క్రెడిట్ కార్డు.. వాడకమూ తెలియాలి.. | Dictate the use of a credit card .. .. | Sakshi
Sakshi News home page

క్రెడిట్ కార్డు.. వాడకమూ తెలియాలి..

Jun 6 2014 10:47 PM | Updated on Sep 2 2017 8:24 AM

క్రెడిట్ కార్డు.. వాడకమూ తెలియాలి..

క్రెడిట్ కార్డు.. వాడకమూ తెలియాలి..

క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా వాడుకుంటే ఎంత ఉపయోగంగా ఉంటాయో.. అడ్డగోలుగా వాడితే అంతే సమస్యలూ తెచ్చిపెడతాయి.

క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా వాడుకుంటే ఎంత ఉపయోగంగా ఉంటాయో.. అడ్డగోలుగా వాడితే అంతే సమస్యలూ తెచ్చిపెడతాయి. అందుకే క్రెడిట్ కార్డులను సురక్షితంగా వాడటం తెలియడం ఎంత ముఖ్యమో ఎప్పుడెప్పుడు వాడకూడదన్నది తెలియడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే.. బడ్జెట్ దాటిపోయే ప్రమాదముంది. కార్డులున్న వారిలో చాలామంది నిత్యావసరాలను కొనేందుకు కూడా వాటిని ఉపయోగిస్తుంటారు.

కానీ, మరీ తరచుగా వాడేస్తే మనకు తెలియకుండానే నెలవారీ బడ్జెట్ చేతులు దాటిపోయే ప్రమాదముంది కనుక.. ముందుగా ఒక అంకె అనుకుని కార్డుతో కొనుగోళ్లకు సరిహద్దు గీస్తే మంచిది. అలాగే, క్రెడిట్ కార్డులో క్యాష్ సదుపాయం కూడా ఉంది కదాని.. పొరపాటునైనా ఏటీఎంల నుంచి డ్రా చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే.. తీసిన రోజు నుంచే భారీ వడ్డీల వడ్డింపు మొదలైపోతుంది. తీసింది వందే అయినా లావాదేవీ చార్జీలని, వడ్డీలని నెల తిరిగేసరికి తడిసి మోపెడంత కట్టాల్సి వస్తుంది.
 
ఇక, నిలకడగా రాబడి లేని సందర్భాల్లో క్రెడిట్ కార్డులను సాధ్యమైనంత వరకూ వాడకపోవడమే మంచిది. ఫ్రీ క్రెడిట్ వ్యవధి అయిపోయే సమయానికి బిల్లు కట్టలేకపోతే.. పెనాల్టీలని, వాటిపై సర్‌చార్జీలని, వడ్డీలని బోలెడంత పెరుగుతూ పోతుంది. మరో విషయం.. కార్డు కంపెనీలు అప్పుడప్పుడు రివార్డు పాయింట్లు ఇస్తామంటూ ఊదరగొడుతుంటాయి. ఈ మాయలో పడి పాయింట్ల కోసం అవసరమున్నవీ, లేనివీ కొంటూ పోతే.. పాయింట్లు వస్తే రావొచ్చు గానీ.. భారీ బిల్లులు కూడా వస్తాయని గుర్తుంచుకోవాలి.

డిస్కౌంటు సేల్స్‌కి కూడా ఇది వర్తిస్తుంది. ఇక, చివరిగా .. క్రెడిట్ లిమిట్‌కి దగ్గరయిన కొద్దీ కార్డును వాడటం ఆపేయడం బెటర్. ఎందుకంటే .. కార్డు కంపెనీ మీకు క్రెడిట్ ఇచ్చినప్పటికీ.. మీరు దాన్ని వాడుకునే పద్ధతి, క్రమశిక్షణ గురించి ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. పూర్తిగా కార్డుపైనే ఆధారపడుతుంటే.. మీ ఆర్థిక క్రమశిక్షణ గురించి సందేహాలు వచ్చే అవకాశముంది.
 

Advertisement
 
Advertisement
Advertisement