ఎండాహారం

family food special - Sakshi

రీడర్స్‌ డైజెస్ట్‌

ఎండ మధ్యాహ్నాలు సేద తీరమంటాయిచిన్న కునుకు తీయమంటాయినిద్ర నుంచి లేచాక ఆకలిరుచిగా ఏం తినాలిరుచి మాత్రమే కాదు చలువ చేసేలా ఏం తినొచ్చు? ఇవిగో ఈ ఎండాహారాన్ని తీసుకోండి. 

ఓట్స్‌ భేల్‌
కావలసినవి:  ఓట్స్‌ – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; దోసకాయ తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; క్యారట్‌ తురుము – అర కప్పు; క్యాప్సికమ్‌ తరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒకటిన్నర టీ స్పూన్లు; వేయించిన పల్లీలు – అర కప్పు; టొమాటో సాస్‌ – తగినంత

తయారి:  ∙బాణలిలో నెయ్యి వేడయ్యాక ఓట్స్‌ వేసి కొద్దిగా వేగాక... ఉల్లి తరుగు, టొమాటో తరుగు, దోస తరుగు, పచ్చి మిర్చి తరుగు, క్యాప్సికమ్‌ తరుగు, క్యారట్‌ తరుగు వేసి బాగా కలపాలి  
∙కొత్తిమీర, వేయించిన పల్లీలను జత చేసి బాగా కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి 
∙టొమాటో సాస్‌తో అందించాలి.

సగ్గుబియ్యం పొంగలి
కావలసినవి:  సగ్గు బియ్యం – ఒక కప్పు; పెసర పప్పు – పావు కప్పు; ఆవాలు – అర టీ స్పూను; మిరియాల పొడి – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1; కరివేపాకు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నెయ్యి – రెండు టీ స్పూన్లు; జీలకర్ర – తగినంత; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; జీడి పప్పులు – 6; అల్లం వెల్లుల్లి ముద్ద – తగినంత

తయారి: ∙సగ్గు బియ్యంలో నీళ్లు పోసి బాగా కడిగి ఆ నీళ్లు ఒంపేసి, సగ్గు బియ్యం మునిగే వరకు మంచి నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నానబెట్టాలి ∙పెసరపప్పును విడిగా నానబెట్టాలి ∙స్టౌ మీద కుకర్‌ ఉంచి, నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి , జీడి పప్పు, కరివేపాకు, మిరియాల పొడి వేసి వేయించాక, రెండున్నర కప్పుల నీళ్లు పోసి, నానబెట్టిన సగ్గుబియ్యం, పెసర పప్పు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి, బాగా కలిపి మూత పెట్టి, రెండు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి  పల్లీ చట్నీతో వేడి వేడి సగ్గు బియ్యం పొంగలి అందించాలి.

క్యారట్‌ ఉల్లిపాయ కూర
కావలసినవి:  క్యారట్‌ తురుము – రెండు కప్పులు; పెరుగు – ఒక కప్పు; సన్నగా తరిగిన ఉల్లిపాయలు – పావు కప్పు; నిమ్మ చెక్క – ఒకటి; ఉప్పు – తగినంత; ఆవాలు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; ఎండు మిర్చి – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – కొద్దిగా; నూనె – 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూను
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, ఉల్లితరుగు జత చేసి మరోమారు కలిపి, దోరగా వేగిన తరువాత స్టౌ మీద నుంచి దించి, గిన్నెలోకి తీసుకోవాలి ∙చల్లారిన తరవాత క్యారట్‌ తురుము, ఉప్పు, నిమ్మరసం, పెరుగు జత వేసి బాగా కలపాలి ∙ఈ కూర చపాతీలోకి, పూరీలోకి చాలా రుచిగా ఉంటుంది.

మిక్స్‌డ్‌ గ్రెయిన్‌ దోసె
కావలసినవి:  రాగి పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – ఒక కప్పు; గోధుమ పిండి – ఒక కప్పు; జొన్న పిండి – ఒక కప్పు; ఉల్లి తరుగు – ఒక కప్పు; సగ్గు బియ్యం – పావు కప్పు; ఉప్పు – తగినంత; పచ్చి మిర్చి పేస్ట్‌ – తగినంత; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – పావు టీ స్పూను; నూనె – తగినంత; కొత్తిమీర, కరివేపాకు – తగినంత; జీలకర్ర – ఒక టీ స్పూను

తయారి: ∙సగ్గుబియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఏడెనిమిది విజిల్స్‌ వచ్చాక దింపి, చల్లారనివ్వాలి 
∙ఒక బౌల్‌లో రాగి పిండి, బియ్యప్పిండి, గోధుమ పిండి, జొన్న పిండి, పోసి కలపాలి 
∙చల్లారిన సగ్గు బియ్యం జావను జత చేసి, తగినన్నినీళ్లు పోసి దోసెల పిండిలా కలపాలి 
∙సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చి మిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి  బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి 
∙బాణలి మీద పెనం వేడయ్యాక పిండిని దోసెలుగా వేసి, రెండువైపులా దోరగా కాలాక ప్లేట్‌లోకి తీసుకుని, టొమాటో సాస్‌ / పల్లీ పచ్చడితో అందించాలి.

పెసర మొలకలు – రాగిపిండి మాల్ట్‌
కావలసినవి:  పెసర మొలకలు – అర కప్పు; ఉప్పు – తగినంత; రాగి పిండి – అర కప్పు; మజ్జిగ – తగినంత

తయారి:  ∙రాగి పిండికి తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి దోసెలపిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి 
∙ఒక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, బాగా మరిగిన తరవాత, మంట బాగా తగ్గించి, కలిపి ఉంచుకున్న రాగి పిండిని పోస్తూ గరిటెతో కలుపుతుండాలి 
∙తెల్లని పొంగులా రాగానే పెసర మొలకలు వేసి కలిపి రెండు మూడు నిమిషాల తరవాత దింపేయాలి 
∙బాగా చల్లారాక మజ్జిగ కలిపి గ్లాసులలో అందించాలి 
∙ఒక గ్లాసు మాల్ట్‌ తాగితే చాలు కడుపులో చల్లగా ఉంటుంది.

పెరుగు సలాడ్‌
కావలసినవి:  పెరుగు – 3 కప్పులు; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; తోటకూర తరుగు – రెండు టీ స్పూన్లు; జీలకర్ర పొడి – ముప్పావు టీ స్పూను; బెల్లం – 4 టీ స్పూన్లు; కరివేపాకు తరుగు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; క్యారట్‌ తురుము – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; దానిమ్మ గింజలు – పావు కప్పు; తురిమిన అల్లం – అర టీ స్పూను; సొరకాయ తురుము – పావు కప్పు; క్యాబేజీ తరుగు – పావు కప్పు.

తయారి: ∙ఒక పాత్రలో తోటకూర తరుగు, క్యారట్‌ తురుము, సొరకాయ తురుము, క్యాబేజీ తరుగు, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, ఉడికించి దింపి చల్లారనివ్వాలి ∙ఒక పాత్రలో పెరుగు వేసి, ఉడికించుకున్న కూరలను జత చేయాలి ∙పచ్చి కొబ్బరి తురుము, దానిమ్మ గింజలు, అల్లం తురుము, బెల్లం, జీలకర్ర పొడి, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, వేసి బాగా కలిపి, ఫ్రిజ్‌లో పెట్టి, చల్లారాక బయటకు తీసి అందించాలి.

మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్‌ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, 
అబ్బాయ్‌... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. 
 

కూల్‌ డ్రింక్‌
నొంగు పాల తయారీ

కావలసినవి: ముంజలు – 6 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేయాలి)పాలు – 2 కప్పులుపంచదార – ఒక టేబుల్‌ స్పూను ఏలకుల పొడి – పావు టీ స్పూను
తయారి: ∙ఒక పాత్రలో పాలు పోసి, స్టవ్‌ మీద ఉంచి పాలు మరిగి మూడు వంతులు అయ్యేవరకు మరిగించాలి.
∙పంచదార, ఏలకుల పొడి జత చేసి రెండు నిమిషాలు ఉంచి దింపేసి చల్లారనివ్వాలి.
∙ముంజల ముక్కలు జత చేసి ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా అయ్యాక బయటకు తీసి, గ్లాసులలో పోసి అందించాలి.
∙వేసవి తాపాన్ని చల్లార్చే సహజ పానీయం ఇది.

ఇంటి చిట్కాలు
సాంబారు మరింత రుచిగా రావాలంటే..
∙పోపును నేతిలో వేయించాలి
∙చిటికెడు దాల్చినచెక్క పొడి వేయాలి.
∙ముల్లంగి ముక్కలు వేయాలి.
∙ఉల్లికాడలు, చిన్న ఉల్లిపాయలు (సాంబారు ఉల్లిపాయలు) ఉపయోగించాలి.
∙ఉడికించిన పప్పును మెత్తగా మెదపాలి 
∙జీలకర్ర పొడి, కొద్దిగా బెల్లం జత చేస్తే, అదనపు రుచి వచ్చి సాంబారు ఘుమఘుమలాడుతుంది.
∙ముక్కలను మరీ గుజ్జులా ఉడకపెట్టకూడదు
 (వేసవిలో కందిపప్పు బదులు పెసర పప్పు ఉపయోగిస్తే చలవ చేస్తుంది)

ఫుడ్‌ ఫ్యాక్ట్స్‌
మజ్జిగ ఉపయోగాలు...
సోఫార్శోగ్రహణీదోషమైత్రగ్రహోదరారుచౌస్నేహవయాపది పాండుత్వే తక్రం దద్యాద్గరేషు చ(చరక సంహిత 27వ సూత్రం)ఆరోగ్యానికి మజ్జిగ మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. మానవులలో ఉండే త్రిదోషాలనూ మజ్జిగ అదుపులో ఉంచుతుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాత దోషం, పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పిత్త దోషం, శొంఠి, పిప్పళ్లు, మిరియాల పొడితో కలిపి తీసుకుంటే కఫ దోషం తగ్గుతాయి. గేదె పాల నుంచి తయారయిన మజ్జిగ కంటె, ఆవు పాల మజ్జిగ మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు (ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల వారికి మజ్జిగ మంచిది కాదు).

∙పథ్యంగా పనిచేస్తుంది ∙ఆకలిని పెంచుతుంది. 
∙రుచి కారకంగా, బుద్ధిని పెంచేందుకు తోడ్పడుతుంది.
∙ఇంగువ, జీలకర్ర, సైంధవ లవణం కలిపిన మజ్జిగతో కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది.
∙పైల్స్‌ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
∙తాపాన్ని తగ్గించి, చల్లగా ఉంచుతుంది. రోజులో ఎక్కువసార్లు మజ్జిగ తీసుకోవడం వలన దాహార్తిని తీరుతుంది.
∙శరీరానికి అవసరమయ్యే సోడియం, క్యాల్షియమ్‌లను అందిస్తుంది.
∙గుండె సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయడపడుతుంది.
∙బిపి, కొలñ స్ట్రాల్‌లను నివారిస్తుంది.
∙శరీరానికి హాని చేసే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. 
∙శరీరంలో ఏర్పడే వేడిని తగ్గిస్తుంది ∙ఎముకలను బలంగా చేస్తుంది.
∙ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది.
∙శరీరంలోని మెటబాలిజమ్‌ రేటును పెంచి తద్వారా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. 
∙అజీర్తి, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది ∙రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చిట్కాలు...
∙మజ్జిగలో ఒక టీ స్పూను తేనె కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది. ఇలా క్రమం తప్పకుండా రెండు నెలలు తీసుకోవాలి ∙వెన్ను నొప్పితో బాధపడేవారు ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు ∙గ్లాసుడు మజ్జిగలో అర టీ స్పూను శొంఠి పొడి వేసి తీసుకుంటే, పైల్స్‌ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. క్రమం తప్పకుండా కనీసం నెల రోజులు పాటించడం వలన ఫలితం లభిస్తుంది.

– పి. సాయిజ్యోతి
అచ్చంపేట
నాగర్‌కర్నూల్‌ జిల్లా 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top