ఉత్తరాయణం మహా పుణ్యకాలం

Devotional Stories of Sun And Earth - Sakshi

మకర సంక్రాంతి పర్వదినంతో ఉత్తరాయణం మొదలయింది. మొన్నటివరకూ మనం సంకల్పంలో దక్షిణాయనే అని చెప్పుకున్నాం. సంక్రాంతినుంచి ఉత్తరాయణం అని చెప్పుకుంటున్నాం. ఉత్తరాయణానికి పుణ్యకాలం అని పేరు. అలా ఎందుకంటారో, ఈ పుణ్యకాలంలో మనం ఆచరించవలసిన విధులేమిటో తెలుసుకుందాం..

ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు. దక్షిణాయణానికి ఉండే ప్రత్యేకత వేరు. ఈ రెండు ఆయనాల మధ్య ఈ వైరుధ్య వైవిధ్యాలేమిటో తెలుసుకునేముందు ఆయనం అంటే ఏమిటో అవలోకిద్దాం. ఆయనం అంటే పయనించడం అని, ఉత్తర ఆయనం అంటే ఉత్తర వైపుకి పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించడం తరువాత దక్షిణం వైపు నించి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయణం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. అయితే, సూర్యుడు సంవత్సరంలో ఆర్నెలలు దక్షిణం వైపు, మరో ఆరు నెలలు ఉత్తరదిశగానూ పయనిస్తూ ఉంటాడు.

సాధారణంగా ఉత్తరాయణం జనవరి 14 లేదా 15 నుండి జూలై 17 వరకు వుంటుంది. దక్షిణాయణం జూలై 17 నుండి జనవరి 14 వరకు వుంటుంది. (ఒక రోజు అటూ ఇటూ కావచ్చు) ఉత్తరాయణంలో పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా వుండడం వలన పుణ్య క్షేత్ర సందర్శనలు, తీర్థయాత్రలకు అనువుగా వుంటుంది... మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రంగా భావించడం వల్ల, వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్ల, శరీరంలో ఉత్తర భాగాన్ని విశిష్టమైనదిగా భావించడం వల్ల, మన భారతీయ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్ల, అన్ని భాషలకూ అమ్మగా, రాజభాషగా, దేవభాషగా చెప్పుకునే సంస్కృతం ఉత్తరాదిన పుట్టడం వల్ల, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస స్థానాలు కావటం వల్ల, ముఖ్యంగా సూర్యభగవానుడు ఉత్తర ప«థ చలనం చేయడం వల్ల... ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావించి గౌరవించారు పెద్దలు. అంతేగాక, కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఒరిగిన భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలారు.

ఈ ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి, పుష్పించి, కాయలు కాచి మధుర ఫలాలు అందిస్తాయి. ఈ కాలంలోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తారనీ, ఎక్కువగా ఈ కాలంలోనే కుమారీమణులు పుష్పవతులు అవుతారని, స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది ఈ కాలంలోనే అనీ విజ్ఞానశాస్త్రం కూడా చెబుతోంది. బహుశా ఇందుకేనేమో ఉత్తరాయణ కాలం పుణ్య కాలం అయింది.భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రింబగళ్లు ఉంటాయి. సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలుగాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం ఈ పండుగలను జరపడం మొదలు పెట్టారు.

ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. వామనావతార ఘట్టంలో వామనుడికి బలి మూడడగుల నేలను దానం చేశాడని, ఆ మూడడుగులతో ముల్లోకాలకూ వ్యాపించి బ్రహ్మాండమంతా తన రెండడుగులతోనే కొలిచి, మూడవపాదాన్ని బలి శిరస్సున మోపి పాతాళానికి పంపినది ఉత్తరాయణ పుణ్యకాలంలోనేనని గరుడపురాణం పేర్కొంటోంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే ఏ దానమైనా శ్రేష్టమైనదే. ఈ దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. గోవును దానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని   విశ్వాసం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top