పదేళ్ల బాబుకు తరచూ తలనొప్పి! | family health counciling | Sakshi
Sakshi News home page

పదేళ్ల బాబుకు తరచూ తలనొప్పి!

Nov 14 2017 11:43 PM | Updated on Nov 14 2017 11:43 PM

family health  counciling - Sakshi

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌
మా బాబు వయసు పదేళ్లు. తరచూ తలనొప్పితో చాలా బాధపడుతున్నాడు. ఇంతకుముందు అప్పుడప్పుడు మాత్రమే తలనొప్పి వచ్చేది. కాని ఇటీవల చాలా తరచుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. కానీ మాకు ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా ఇవ్వండి. – జీవన్‌కుమార్, కాకినాడ
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్‌ హెడేక్‌)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్‌. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్‌తో పాటు టెన్షన్‌ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్‌) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్‌ వల్ల తలనొప్పి అనే భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్‌ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది.

నివారణ / చికిత్స
►చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం
►నుదిటిపై చల్లటి నీటితో అద్దడం
►నొప్పి తగ్గించడానికి డాక్టర్‌ సలహా మేరకు మందులు (ఉదాహరణకు ఎన్‌ఎస్‌ఏఐడీ గ్రూప్‌ మందులు) వాడటం
►నీళ్లు ఎక్కువగా తాగించడం
►ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం
పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్‌ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను చాలావరకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం  ప్రొఫిలాక్టిక్‌ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్‌ సలహా మేరకు మరికొన్ని  మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్‌ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి.

పాప తల ఒకవైపు ఫ్లాట్‌గా ఉంది..!
మా పాప వయసు 13 నెలలు. పాపకు తల ఎడమవైపున ఫ్లాట్‌గా ఉంది. పరిశీలించి చూస్తే ఒకవైపున సొట్టపడ్డట్లుగా అనిపిస్తోంది. ఇది ఏమైనా ప్రమాదమా? దీనికి చికిత్స అవసరమా?
– పి. నవ్య, ఖమ్మం

మీ పాపకు పొజిషనల్‌ సెఫాలీ అనే కండిషన్‌ ఉందని అనిపిస్తోంది. దీన్నే ఫ్లాటెన్‌డ్‌ హెడ్‌ సిండ్రోమ్‌ అని కూడా అంటారు. పిల్లలను ఎప్పుడూ ఒకే స్థితిలో  పడుకోబెట్టినప్పుడు ఇది కనిపిస్తుంది. కొన్ని  సందర్భాల్లో పాప గర్భంలో ఉన్నప్పుడు ఇది మొదలై ఉండవచ్చు. ఇలాంటిదే మరో సమస్య కూడా ఉంది. దీన్నే క్రేనియో సినోస్టాసిస్‌ అంటారు. అయితే ఇది కాస్తంత తీవ్రమైన సమస్య.పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ల తల పొజిషన్‌ను తరచూ మారుస్తుండటం చాలా అవసరం. మెడ కండరాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ఒకసారి డాక్టర్‌కు చూపించి దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య అదే సర్దుకుంటుంది. అంటే కాలక్రమంలో తలలోని సొట్టలు కూడా తగ్గిపోయేందుకు అవకాశం ఉంది. దీని వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ పిల్లల్లో కూడా సాధారణ పిల్లల్లాగానే తెలివితేటలుంటాయి. మీరు ఒకసారి మీ పాపను పీడియాట్రీషియన్‌కు చూపించి ఇది పొజిషనల్‌ సమస్యేనా, లేదా ఇతరత్రా ఏవైనా సమస్యలున్నాయా అని తెలుసుకోండి. కేవలం తల ఒకవైపు ఫ్లాట్‌గా కనిపిస్తుండటమే సమస్య అయితే దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డా. రమేశ్‌బాబు దాసరి,
సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్,
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement