్పడి బెల్ట్‌తో కొట్టాడు కూడా..’’  ఇదీ ఆ టీనేజ్‌ అమ్మాయి చెప్పిన కారణం. పదిహేనేళ్ల అమ్మాయి ఇలా మాట్లాడిందంటే ఆ తప్పు ఆ అమ్మాయిదా? ఆ అమ్మాయిని ప్రభావితం చేసిన సమాజానిదా? అంటే సమాజానికి ఎంత పాత్ర ఉందో తల్లిదండ్రులకూ అంతే పాత్ర ఉందంటున్నారు సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి.

ముందే కళ్లు తెరవాలి
‘‘పిల్లల్లో యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిగా లోపించింది. స్కూల్లో తోటి పిల్లలతో చిన్న విషయాలకే గొడవ పెట్టుకోవడం, ఆ గొడవ పెట్టుకున్న పిల్లాడు మెట్లు దిగుతుంటే వెనక నుంచి తోసేయడం వంటి క్రౌర్యపూరితమైన సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు తమ దాకా వస్తే తప్ప కళ్లు తెరవడం లేదు. పిల్లల్లో వస్తున్న అనారోగ్యకరమైన మార్పుని పట్టించుకోవడం లేదు. సాధారణంగా రెండు తరాల మధ్య ఒక జనరేషన్‌ గ్యాప్‌ ఉంటుంది. ఇప్పటి పేరెంట్స్‌కి – పిల్లలకి మధ్య ఒక్కసారిగా నాలుగైదు జనరేషన్‌ల గ్యాప్‌ వచ్చేసింది. పిల్లలకు అవసరం లేనంత ఎక్కువ ఎక్స్‌పోజర్‌ వచ్చేస్తోంది. ఒకప్పుడు ఎవరైనా ఒక అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని తెలిస్తే ‘అమ్మో! ఆ అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాట్ట’ అని ఆందోళన పడుతూ చెప్పుకునేవాళ్లు. అలాగే ఒక అబ్బాయికి గర్ల్‌ఫ్రెండ్‌ ఉన్నా సరే... అతడి ఫ్రెండ్స్‌ అతడిని రకరకాలుగా హెచ్చరిస్తూ జాగ్రత్తలు చెప్పేవాళ్లు. ఎనభైల నాటి సమాజం అది. ఇప్పుడు సమాజం బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌ కల్చర్‌ని తప్పు పట్టడం లేదు, స్వాగతిస్తోంది కూడా. ఒక అమ్మాయి కానీ, అబ్బాయి కానీ తమకు లవర్‌ లేదని చెప్పుకోవడానికి సిగ్గుపడేటంతగా పిల్లల్ని ప్రభావితం చేసేసింది సమాజం. ‘బాయ్‌ఫ్రెండ్‌ లేడు’ అంటే ఆ అమ్మాయికి చెవి, ముక్కు వంటి దేహంలో ఉండాల్సిన భాగం లేనట్లు గేలి చేస్తున్నారు స్నేహితులు. గర్ల్‌ఫ్రెండ్‌ లేని అబ్బాయిల్లో కూడా ఫ్రెండ్స్‌ చిన్న చూపు చూస్తారని ఒత్తిడి పెరిగిపోతోంది. తల్లిదండ్రుల విషయానికి వస్తే... వాళ్లు పిల్లల ముందు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారో అవన్నీ నిజమనే అనుకుంటారు. తమ విషయంలోనూ అవి వర్తిస్తాయని భ్రమ పడతారు. కాలనీలో ఒక అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్‌ ఉండడాన్ని సమర్థించినప్పుడు, తనకు బాయ్‌ఫ్రెండ్‌ ఉంటే కూడా స్వాగతిస్తారనే అనుకుంటారు. తల్లిదండ్రులు తమ దాకా వచ్చినప్పుడు మాత్రమే కళ్లు తెరుస్తున్నారు. అప్పుడు పిల్లల్ని కట్టడి చేస్తే వాళ్లు మరింత మొండిగా మారిపోతారు. తమ తల్లిదండ్రులు ఫెయిర్‌గా లేరు, డబుల్‌ స్టాండర్డ్స్‌తో వ్యవహరిస్తున్నారనుకుంటారు. దాంతో ద్వేషాన్ని కూడా పెంచుకుంటారు.

ఎదురు చూడడం తెలియాలి
సమాజంలో జీవిస్తూ సమాజం ప్రభావం మన మీద పడకుండా ఆపగలగడం కొంచెం కష్టమే. అయితే ప్రతి దానికీ ఒక లిమిట్‌ సెట్టింగ్‌ ఉంటుంది. ఆ పరిమితి తెలియకపోతే ఎదురయ్యే అనర్థాలే ఇవన్నీ. లిమిట్‌ సెట్టింగ్‌ తెలియాల్సింది పిల్లలకంటే ముందు తల్లిదండ్రులకే. వయసు రీత్యా కానీ పరిణతి రీత్యా కానీ ఆ మాత్రం విచక్షణ ఉండేది పెద్దవాళ్లకే. పేరెంట్స్‌ తమ పిల్లలకు ఏదైనా బహుమతి ఇవ్వదలుచుకున్నప్పుడు... దానికంటూ ఒక సందర్భం ఉండేలా చూసుకోవాలి. అంతేతప్ప ‘పక్కింటి పిల్లాడికి ఉంది కాబట్టి మన వాడికి కూడా ఇద్దాం’ అని మాట్లాడుకున్నారంటే పిల్లల్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ విపరీతంగా పెరిగిపోతాయి. ఎవరి దగ్గర ఏది చూస్తే దానిని తనకు కొనిపెడతారనే అనుకుంటారు. తన దగ్గర ఎన్ని బొమ్మలున్నా సరే... మార్కెట్‌లోకి కొత్తగా మరో బొమ్మ వచ్చింది కాబట్టి వెంటనే కొనేయాలనే తొందర కూడా ఒంటపట్టేస్తుంది. ఇవన్నీ పిల్లల్లో కుదురులేని తనానికి కారణమవుతున్నాయి.డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తికన్సల్టెంట్‌ చైల్డ్‌ సైకియాట్రిస్ట్‌

అన్నీ అరచేతిలోనే
బాల్యంలో ఏవయితే రాకూడదో ఆ లక్షణాలన్నీ పిల్లలకు వొంటపట్టేస్తున్నాయి. మొదటిది ఇగో. మిగిలిన వారికంటే ఒక మెట్టు పైనుండాలనే తపన. తన ఫ్రెండ్స్‌ ఎవ్వరి దగ్గరా లేని గ్యాడ్జెట్స్‌ తన దగ్గర ఉండి తీరాలనే విపరీత కాంక్ష. ఇక రెండోది మొండిపట్టుదల. తమకు నచ్చని పని చేయమంటే ససేమిరా అన్నట్లు ఉంటారు. అంతటి మొండితనం తమను నచ్చిన పని చేసి తీరడంలోనూ ఉంటోంది. చదువుకోమని చెప్తే పుస్తకాన్ని తాకరు. స్మార్ట్‌ ఫోన్‌లలో గంటల కొద్దీ గడపడం, సోషల్‌ మీడియాలో చాటింగ్‌లు, ఫ్రెండ్స్‌తో తిరగడాన్ని ఇష్టపడతారు. పెద్దవాళ్లు మానమని చెప్తారు కాబట్టి ఇంకా ఎక్కువగా పంతం పట్టినట్లు చేస్తారు. ఇక దేనిమీదా కుదురులేకపోవడం కూడా ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇవన్నీ ఏడిహెచ్‌డి (అటెన్షన్‌ డెఫిసిట్, హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌) లక్షణాలే. దీనికి తోడు తోటిపిల్లల ముందు తక్కువ అవుతామేమోననే పియర్‌ ప్రెషర్‌ కూడా పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తోంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హారర్‌ను ఎక్కువగా చూడడం. ఒకప్పుడు టీవీలో హింసాత్మక సంఘటనల సినిమాలు ఎప్పుడో ఒకటి వచ్చేవి. పిల్లలున్న ఇళ్లలో కొన్ని చానెల్స్‌ని లాక్‌ చేసే వీలుండేది. ఇప్పుడు టీనేజ్‌లోనే పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ కొనిస్తున్నారు పేరెంట్స్‌. ఆ ఫోన్‌లో ఏం చూడవచ్చు, ఏం చూడకూడదనే లిమిట్‌ సెట్టింగ్‌ వాళ్లకు ఆ వయసులో తెలిసి వస్తుందా? ఏ క్షణంలో ఏం జరగాలని కోరుకుంటే అది జరిగిపోవాలనే ధోరణి నరనరాన జీర్ణించుకుపోతోంది పిల్లల్లో. భావోద్వేగాలను ప్రదర్శించడం, అదుపులో పెట్టుకోవడం రెండూ తెలిసి రావడం లేదు. ‘తల్లిదండ్రులం కాబట్టి మేము ఎక్కువ, మా మాట మీరు వినాలి’ అంటే పిల్లలు వినే స్థితిలో ఉండడం లేదు. కాబట్టి పేరెంట్స్‌ తప్పని సరిగా పిల్లలకు స్నేహితులుగా మారాలి. పిల్లలు అడిగిన వెంటనే కొనివ్వకుండా ఎదురు చూసేటట్లు చేయాలి. స్మార్ట్‌ ఫోన్‌ కోసం పిల్లలు కార్చిన రెండు కన్నీటి బొట్లకు కరిగిపోయి... మంచి మనసున్న తల్లిదండ్రులం అనిపించుకునే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ మంచి పేరెంటింగ్‌ కాలేదు. తెలిసీ తెలియని వయసులో స్మార్ట్‌ ఫోన్‌ తాలూకు చెడు ప్రభావం చూపించేది పిల్లల జీవితం మీదనే. ఈ బెంగుళూరు సంఘటనలో ఆ టీనేజ్‌ పిల్లలకు డ్రగ్స్‌ అలవాటు ఉండి ఉండవచ్చనే అనుమానం కూడా కలుగుతోంది. ఎందుకంటే... తల్లిదండ్రుల మీద ఇంత తీవ్రంగా ప్రవర్తించడం అనే లక్షణాన్ని ఇంత వరకు డ్రగ్‌ అడిక్ట్స్‌ విషయంలోనే కనిపిస్తుండేది’’ అని ముగించారు డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి. – ఇంటర్వ్యూ : వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top