జయహో రాజమ్మ తల్లీ...

The devotees in Sundays will smile like the festival - Sakshi

ప్రతి సంవత్సరం ... మాఘమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం తొలి ఆదివారం వరకు ఐదు వారాలు... లక్షలాది మంది భక్తులు.... రాత్రంతా కటిక చీకట్లోనే జాగారం...విషకీటకాలు యథేచ్ఛగా సంచరించే ఆ తోటలో భక్తులెవ్వరినీ కనీసం చీమ కూడా కుట్టిన ఆనవాళ్లు లేవెన్నడూ. అంతేకాదు, వంటినిండా బంగారు ఆభరణాలతో ఉన్న మహిళలకు కూడా చిన్న సూది కూడా పోగొట్టుకున్న దాఖలాలు లేదెప్పుడూ . అమ్మను నమ్ముకుంటే ఆవంత అపకారం కూడా జరగదని భక్తుల నమ్మకం. అందుకే లక్షలాదిమంది భక్తులు అక్కడ ఉన్నా, కాపలాకు రక్షకభటులు రారు... శనివారం రాత్రి జాగారం చేసి, ఆదివారం ఉదయం స్నానాలు చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని భక్తి పారవశ్యంతో తిరుగు ప్రయాణం అవుతారు. అందుకే భక్తులు జయహో రాజమ్మ... జయహో రాజమ్మ అని దిక్కులు పిక్కటిల్లేలా పలుకుతుంటారు.

శ్రీకాకుళం జిల్లా వత్సవలస రాజమ్మతల్లి సంబరాల్లో అమ్మవారి మహిమకు ఆనవాళ్లివి....స్థలపురాణం ప్రకారం... బొబ్బిలియుద్ధం జరగడానికి కొద్దిరోజుల ముందు... విజయనగర సామ్రాజ్యలక్ష్మి, పూసపాటి రాజుల ఆరాధ్యదేవత రాజరాజేశ్వరి విజయనగర రాజులలో చివరివాడైన పూసపాటి విజయరామరాయలుకు బాలిక రూపంలో కలలో కన్పించింది. త్వరలోనే జరగనున్న యుద్ధంలో మీ సామ్రాజ్యమంతా వేరే రాజ్యంలో కలవబోతుందని హెచ్చరించింది. నిద్రనుంచి మేలుకున్న ఆ చక్రవర్తి... తమను కాపాడలేని దేవతకు ఇక పూజలెందుకు దండగ... అంటూ అమ్మవారి విగ్రహాన్ని, ఇతర పరివార దేవతల విగ్రహాలను ఓ చెక్కపెట్టెలో పెట్టి తాళం వేసి సమీపంలోని ఓ నదిలో విడిచిపెట్టారట. ఆ పెట్టె నదిలో నుంచి కొట్టుకుని పోయి వత్సవలస సమీపంలో మైలపల్లి వంశస్తులైన కొందరు మత్స్యకారుల వలలో చిక్కింది. ఆ జాలర్లు  పెట్టెను తెరిచే ప్రయత్నం చేశారు.

ఇంతలో వారికి ‘నేను ఓ శక్తిని... నన్ను కొలుస్తామంటేనే పెట్టె మూత తెరవండి.. లేదంటే అలానే సముద్రంలోనే కలిపేయండి’ అని ఓ చిన్న బాలిక స్వరం వినిపించింది. ఆ వాణిని విన్న జాలర్లు ‘అమ్మా! మాకే జీవనం కష్టంగా ఉంది... ఇక నిన్ను ఎలా కొలవాలో చెప్పమని కోరగా ‘ముందు నన్ను తీసుకుని వెళ్లి, మీ ఇంటిలో పెట్టండి.. నన్ను సందర్శించేందుకు భక్తులే ఇక్కడికే వస్తూంటారు... ప్రతి ఏడాది ఆ సంఖ్య పెరుగుతుండేలా చేస్తాను. నన్ను నమ్మితే చాలు... ఏదైనా చేస్తా’ అని అభయం ఇచ్చింది అమ్మ. దాంతో జాలరులు ఆ మూర్తులను ఇప్పటికి ఏడుతరాల కిందట ఉన్న ఓ పూరింట్లోపెట్టి, పూజించడం ప్రారంభించారు. అమ్మవారి మహిమతో వారందరికీ అన్నీ శుభాలే జరుగుతుండడం, పట్టిందల్లా బంగారం అవుతుండడంత భక్తులు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. అది మొదలు ప్రతి ఏటా లక్షలాది భక్తులు వచ్చి అమ్మను సందర్శించుకుని మొక్కులు మొక్కుకోవడం, అవి తీర్చుకునేందుకు మరుసటి ఏడాది తిరిగి వస్తుండడంతో అది జాతరగా మారింది. 

రాజరాజేశ్వరి నుంచి రాజమ్మతల్లిగా...
నిరక్షరాస్యులుగా ఉన్న జాలర్లు రాజరాజేశ్వరి మాతను రాజమ్మ అని పిలుస్తూండేవారు. తమ కుటుంబంలో పుట్టిన సంతానం తొలి తల కొప్పు(పుట్టు వెంట్రుకలు)ను అక్కడే సమర్పిస్తారు. ముడుపులు చెల్లించుకొని అక్కడే భోజనం చేసి తిరుగుప్రయాణం చేస్తారు...

మకర సంక్రాంతి తర్వాత వత్సవలసకు...
వందల సంవత్సరాలుగా భక్తుల ఇలవేల్పుగా ఉంటున్న రాజమ్మతల్లి మకరసంక్రాంతి నుంచి తమ ప్రధాన భక్తులుగా భావించిన వత్సవలస మైలపల్లి (జాలర్లు) స్వగృహాలకు చేరుకుంటుంది. తాను దొరికిన మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మైలపల్లి వంశస్తులకు దర్శనమిస్తూ  భక్తుల కోర్కెలను నెరవేరుస్తుందని నమ్మకం. అలా మాఘమాసంలోని శని, ఆదివారాల్లో వచ్చిన భక్తులతో ఉత్సవం మాదిరిగా శోభిల్లుతుంది వాతావరణం.

రౌద్ర రూపం నుంచి సాత్వికం.... 
మకర సంక్రాంతి తరువాత వచ్చిన రాజమ్మ తల్లి  మాఘ మాసంలో 5 వారాలు లేదా 4 వారాలు పాటు ఇక్కడ రౌద్ర రూపంలో భక్తుల నుంచి ముడుపులు స్వీకరిస్తుంది. అనంతరం మరో 15 రోజులు (ఫాల్గుణంలోని కొన్ని రోజులు) మైలపల్లి ఇళ్లవద్దే ఉండి ఫాల్గుణ శుద్ధ దశమి నుంచి భక్తులు ఉన్న గ్రామాలు, పట్టణాల్లో సంచరిస్తూ మనల్ని కాపాడుతుంటుందని నమ్ముతుంటారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని ( కాకుళం, విజయనగరం, విశాఖపట్నం) ప్రతి గ్రామంలో అమ్మవారికి భక్తులుంటారు. వీరంతా ఇక్కడికి ప్రతి ఏటా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు...

మొక్కులిలా...
కుటుంబంలోని సభ్యులందరూ శనివారం సాయంత్రానికి వత్సవలస చేరుకుంటారు. రాత్రంతా జాగరణ చేసి ఆదివారం అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. రాత్రి జాగరణ చేసిన వారికి అనారోగ్యం దరి చేరదని విశ్వాసం. ఏడాది పొడవునా అమ్మవారిని స్మరించుకొని సంతానం కలిగితే ముడుపు చెల్లించుకుంటానని మొక్కుతుంటారు. ఆ క్రమంలో కోళ్లు, గొర్రెపిల్లలు, బంగారం, బియ్యం, వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, ధనం, చిన్నారుల తల వెంట్రుకలు... ఇలా అన్నీ చెల్లిస్తామని మొక్కడం... ఆ మేరకు ఆదివారం ఉదయాన్నే చెల్లించడం ఆనవాయితీ. 

కోరిన కోర్కెలు తీర్చే తల్లి...
సంతాన రాజమ్మగా... ఉత్సవంలో పాల్గొని భక్తితో అమ్మవారిని కొలిస్తే పిల్లలు కలగని దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుందని నమ్మకం. దాసుడు వేషధారి సమయంలో మంగళ వాయిద్యాల నడుమ భూలోకమ్మ గుడికి వెళ్తున్న సమయంలో దంపతులు భక్తితో మొక్కుకుంటే సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతుంటారు. 
రుప్ప వెంకట శ్రీనివాస్,
 సాక్షి, గార, శ్రీకాకుళం జిల్లా

తరతరాలుగా మా ఇలవేల్పు..
విజయనగరం రాజులు కొలుచుకునే సామ్రాజ్యలక్ష్మి రాజరాజశ్వేరి మా సమీపంలో సముద్రంలో దొరకడం, తరతరాలుగా మావంశస్తులు అమ్మని కొలవడం జరుగుతోంది. అమ్మని నమ్ముకున్న  భక్తులు ప్రతీ ఏటా తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇప్పటివరకు 5 వారాల్లో ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోలేదంటే అమ్మవారి మహిమను నమ్మి తీరాల్సిందే కదా! 
మైలపిల్లి శ్రీనివాసదాసు, వత్సవలస

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top