నో యాక్టింగ్‌ పండూ..

Bigg Boss Telugu Season 3 Special Story - Sakshi

‘మన్మథుడి’ సినిమాలో నాగార్జునని చూస్తే ‘బాస్‌ అంటే ఇలా ఉండాలి’ అనిపిస్తుంది! సీరియస్‌గా ఉంటాడు. చిలిపిగానూ ఉంటాడు. ‘ఉప్పర్‌ మీటింగ్‌ ఏంటి?’ అంటాడు. ఉత్సాహం నింపుతాడు. ఇప్పుడా బాస్‌.. బిగ్‌బాస్‌–3 హోస్ట్‌గా వస్తున్నాడు. మరి ఇక్కడ ఎలా ఉండబోతున్నాడు? మరింత డీసెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా, డిలైట్‌ఫుల్‌గా.. ఈ బిగ్‌ షోను నడిపించబోతున్నాడు. టీజర్‌లను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

‘‘ఆకాశం ఎర్రగా ఉంది’’ అన్నాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆకాశంలోకి చూడకుండానే! ‘‘మామూలుగానే ఉందే’’ అన్నాడు నాగార్జున. ఆకాశంలోకి చూసి. సిటీలోని ఓ ఎత్తయిన భవంతిలో, ఆఖరి అంతస్థులో నిలుచుని ఉన్నారు ఇద్దరూ.  ఇద్దరూ బ్లాక్‌ సూట్‌లో ఉన్నారు. ఇద్దరికీ నల్ల కళ్లద్దాలు ఉన్నాయి. ఇద్దరి చేతుల్లో లెదర్‌ సూట్‌కేస్‌లు ఉన్నాయి. వాళ్ల బ్యాక్‌గ్రౌండ్‌లోకి ‘ట.. ట్ట.. డా.. య్‌’ అని జేమ్స్‌బాండ్‌ 007 సిగ్నేచర్‌ ట్యూన్‌ వచ్చి వెళుతోంది. వాళ్ల సీక్రెట్‌ మీటింగ్‌ అది. ఆకాశం ‘మామూలుగానే ఉందే’ అని నాగార్జున అనడంతోనే.. ‘‘కోడ్‌ వర్డ్‌. ఫోన్‌లో చెప్పాను కదా’’ అన్నాడు అసహనంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం.
వెంటనే నాగార్జున తన ప్యాంటు జేబులోంచి ఓ చీటి తీసి అందులో రాసిపెట్టుకున్న కోడ్‌ని చదువుతూ, ‘‘అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు’’ అన్నాడు. వెంటనే ధ.సు. (ధర్మవరపు సుబ్రహ్మణ్యం) నవ్వాడు. వాళ్లిద్దరూ అదే ఫస్ట్‌ టైమ్‌ చూసుకోవడం, అదే ఫస్ట్‌ టైమ్‌ కలుసుకోవడం. అదే ఫస్ట్‌ టైమ్‌ మాట్లాడుకోవడం.

‘బాలసుబ్రహ్మణ్యం’ అన్నాడు ధ.సు. చెయ్యిస్తూ.‘అభిరామ్‌’ అన్నాడు నాగార్జున.. చేతికి చెయ్యిస్తూ.‘‘మీరు మైక్‌ తెచ్చారా?.. అన్నాడు నాగార్జున.‘‘మీరు క్యాష్‌ తెచ్చారా?’’ అడిగాడు ధ.సు.
నాగార్జున సూట్‌కేస్‌ని చూపించాడు. ధ.ను. ఇక మొదలుపెట్టాడు.‘‘యాక్చువల్‌గా ప్రపంచంలో ప్రతి మనిషికీ తన గురించి అవతలివాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అది సహజం. ఇన్‌ఫ్యాక్ట్‌..’’ అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే.. ‘‘ఇదంతా రాత్రి టీవీలో విన్నాను’’ అన్నాడు నాగార్జున.టీవీలో ధర్మవరపు సుబ్రహణ్యం తను కనిపెట్టిన సీక్రెట్‌ మైక్‌ గురించి చెబుతున్నప్పుడు అది చూసి, అలాంటి ఒక సీక్రెట్‌ మైక్‌ కోసం ఆర్డర్‌ ఇచ్చి ఉంటాడు నాగార్జున. అందుకోసమే రహస్యంగా వాళ్లిద్దరూ అక్కడ కలుసుకున్నారు.ప్రాడక్ట్‌ని అమ్ముకోడానికి వచ్చినవాళ్లు భలే తమాషాగా మాట్లాడతారు. అది ఒకసారికి వినడానికి బాగుంటుంది. రెండోసారికీ వినడానికి బాగానే ఉంటుంది. మరోసారికి.. వినడానికి ఏముందీ అనిపిస్తుంది. అందుకే ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ‘యాక్చువల్‌గా ప్రపంచంలో ప్రతిమనిషికీ..’ అని మొదలు పెట్టగానే.. ‘విన్నాను’ అని కట్‌ చేస్తాడు నాగార్జున. ‘మన్మథుడు’ సినిమాలోని ఒక పాపులర్‌ సీన్‌ ఇది.

స్టార్‌ ‘మా’లో మళ్లీ బిగ్‌బాస్‌ రియాల్టీ షో ఈ ఆదివారం నుంచి మొదలవబోతోంది! మూడో షో ఇది. వందరోజుల షో. ఇరవై నాలుగు గంటలూ అరవై నాలుగు సీక్రెట్‌ కెమెరాలు తిరుగుతుండే షో. ధర్మవరపు కనిపెట్టిన సీక్రెట్‌ మైక్‌ లాంటిదే.. రెండేళ్లుగా స్టార్‌ ‘మా’ ప్రసారం చేస్తున్న ఈ బిగ్‌బాస్‌ రియాల్టీ షో. అది ఆడియో. ఇది వీడియో.‘‘ఇది మైక్‌. ఇది రిసీవర్‌. ఇది ఏంటెనా. మీరు ఎవరి మాటలు వినాలనుకుంటున్నారో వాళ్ల టేబుల్‌ కింద ఈ మైక్‌ పెట్టండి. మీ టేబుల్‌ కింద ఈ ఏంటెనా పెట్టండి. చెవులో రిసీవర్‌ పెట్టుకోండి. వాళ్లు మాట్లాడుకునేవన్నీ తెలిసిపోతాయి’’ అని డెమో ఇస్తాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.

స్టార్‌ ‘మా’ బిగ్‌బాస్‌ షో కూడా రెండేళ్ల క్రితం ఇలాగే ప్రోమోలతో మొదలైంది. ఈ జూలై 21 మొదలవబోతున్నది ‘బిగ్‌బాస్‌ 3’ షో. కొత్తగా ప్రోమోలేమీ ఇవ్వకుండానే బిగ్‌బాస్‌ షో ఎలా ఉంటుందో ఇప్పుడు టీవీ ఉన్న ప్రతిఇంటికీ, రోజూ రాత్రి తొమ్మిది అయ్యేసరికి తీరిక చేసుకునే ప్రతి కంటికీ తెలుసు.  ఓ పెద్ద ఇల్లు ఉంటుంది. అది బిగ్‌ హౌస్‌. అందులో మనకు తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు పదహారు లేదా పద్నాలుగు మంది ఉంటారు. వాళ్లంతా హౌస్‌ మేట్స్‌. వాళ్లందరికీ ఓ పెద్ద ఉంటాడు. ఆయనే బిగ్‌బాస్‌ కంటికి కనిపించడు. చెవికి వినిపిస్తుంటాడు . మొదటి షోకి జూనియర్‌ ఎన్టీఆర్, రెండో షోకి నానీ బిగ్‌ బాస్‌ హోస్ట్‌లు. ఇప్పుడీ మూడో షోకి హోస్ట్‌.. నాగార్జున. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా కంటెస్టెంట్‌లు మూడు నెలల పాటు హౌస్‌ లోపలే ఉండిపోతారు. చూడ్డానికి టీవీలు ఉండవు. చదవడానికి పేపర్లు ఉండవు. మాట్లాడుకోడానికి ఫోన్‌లు ఉండవు. ‘ఏదో తింటున్నానంతే.. ఏదో ఉంటున్నానంతే..’ అని ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఇలియానా పాడుతుంది. అలా పడి ఉంటారు. పడి ఉండలేని వాళ్లు పక్కవాళ్ల మీద పడుతుంటారు. వాళ్లలోనే ఏడ్చేవాళ్లుంటారు. ఏడ్చిమొత్తుకునేవాళ్లుంటారు. నవ్వేవాళ్లుంటారు. నవ్వించి కవ్వించేవాళ్లు ఉంటారు. పువ్వులాంటి వాళ్లుంటారు. ముల్లులా గుచ్చి గుచ్చి చంపేవాళ్లు ఉంటారు. ప్రపంచంలో ఎన్ని రకాల మనస్తత్వాల వాళ్లుంటారో అన్ని మనస్తత్వాలూ ఈ హౌస్‌లో ఉంటాయి. ఆ తత్వాలన్నీ హౌస్‌లోని రహస్య కెమెరాల్లోంచి మన కంట (టీవీ చూస్తున్నవారి కంట) పడుతుంటాయి. బిగ్‌ హౌస్‌లో అనూహ్యంగా, చిత్ర విచిత్రంగా తలెత్తే పరిస్థితులలో.. నటించినట్లుగా కాకుండా సహజమైన కదలికలు ఉన్నవారే అంతిమంగా విజేతలు. అయితే ఒట్టి సహజత్వమే విజేతను చెయ్యదు. గొంతు మాత్రమే వినిపించే బిగ్‌ బాస్‌.. (బిగ్‌బాస్, బిగ్‌బాస్‌ హోస్ట్‌ ఒకరు కాదు) తరచు హౌస్‌లోని వాళ్లకేవో ఆదేశాలు ఇస్తుంటాడు. బాధ్యతలను పురమాయిస్తుంటాడు. ఆ ప్రకారం చెయ్యాలి. ఆటలు ఆడించాలి. ఆగ్రహించాలి. çహౌస్‌ని ఆర్డర్‌లో పెట్టాలి. ఎవరు ఎప్పుడు హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతారో ఊహించలేం. ఆ ఎలిమినేట్‌ అయినవాళ్లు హౌస్‌ నుంచి వెళ్లిపోతుంటే చూడాలి.. మన ఇంట్లోంచి కూడా ఇంటి గేట్‌లోకి కన్నీళ్లు ప్రవహించేస్తుంటాయి. అంత నేచురల్‌గా ఉంటుంది రియాల్టీ షో.

నాటకీయత లేకపోవడం బిగ్‌ హౌస్‌ ప్రత్యేకత అయితే, నాటకీయతే బిగ్‌ బాస్‌ షో ప్రచారానికి ప్రాణం తొలి, మొదటి రెండు బిగ్‌ బాస్‌ షోలతో పోలిస్తే మూడో బిగ్‌ బాస్‌ ప్రమోషన్‌లో నాటకీయత కాస్త ఎక్కువగానే ఉంది. అసలు బిగ్‌ బాస్‌ 3 హోస్ట్‌ ఎవరన్నదానిపైనే స్టార్‌ ‘మా’ ఒక  ప్రోమోను విడుదల చేసింది. ‘కమింగ్‌ సూన్‌’ ప్రోమో అది. నెలక్రితం విడుదలైంది. ఒక స్వామీజీ ప్రవచిస్తూ ఉంటారు. ఆయన చుట్టూ చిన్నా పెద్ద, పిల్లా జల్లా చేరి ఉంటారు.

‘‘హ.. హ.. మనసు కోతిలాంటిది. మరి అలాంటి మనసున్న మనుషులు ఓ ఇంట్లో చేరితే? మమకారంతో, వెటకారంతో వారిని ఏకతాటిపైకి తెచ్చేదెవరు? అధికారంతో నడిపేది ఎవరు? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపే శక్తి గల వ్యక్తి ఎవరు?’’ అని స్వామీ అడుగుతుంటాడు. అలా ఎవరు... ఎవరు.. ఎవరు.. అని ఆయన అంటున్నప్పుడు హుడెడ్‌ కోటులో ముఖం కనిపించకుండా, వెనక్కు తిరిగి చూడకుండా ఒక పొడవాటి వ్యక్తి (నాగార్జున).. ఇంటి గోడలకు అంటించి ఉన్న బిగ్‌ బాస్‌ 3 పోస్టర్‌ వైపు వేలు చూపించి వెళ్లిపోతాడు. ఆ టీజర్‌ బాగా ఆసక్తిని రేకెత్తించింది.

తర్వాతి ప్రోమోలో ‘నో యాక్టింగ్‌.. ఓన్లీ రియాలిటీ’ అంటూ డైరెక్టుగా నాగార్జునే సీన్‌లోకి వచ్చేస్తాడు.
సీన్‌ నెం.1: పారిశుధ్య కార్మికులు రోడ్డు ఊడుస్తుంటారు. అటుగా వచ్చిన రాజకీయ నాయకుడు సడన్‌గా కారులోంచి దిగి వాళ్ల చేతుల్లోని చీపురు లాక్కుని రోడ్డు ఊడ్వడం మొదలు పెడతాడు! ఆ సీన్‌ని చూస్తూ ‘యాక్టింగ్‌ పండూ..’ తన చేతిలోని కోతి బొమ్మతో అంటాడు నాగార్జున.
సీన్‌ నెం.2 : ఒక అమ్మాయి.. ఆల్రెడీ వేసి ఉన్న ముగ్గు మీద.. ముగ్గు వేస్తున్నట్లుగా చెయ్యిపెట్టి, ఇంకో చేత్తో సెల్ఫీ తీసుకుని ‘మై ఫస్ట్‌ రంగోలి’ అని పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. ఆ ముగ్గుకు ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తున్న ఆవిడ, ‘‘ఏయ్‌ ముగ్గేస్తుంటే కనబడటం లేదా. జరుగూ’ అని ఆ అమ్మాయిని కసురుకుంటుంది. ఆ సీన్‌ని చూసి ‘పోజింగూ’ అంటాడు నాగార్జున.
సీన్‌ నెం.3: భార్యాభర్తలు గొడవపడుతుంటారు. వాళ్ల పిల్లాడు స్మార్ట్‌ ఫోన్‌లో ఆ గొడవను షూట్‌ చేస్తున్నాడని తెలిసి నవ్వు ముఖాలు పెట్టుకుని ఒకరికొకరు దగ్గరకు జరుగుతారు. ఆ సీన్‌ చూసి.. ‘ఫ్యామిలీస్‌ పండూ.. కవరింగు’ అంటాడు నాగార్జున.

ఇంకా ఇలాంటి సీన్లు మరో రెండుంటాయి. పెళ్లి భోజనం గబగబా, ఆబగా లాగించేస్తున్నవాళ్లు వీడియోగ్రాఫర్‌ వాళ్లవైపు రాగానే మెల్లిగా తింటున్నట్లు నటిస్తారు. ఓ కుర్రాడైతే వీడియో కాల్‌లో తన గర్ల్‌ ఫ్రెండ్‌ ‘వేర్‌ ఆర్‌ యూ?’ అని అడగ్గానే ‘ఐయామ్‌ ఎట్‌ ద బీచ్‌. గోవా.. గోవా..’ అని చెబుతాడు. నిజానికి అతడు ఉన్నది ఇళ్లు కట్టేచోట ఇసుకలో!అప్పుడంటాడు నాగార్జున.. ‘కెమెరా ఆన్‌ కాగానే యాక్టింగ్‌ మొదలు పెట్టేస్తారు అందరూ. కానీ అదక్కడ కుదరదు. నో యాక్టింగ్‌. ఓన్లీ రియాలిటీ’ అని.

మూడో ప్రోమో కర్టెన్‌ రైజర్‌లాంటిది.
రైతు బజార్‌లోకి అడుగు పెడతాడు నాగార్జున. మొదటి టీజర్‌లోని సేమ్‌ అదే హుడెడ్‌ కోట్‌తో. అతడి చేతివేళ్ల మధ్య కోతిబొమ్మ వేలాడుతుంటుంది. మార్కెట్‌లో అకస్మాత్తుగా ఆయన్ని చూసి అక్కడివాళ్లంతా.. పూలమ్ముకునే అమ్మాయిలు, టీ కాచే కుర్రాడు, కోడిగుడ్ల వ్యాపారీ.. అంతా ఉక్కిరిబిక్కిరి అవుతారు. తలపై నుంచి హుడ్‌ని తొలగిస్తాడు నాగార్జున.

‘‘సార్‌..’ అంటాడు గుడ్ల వ్యాపారి.
‘‘ఏంటి.. గుడ్లప్పగించి చూస్తున్నావ్‌. గుడ్లివ్వు’’ అంటాడు నాగార్జున.
‘‘డజనా, రెండు డజన్‌లా సార్‌’’ అంటాడు వ్యాపారి.
‘‘ఆకలేస్తే తింటారు. అలిగితే వాటితోనే కొట్టుకుంటారు. అన్నీ ఇచ్చెయ్‌’’ అని ఇంకో చోటుకు వెళ్తాడు. అక్కడ.. ఓ కూరగాయలమ్మే ఆవిడ.. నాగార్జునను చూసి ‘హా..’ అని గుండెలపై చేతులు వేసుకుంటుంది.
నవ్వుతాడు నాగార్జున. ‘‘నవనవలాడే లేత వంకాయలు ఓ పాతిక కిలోలివ్వు’’ అంటాడు.  
‘‘పాతిక కిలోలా!! ఎక్కడికండీ;!!’’ అంటుంది ఆవిడ.
‘‘వంకాయల్లాగా వగలు పోయేవాళ్లుంటారే.. అక్కడికి’’ అంటాడు.
పక్కనే ఉన్న బియ్యం వ్యాపారి.. ‘‘సార్‌.. మాంచి వెరైటీ ఓ బస్తా ఇమ్మంటారా?’’ అని అడుగుతాడు.
‘‘పద్నాలుగు మంది. వంద రోజులు. ఒక బస్తా ఏం సరిపోతుంది? షాపులో ఉన్నవన్నీ వేసెయ్‌’’ అంటాడు నాగార్జున.
‘‘అయినా.. మీరొచ్చారేంటి సార్‌’’ అంటాడు బియ్యం వ్యాపారి.
అప్పుడు అంటాడు నాగార్జున నవ్వుతూ, కన్ను కొడుతూ.. ‘‘ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నా’’ అని.
టీజర్‌లు పండాయి. షోని నాగార్జున ఎలాగూ పండిస్తాడు.

‘యాక్చువల్‌గా ప్రపంచంలో ప్రతి మనిషికీ తన గురించి అవతలివాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అది సహజం’ అని ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్నట్లు.. ఒంటరిగా ఉన్నప్పుడు అవతలి వాళ్లు ఏం ఆలోచిస్తారో, వాళ్ల బిహేవియర్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ప్రతి మనిషికీ ఉంటుంది. ఆ ఆసక్తి నుంచి పుట్టుకొచ్చిన కాన్సెప్టే బిగ్‌ బాస్‌ రియాలిటీ షో. సీక్రెట్‌ కెమెరాల హౌస్‌లో జరిగే ప్రతి ఒక్కటీ ఆ హౌస్‌లోని వాళ్లకు తప్ప లోకమంతటికీ తెలుస్తుంది! అలాగని లోకం కోసం యాక్టింగ్‌ చెయ్యడానికి లేదు. ఒరిజినాలిటీ ఉన్నవాళ్లది విజయం అవుతుంది. బిగ్‌బాస్‌ షో పై భిన్న వాదనలు ఉండొచ్చు. ఈ షోను చూడకుండా ఉండలేమన్నదానిపై ఏ వాదనా లేదు. కంటెస్టెంట్‌లుగా హేమ, హిమజ, రాహుల్‌ సిప్లిగంజ్, ఫన్‌ బకెట్‌ మహేశ్, టీవీ9 జాఫర్, వీ6 సావిత్రి, వరుణ్‌సందేశ్, ఆసూరెడ్డి మరికొందరి పేర్లు బయటికొస్తున్నాయి. ఈసారి షోలో రెండు స్పెషాలిటీలు ఉన్నాయి. కంటెస్టెంట్‌లలో సామాన్యులు ఉండరు. అందరూ సెలబ్రిటీలే. అలాగే ఈసారి షో ‘క్లీన్‌’గా ఉండబోతోంది. నాగార్జున హోస్ట్‌గా ఉండేందుకు ఒప్పుకున్నాడంటే.. అంతేగా!  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top