ఇంత చిన్న వయసులో అంత బరువా?

family health counciling - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

మా అబ్బాయికి 14 ఏళ్లు. వాడి బరువు 60 కిలోలు. అయితే గత కొంతకాలంగా వాడి బరువు 60 కిలోల నుంచి క్రమంగా పెరుగుతూ 70 కిలోలకు చేరింది. ఇలా బరువు పెరిగిపోతూ ఉండటంతో మాకు ఆందోళనగా ఉంది. దయచేసి వాడి బరువు తగ్గించడానికి తగిన సూచనలు ఇవ్వండి.  – విహారి, విశాఖపట్నం 
ఇటీవల పిల్లలు జంక్‌ఫుడ్‌ వంటి అనారోగ్యకరమైన జీవనశైలితో అనర్థాలు తెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో టీనేజ్‌లో ఉన్న పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు ఈ రోజుల్లో వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మీ అబ్బాయి ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో ముందుగా చూడండి. అతడికి ముందుగా మంచి  ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి. 
∙స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్,  జామ్‌ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్‌ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్‌ ఏజెంట్స్‌ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్‌ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి  కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను మరింత దూరం ఉంచడం మంచిది. ∙వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు. 

∙పిజ్జా, బర్గర్స్, కేక్స్‌ వంటి  బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్‌ కంటెంట్స్‌ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు. ∙తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది. ∙పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనా పాలనా, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్‌ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది. ∙పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్‌ వంటి మెడికల్‌ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్‌ అవుట్‌ చేసుకోవడం అవసరం.

పాపకు నోట్లో, గొంతులో పుండ్లు.. ఎందుకిలా?

మా పాప వయసు ఆరేళ్లు. ఇటీవల తన గొంతులో నొప్పిగా ఉందని అంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాం. పాప నోటిలోన, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. గొంతులో ఇన్ఫెక్షన్‌ వచ్చినమాదిరి  ఎర్రబారినట్లుగా డాక్టర్‌ చెప్పారు. మందులిచ్చినా తగ్గలేదు ఏదైనా తినడానికి వీలుగాక విపరీతంగా ఏడుస్తోంది. పాప కొంచెం సన్నబడింది. ఎప్పుడూ చలాకీగా ఉండే అమ్మాయి ఇలా ఏడ్వటం మాకు వేదన కలిగిస్తోంది. మా పాప సమస్య తగ్గేదెలా? – నిహారిక, నరసరావుపేట 
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్‌ అల్సర్స్‌) వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... 

∙ఉద్వేగాల పరమైన ఒత్తిడి (ఎమోషనల్‌ స్ట్రెస్‌), ∙బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్‌), ∙విటమిన్‌లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్‌ బి12, ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, జింక్‌ ల వంటి పోషకాలు లోపించడం) ∙వైరల్‌ ఇన్ఫెక్షన్‌లు (ముఖ్యంగా హెర్పిస్‌ వంటివి) ∙గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే అనేక గాయాల కారణంగా)  ∙పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్‌ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్‌ అల్సర్స్‌) వస్తుంటాయి. మీరు లెటర్‌లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో మీ పాప సమస్యకు నిర్దిష్టంగా ఇదే కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు  విటమిన్‌ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వన్చే ఇన్ఫెక్షన్స్‌తో ఈ సమస్య వస్తున్నట్లు విశ్లేషించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా  వాడే మందులు, యాంటిసెప్టిక్‌ మౌత్‌ వాష్‌లు, విటమిన్‌ సప్లిమెంట్స్‌ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్‌ క్రీమ్స్‌ వాడటం వల్ల ప్రయోజనం  ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. 

డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్,
రోహన్‌ హాస్పిటల్స్, 
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top