ఉదయాన్నే  తినేస్తే బెటర్‌!

 Better to eat early in the morning - Sakshi

ఒక రోజులో ఎనిమిది – పది గంటల వ్యవధిలో ఆహారం మొత్తం తీసుకోవడం వల్ల మన జీవక్రియలు మెరుగవుతాయని అంటున్నారు డాక్టర్‌ సచిన్‌ పాండా. ‘ద సిర్కాడియన్‌ కోడ్‌’ పేరుతో జీవక్రియలు, ఆహారం మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించారు పాండా. సూర్యోదయం, సూర్యాస్తమయాలకు అనుగుణంగా మన శరీరం పనిచేస్తుందని.. హార్మోన్లు, ఎంజైమ్‌లు, జీర్ణ వ్యవస్థ కూడా ఉదయం వేళ, సాయంకాలానికి కొంచెం ముందు ఆహారాన్ని సమర్థంగా జీర్ణం చేయగలవని సచిన్‌ అంటున్నారు. క్లోమ గ్రంథి ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేదీ, కడుపు/పేగుల్లో బ్యాక్టీరియా చైతన్యవంతంగా ఉండేదీ ఈ సమయాల్లోనేనని ఆయన అంటున్నారు.
 

రాత్రిపూట అవయవాలన్నీ నెమ్మదిస్తాయని, మెదడు నిద్రకు పనికొచ్చే మెలటోనిన్‌ ఉత్పత్తిని పెంచుతుందని.. ఆ సమయంలో ఆహారం తీసుకుంటే.. మెదడు గందరగోళంలో పడిపోతుందని అన్నారు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. 2012లో తాను ఈ విషయంపై ఒక పరిశోధన కూడా నిర్వహించానని, నచ్చినప్పుడు తిన్న ఎలుకలు అనారోగ్యం పాలు కాగా.. నిర్ణీత సమయంలో మాత్రమే ఆహారం తీసుకున్నవి ఆరోగ్యంగా ఉన్నాయని వివరించారు. మధుమేహం ఛాయలున్న వారిపై జరిపిన ఇంకో ప్రయోగంలో రోజులో ఆహారాన్ని తీసుకునే సమయాన్ని తగ్గించినప్పుడు అనేక ఆరోగ్య లాభాలు చేకూరినట్లు సచిన్‌ గుర్తించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top