
కిక్ కాదు...కాంగో కసి
1974 ఫిఫా ప్రపంచకప్...గ్రూప్ 2లో బ్రెజిల్-జైర్ (కాంగో) జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతోంది. అప్పటికే బ్రెజిల్ 3-0 ఆధిక్యంలో ఉంది.
1974 ఫిఫా ప్రపంచకప్...గ్రూప్ 2లో బ్రెజిల్-జైర్ (కాంగో) జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతోంది. అప్పటికే బ్రెజిల్ 3-0 ఆధిక్యంలో ఉంది. మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా బ్రెజిల్‌కు మరో ఫ్రీ కిక్ అవకాశం వచ్చింది. పెనాల్టీ ఏరియా బయట బంతి ఉంచి బ్రెజిల్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. మరో వైపు జైర్ ప్లేయర్లు కూడా గోడ కట్టి డిఫెన్స్ కోసం తమవంతు ప్రయత్నంలో ఉన్నారు.
ఇక రిఫరీ విజిల్ మోగించడమే మిగిలింది. అయితే ఈ సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. జైర్ ఆటగాడు అలుంగ ఎంవెపు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చాడు. అదేదో తనకే ఫ్రీ కిక్ అవకాశం ఇచ్చినట్లుగా మెరుపులా పరుగెత్తి కిక్ కొట్టాడు. అంతే...అందరికీ ఏం జరిగిందో ఒక్క క్షణం పాటు అర్ధం కాలేదు.
ఈ దశలో కల్పించుకున్న రిఫరీ, అలుంగకు ఎల్లో కార్డ్ చూపించి బయటికి పంపించాడు. ఇది అసలు బుద్ధి లేని పనంటూ కామెంటేటర్లు చెలరేగిపోతే, జైర్ ఆటగాళ్లకు ఫుట్‌బాల్ నిబంధనలే తెలియవంటూ మరికొందరు వంత పాడుతూ దాన్నో సరదా సంఘటనగా చెప్పుకున్నారు.
ఆ ఏడాది ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ చాంపియన్‌గా నిలిచిన జైర్ జట్టుకు నిజంగా నిబంధనలు తెలియవా...ఈ ఘటనలోని వాస్తవాన్ని ఆ తర్వాత అలుంగ బయట పెట్టాడు. వరల్డ్ కప్‌లో అప్పటికే స్కాట్లాండ్ చేతిలో 0-2తో, యుగొస్లేవియా చేతిలో 0-9తో ఓడిన జైర్‌కు ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్యగా మారింది. ఆ దేశాధ్యక్షుడు మొబుటు అప్పటికే తన సొంత సైనికుల ద్వారా ఆటగాళ్లకు సమాచారం అందించాడు.
బ్రెజిల్‌తో గనక 4-0తో ఓడితే ఇక దేశానికి తిరిగి రానవసరం లేదని, కనీసం తిండి ఖర్చులు కూడా ఇవ్వనని హెచ్చరించాడు. ఒక రకమైన భయం ఆవహించిన ఆటగాళ్లకు ఏమీ అర్థం కాలేదు. దాంతో ఏదో రకంగా సమయం వృథా చేసైనా నాలుగో గోల్‌ను ఆపాలని ఎంవెపు అనుకున్నాడు. తన అసహనాన్ని, నిరసనను ఆ రకంగా వ్యక్తం చేశాడు.
మా బాధలు, కష్టాలు మీకేం తెలుసంటూ కిక్ కొడుతున్న సమయంలో యూ బాస్టర్డ్స్ అంటూ బ్రెజిల్ ఆటగాళ్ళను తిట్టాడు. ఇంతా చేస్తే ఆ నాలుగో గోల్ అయితే కాలేదు కానీ 0-3తో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత స్వదేశానికి వెళ్లాక దేశాధ్యక్షుడు దాదాపుగా అన్నంత పనీ చేశాడు. వరల్డ్ కప్ ఆడినందుకు ఇవ్వాల్సిన కనీస ఖర్చులు కూడా అందనీయలేదు. చివరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో కష్టాలు, పేదరికం మధ్యనే వారి జీవితం గడిచింది.