Sir charge
-
విద్యార్థి పాసుపై ‘సర్వీస్’ చార్జ్
– బస్ పాస్ ఐడీ, రెన్యూవల్ చార్జీలు పెంచిన ప్రభుత్వం – ఏటా రూ. అర కోటికిపైగా విద్యార్థులపై అదనపు భారం – 50 వేల మంది విద్యార్థులపై ప్రభావం – సోమవారం నుంచే అమల్లోకి రాక కర్నూలు(రాజ్‌విహార్): పేద విద్యార్థులకు రాయితీలు ఇవ్వాల్సిన ప్రభుత్వం వారిపై భారాలు మోపుతోంది. ఇప్పుడు తాజాగా ఆర్టీసీ బస్ పాసుల ఐడెంటిటీ (ఫొటో గుర్తింపు)కార్డుల ధర, రెన్యూవల్స్ చార్జీని పెంచింది. ఇప్పటికే ఆన్లైన్లో బస్సు పాసుల మంజూరు విధానం అమల్లోకి తీసుకొచ్చి సర్వీసు చార్జీలను వసూలు చేస్తున్న సంస్థ తాజాగా వాటి ధర పెంచేసింది. దీంతో జిల్లాలోని మొత్తం 50 వేల మంది విద్యార్థులపై రూ. అర కోటికిపైగా అదనపు భారం పడింది. ఐడెంటిటీ కార్డుపై రూ.10 పెంచగా ప్రతి నెలా తీసుకునే రెన్యూవల్స్ పాస్ టికెట్‌పై రూ.5 పెంచేసింది. కొత్త చార్జీల ధరలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చేశాయి. – 50 వేల మంది విదా్యర్థులపై భారం: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్య వసతులు లేకపోవడంతో విద్యార్థులు సమీపంలోని పట్టణాలకు వెళ్లి విద్యా సంస్థలో చేరుతారు. హాస్టల్ సీటు రాని పక్షంలో ప్రభుత్వం ఇచ్చే రాయితీ పాసులు పొంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. విద్యా సంస్థలు తెరిచినప్పటి నుంచి పరీక్షలు ముగిసే వరకు పాసులను వినియోగించుకుంటారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50వేల మందికిపైగా విద్యార్థులు బస్ పాసుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. వీరందరిపై పెరిగిన భారం పడనుంది. – మోత అరకోటిపైనే.. జిల్లాలో దాదాపు 50 వేల మందికి పైగా విద్యార్థులు ఆర్టీసీ బస్‌పాసులు పొంది రాకపోకలు సాగిస్తున్నారు. పాస్ తీసుకునే మొదట్లో మంజూరు చేసే ఐడెంటిటీ కార్డు ధర రూ.30 ఉండగా రూ.10 పెంచి రూ.40 వసూలు చేస్తున్నారు. దీంతో 5లక్షల భారం పడనుంది. ప్రతి నెలా చెల్లించే రెన్యూవల్స్‌పై సర్వీసు చార్జీ రూ.15 ఉండగా రూ.5పెంచి రూ.20 వసూలు చేయనున్నారు. 50 వేల మంది 12 నెలల పాటు రెన్యూవల్స్ చేసుకుంటే రూ.30లక్షల వరకు అదనపు భారం పడనుంది. దీంతోపాటు దరఖాస్తు, వివరాల ఆన్లైన్ అప్లోడ్ కోసం రూ.15లక్షల వరకు భారం పడుతుంది. – ప్రతి ఏటా వాతలే: బస్పాసుల మంజూరు ప్రక్రియను ఆన్లైన్ చేస్తూ 2015 జూన్ 20వ తేదీన ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీ పరం చేసింది. అప్పట్లో మొదట పేర్లు, ఇతర వివరాల రిజిస్ట్రేషన్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.25 వసూలు చేసింది. దీంతో రూ.6.60లక్షల వరకు భారం పడగా ప్రతి నెలా రెన్యూవల్ కోసం రూ.10 వసూలు చేస్తూ మరో రూ.52.80లక్షల భారం వేసింది. మొత్తం ఏడాదికి రూ.59.40లక్షలు విద్యార్థులపై వేశారు. 2016లో రెన్యూవల్స్ చార్జీని రూ.10 నుంచి రూ.15కి పెంచారు. దీంతో రూ.30లక్షల భారం వేశారు. ఇప్పుడు తాజాగా ఐడెంటిటీ కార్డుల ధర, రెన్యూవల్స్ చార్జీని పెంచి రూ.50లక్షల వరకు భారం వేసింది. – ధరలు తగ్గించకపోతే ఆందోళలు: టి. అనిల్ కుమార్, వైఎస్ఆర్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు. ప్రభుత్వం పేద విద్యార్థుల బస్ పాసులపై పెంచిన ఐడెంటిటీ కార్డులు, రెన్యూవల్స్ ధరను వెంటనే తగ్గించాలి. లేని పక్షంలో విద్యార్థులతో కలసి ఆందోళనలు నిర్వహిస్తాం. – ఉచిత పాసుల హామీ నెరవేర్చాలి: లక్ష్మీ నరసింహ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్శి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇంటర్మీడియేట్ వరకు ఉచితంగా బస్ పాసులు ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చకుండా ప్రతి ఏటా పాసుల చార్జీలు పెంచి విద్యార్థులపై భారం వేస్తే సహించబోం. – ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు: శ్రీనివాసులు, డీసీటీఎం, ఆర్టీసీ, కర్నూలు. విద్యార్థి బస్ పాసుల ఐడెంటిటీ కార్డు, రెన్యూవల్స్ సర్వీసు చార్జీని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెంచి అమలు చేస్తున్నాం. ఐడీ కార్డులపై రూ.10, ప్రతి నెలా రెన్యూవల్స్‌పై రూ.5 విద్యార్థులు అదనంగా చెల్లించాలి. -
క్రెడిట్ కార్డు.. వాడకమూ తెలియాలి..
క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా వాడుకుంటే ఎంత ఉపయోగంగా ఉంటాయో.. అడ్డగోలుగా వాడితే అంతే సమస్యలూ తెచ్చిపెడతాయి. అందుకే క్రెడిట్ కార్డులను సురక్షితంగా వాడటం తెలియడం ఎంత ముఖ్యమో ఎప్పుడెప్పుడు వాడకూడదన్నది తెలియడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే.. బడ్జెట్ దాటిపోయే ప్రమాదముంది. కార్డులున్న వారిలో చాలామంది నిత్యావసరాలను కొనేందుకు కూడా వాటిని ఉపయోగిస్తుంటారు. కానీ, మరీ తరచుగా వాడేస్తే మనకు తెలియకుండానే నెలవారీ బడ్జెట్ చేతులు దాటిపోయే ప్రమాదముంది కనుక.. ముందుగా ఒక అంకె అనుకుని కార్డుతో కొనుగోళ్లకు సరిహద్దు గీస్తే మంచిది. అలాగే, క్రెడిట్ కార్డులో క్యాష్ సదుపాయం కూడా ఉంది కదాని.. పొరపాటునైనా ఏటీఎంల నుంచి డ్రా చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే.. తీసిన రోజు నుంచే భారీ వడ్డీల వడ్డింపు మొదలైపోతుంది. తీసింది వందే అయినా లావాదేవీ చార్జీలని, వడ్డీలని నెల తిరిగేసరికి తడిసి మోపెడంత కట్టాల్సి వస్తుంది. ఇక, నిలకడగా రాబడి లేని సందర్భాల్లో క్రెడిట్ కార్డులను సాధ్యమైనంత వరకూ వాడకపోవడమే మంచిది. ఫ్రీ క్రెడిట్ వ్యవధి అయిపోయే సమయానికి బిల్లు కట్టలేకపోతే.. పెనాల్టీలని, వాటిపై సర్చార్జీలని, వడ్డీలని బోలెడంత పెరుగుతూ పోతుంది. మరో విషయం.. కార్డు కంపెనీలు అప్పుడప్పుడు రివార్డు పాయింట్లు ఇస్తామంటూ ఊదరగొడుతుంటాయి. ఈ మాయలో పడి పాయింట్ల కోసం అవసరమున్నవీ, లేనివీ కొంటూ పోతే.. పాయింట్లు వస్తే రావొచ్చు గానీ.. భారీ బిల్లులు కూడా వస్తాయని గుర్తుంచుకోవాలి. డిస్కౌంటు సేల్స్‌కి కూడా ఇది వర్తిస్తుంది. ఇక, చివరిగా .. క్రెడిట్ లిమిట్కి దగ్గరయిన కొద్దీ కార్డును వాడటం ఆపేయడం బెటర్. ఎందుకంటే .. కార్డు కంపెనీ మీకు క్రెడిట్ ఇచ్చినప్పటికీ.. మీరు దాన్ని వాడుకునే పద్ధతి, క్రమశిక్షణ గురించి ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. పూర్తిగా కార్డుపైనే ఆధారపడుతుంటే.. మీ ఆర్థిక క్రమశిక్షణ గురించి సందేహాలు వచ్చే అవకాశముంది. -
గుండె గు‘బిల్లు’
సాక్షి, ఏలూరు: ఇంధన సర్దుబాటు చార్జీల భారం నుంచి జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు విముక్తి లభించడం లేదు. ఎప్పుడో వాడిన విద్యుత్‌కు సర్‌చార్జీ పేరుతో ఇప్పుడు బిల్లులు విధిస్తూ విద్యుత్ శాఖ ఇప్పటికే కోట్లాది రూపాయలు వసూలు చేసింది. తాజాగా 2011-12 త్రైమాసికానికి సంబంధించి దాదాపు రూ.43.86 కోట్లను వసూలు చేసేందుకు సిద్ధమైన విద్యుత్ శాఖ ఈ నెల బిల్లు నుంచే అదనపు చార్జీలు జోడిస్తోంది. వచ్చే సెప్టెంబర్ వరకు ఐదు నెలల పాటు ప్రతినెలా బిల్లులో ఇంధన చార్జీల వడ్డన తప్పదని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కోసం కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వాల్సిన సబ్సిడీలను ఎగ్గొట్టి జనం నుంచే సొమ్ములు వసూలు చేసుకోమని విద్యుత్ శాఖకు గత ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఎన్నికల ముందు వరకూ సర్‌చార్జీలను వసూలు చేశారు. దీనివల్ల విద్యుత్ శాఖ పరవు పోవడంతోపాటు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఇలా అయితే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని భావించిన ప్రభుత్వం సర్‌చార్జీలను తాత్కాలికంగా ఎత్తివేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల్లో లబ్ధికోసం ఈ నిర్ణయం తీసుకున్న అప్పటి అధికార పార్టీ ప్రజాగ్రహంలో కొట్టుకుపోయింది. ఎన్నికలు ము గియడంతో మళ్లీ సర్‌చార్జీల వసూలుకు విద్యుత్‌శాఖ సిద్ధమైంది. వాడిందొకరు.. కట్టేది మరొకరు విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గు, నాఫ్తా ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నందున పెరుగుదలలో వ్యత్యాసం మొత్తాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఈ చార్జీలనే సర్‌చార్జీలుగా పిలుస్తున్నారు. ఎప్పుడో వాడిన విద్యుత్‌ను అప్పట్లో ఉత్ప త్తి చేయడానికి అయిన ఖర్చును ఇప్పుడు వినియోగదారుడిపై వేయడమే ఈ చార్జీల్లోని ప్రధాన ఉద్దేశం. దీనివల్ల అద్దె ఇళ్లల్లో ఉండే వారిపై ఆర్థిక భారం పడుతోంది. ఎవరో వినియోగించుకున్న విద్యుత్‌కు బిల్లు వచ్చే నాటికి ఎవరు అద్దెకు ఉంటే వాళ్లే చెల్లించాల్సి వస్తోంది. అసలు వినియోగంపై పడే చార్జీల కంటే ఈ కొసరు చార్జీలు పెరిగి బిల్లు వందల రూపాయల స్థాయి దాటి వేల రూపాయల్లోకి చేరిపోయింది. రూ.195.96 కోట్లు సమర్పణ సర్‌చార్జీల పేరుతో జిల్లా ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. 2009-10 సంవత్సరానికి దాదాపు రూ.3 కోట్లను సర్‌చార్జీగా వసూలు చేయడాన్ని హైకోర్టు నిలిపివేసింది. ఈ కేసు ఇప్పటికీ తేలలేదు. 2010-11 సంవత్సర సర్‌చార్జీ రూ.4.22 కోట్లు, 2011-12 ఆర్థిక సంవత్సర త్రైమాసిక సర్‌చార్జీ రూ.44 కోట్లు వసూలు చేసేశారు. తాజాగా రెండో త్రైమాసిక చార్జీలు రూ.43.86 కోట్లు వసూలు చేస్తున్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.103.88 కోట్లు ఇప్పటికే విద్యుత్ బిల్లుతోపాటు వడ్డిస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలోని 11,81,672 మంది విద్యుత్ వినియోగదారుల నుంచి కేవలం ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.195.96 కోట్లను విద్యుత్ శాఖ వసూలు చేస్తోంది. అసలును మించిపోతున్న కొసరు వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి వచ్చే బిల్లుకంటే కొసరు చార్జీలు ఎక్కువగా ఉంటున్నాయి. 140 యూనిట్లు విద్యుత్ వాడిన విని యోగదారుడు చెల్లించాల్సిన బిల్లు రూ.404 మాత్రమే. కానీ ఆ బిల్లులో కష్టమర్ చార్జీ రూ.35, విద్యుత్ సుంకం రూ.8.40పైసలు, 2012-13 సర్‌చార్జీ రూ.454.89 పైసలు, 2011-12 సర్‌చార్జీ రూ.21.80 పైసలు చొప్పున మొత్తం రూ.924.09 వస్తోంది. అంటే అసలు కంటే కొసరు బిల్లు రూ.520.09 అధికం. ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లులు వస్తుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.