నల్ల కోళ్లు నాలుగు విధాల మేలు!

Black chickens are good - Sakshi

పెంపకంపై తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆసక్తి

‘నలుపు రంగు’.. అయితేనేం? మాంసం రుచి అదరహో! ప్రొటీన్ల శాతం కూడా ఎక్కువే.. కొవ్వు తక్కువ. ఇంకెన్నో సుగుణాలు కల్గిన ‘కడక్‌నాథ్‌’ అనే నల్ల కోళ్ల పెంపకంపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఆసక్తి పెరుగుతోంది. రైతులు వ్యవసాయానికి అనుబంధంగా అదనపు ఆదాయ వనరుగా ఈ కోళ్ల పెంపకం చేపడుతున్నారు. హైదరాబాద్‌ నగర శివారు ఫాం హౌజ్‌లలో ‘కడక్‌ నాథ్‌’ కోళ్ల సందడి వినిపిస్తోంది. స్థానిక పెరటి కోళ్ల మాదిరిగానే.. వీటి పోషణకు పెద్దగా ఖర్చు లేకుండా మంచి ఆదాయం పొందే అవకాశాలున్నాయి.

ముఖ్యంగా పంట పొలాల వద్ద ఈ కోళ్ల పోషణ చేపడితే.. పంటలకు ఆశించే పురుగులను తిని పంట ఎదుగుదలకు దోహదపడతాయి. కోళ్ల విసర్జితాలు పంటకు మంచి ఎరువు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ కోళ్ల పెంపకంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలైన ఝూబువా, అలీరాజ్‌పూర్‌ పరిసరాల్లో భీల్, భిలాలా తెగ ప్రజలు వందల ఏళ్ల నుంచి ఈ జాతి కోళ్లను పెంచుతున్నారు. కొలెస్ట్రాల్‌ శాతం చాలా తక్కువ. ఐరన్‌ శాతం మామూలు కోళ్ల కంటే పది శాతం ఎక్కువ అని చెబుతున్నారు.

కిలో మాంసం రూ.700 నుంచి రూ.వెయ్యి, గుడ్డు ధర రూ.40–50 పైనే. గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. పిల్లలు నీలం, నలుపూ తెలుపూ చారలతో ఉండి, పెరిగే కొద్దీ నలుపు రంగులోకి మారుతాయి. శంషాబాద్‌ రూరల్‌ ప్రాంతంలో సురేశ్‌ అనే యువ రైతు సేంద్రియ పద్ధతిలో ఈ కోళ్లను పెంచి, మాంసం అమ్ముతున్నారు. వీటి గుడ్లను హేచరీలో పొదగేసి ఒక్కో పిల్లను రూ.80లకు అమ్ముతున్నారు. కడక్‌నాథ్‌ కోళ్ల పోషణ చాలా సులువని, 5 నెలల్లో అమ్మకానికి తగినంత పెరుగుతాయని సురేశ్‌(99599 52345) చెబుతున్నారు.

           సురేశ్‌

– బుర్గు ప్రభాకర్‌రెడ్డి, శంషాబాద్‌ రూరల్‌ (రాజేంద్రనగర్‌), రంగారెడ్డి జిల్లా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top