మంచి రుచిగల ఉదయం | Coffee Raves: Gen Z’s Alcohol-Free Party Trend Taking Over India | Sakshi
Sakshi News home page

Gen gమంచి రుచిగల ఉదయం

Aug 22 2025 9:55 AM | Updated on Aug 22 2025 11:24 AM

Youth new trends gen g habbits special story

యూత్‌ ట్రెండ్‌

ఏంటో... ఈతరం పిల్లలకు బరువు, బాధ్యత అంటూ ఉండదు... తిన్నామా... తిరిగామా అన్న ధ్యాస తప్ప!ప్రతి తరమూ తమ తర్వాత తరాన్ని ఇలా ఆడిపోసుకోవడం పరిపాటే!కానీ ఈ తరాన్ని అంటే జన్‌ జీ (జనరేషన్‌–జెడ్‌)ని అలా తిట్టిపోయడానికి లేదు!ఎందుకంటే వాళ్లు తమ లైఫ్‌ స్టయిల్లోంచి ఆల్కహాల్‌ హ్యాంగవుట్స్‌ని డిలీట్‌ చేశారు! అంటే నో పార్టీయింగా? అయ్యో   పార్టీ ఫ్రీక్సే! కాక΄ోతే ఆల్కహాల్‌కి బదులు కాఫీ సేవిస్తున్నారు.  రాత్రిళ్లకు బదులు ఉదయాలను ఆస్వాదిస్తున్నారు... వాటినే కాఫీ రేవ్స్‌ అని పిలుచుకుంటున్నారు!

క్లబ్బులు, పబ్బుల పట్ల జన్‌ జీ అట్టే ఆసక్తి చూపట్లేదు. అసలామాటకొస్తే మందు తాగడాన్నే ఇష్టపడట్లేదు. కానీ సోషలైజ్‌ అవడానికి ఆత్రంగానే ఉన్నారు. మసక చీకట్లో మందు కొడుతూ హోరెత్తే మ్యూజిక్‌తో అడుగులేస్తూ అర్ధరాత్రి దాకా జోగిపోవడం, తెల్లవారి హ్యాంగోవర్‌తో కళ్లు తెరవలేక΄ోవడమే వాళ్లకు నచ్చలేదు. లైక్‌ మైండ్‌ పీపుల్‌తో కాలక్షే΄ానికి ఒక కూడలి అయితే కావాలనుకున్నారు. ఊరికే కూర్చొని మాట్లాడే బదులు, నచ్చిన కాఫీతో ముచ్చట్లు చెప్పుకుంటే బాగుంటుందని ఆలోచించారు. రోజంతా ఆఫీసుల్లో మగ్గి, ఆ నీరసంతో చిట్‌చాట్‌ ఏం చేస్తాం? అందుకే పొద్దునైతే చక్కటి కాఫీ, కాసిన్ని కబుర్లతో మంచి ఉదయానికి స్వాగతం పలకొచ్చు, ఆ మూడ్‌తో రోజంతా ఉల్లాసంగా గడపొచ్చు అనుకున్నారు.

కెఫేలలో కలవడం మొదలుపెట్టారు. ఈ హాంగవుట్స్‌కి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉంటే కూడా బాగుంటుంది కదా అనిపించింది. మేమున్నాం అంటూ డీజేలు ముందుకొచ్చారు. అయితే పబ్బుల ఫాస్ట్‌ బీట్‌ కాకుండా కాఫీ క్లబ్‌కి సరి΄ోయే బాణీని ట్యూన్‌ చేశారు. దాన్నే కాఫీ రేవ్స్‌గా పిలవడం మొదలుపెట్టారు. ఇప్పుడదే జన్‌ జీ ట్రెండ్‌... ప్రపంచవ్యాప్తంగా!

ఎక్కడ మొదలైందంటే...
లండన్‌ బేకరీల్లో మొదలై ఆమ్‌స్టర్‌డామ్‌ ఓపెన్‌ కిచెన్స్‌ నుంచి వయా న్యూయార్క్‌ ఇండియా చేరుకున్నాయి. మన దగ్గర ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా లాంటి మెట్రో సిటీస్‌లోనే కాదు లక్నో, సూరత్, నాగ్‌పూర్, ఇండోర్, ఆగ్రా లాంటి పట్టణాల్లోనూ ఈ ట్రెండ్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఇంకోమాట..కాఫీ రేవ్స్‌ని కేవలం జన్‌ జీలే కాదు అన్ని వయసుల వాళ్లూ ఆస్వాదిస్తున్నారు. నలుగురితో కలవడానికి పెద్దగా ఇష్టపడని ఇంట్రావర్ట్స్‌ కూడా కాఫీ రేవ్స్‌ అంటే ఉత్సాహం చూపుతున్నారు. సంగీత సరిగమల మధ్య కాఫీ కమ్మదనాన్ని చవిచూపించే ఉషోదయాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్

న్యూ క్రియేషన్స్‌
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ భయాలు, హ్యాంగోవర్‌ బాధలు లేని ఈ కాఫీ రేవ్స్‌ కోసమే ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్‌ అవుతున్న కాఫీలూ ఉన్నాయి. మాచాషాట్స్, మైలో షాట్స్, కోల్డ్‌ బ్రూ షాట్స్‌ ఆ జాబితాలోనివే. అవేకాక  యాకుల్ట్‌ మాచా, స్పానిష్‌ అండ్‌ క్యోటో లాటేస్, డర్టీ మాచా లాటే లాంటివీ ఇష్టపడుతున్నారు కాఫీ రేవ్స్‌ ప్రియులు. చలికాలంలో హాట్‌ చాకోలేట్స్‌ను ఎక్కువగా సేవిస్తున్నారట. సాధారణంగా అయితే కోల్డ్‌ కాఫీ, ఐస్డ్‌ లాటేస్, మాచా లాటేస్, అమెరికానోస్, ఎస్‌ప్రెసో షాట్స్, క్రాన్‌బెర్రీ, ఐస్డ్‌ కాఫీలను కోరుకుంటున్నారు. ఇలా అన్ని వయసుల వాళ్లను రిఫ్రెష్‌ చేసి వాళ్ల ఎనర్జీని పెంచుతున్న ఈ కాఫీ రేవ్స్‌.. కాఫీ లవర్స్, మ్యూజిక్‌ లవర్స్, పార్టీ లవర్స్‌కి ఓ వారధిలా ఉంటున్నాయని చెబుతున్నారు వీటిని హోస్ట్‌ చేస్తున్న కాఫీ క్లబ్‌ ఓనర్స్‌. మెట్రో సిటీస్‌లో కాఫీ డే, బారిస్టాలు కూడా కాఫీ రేవ్స్‌కి ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ΄ార్టీల్లో డీజేలకూ డిమాండ్‌ పెరిగింది. పబ్బుల్లో పనిచేసిన డీజేలు ఎంతోమంది తమ దారి మార్చుకుని ఉదయం పూట కాఫీ క్లబ్స్‌ కోసం మీటర్‌ సవరించుకుంటున్నారట. ΄ార్టీలకు చంద్రోదయాలే కాదు ఉషోదయాలూ చక్కటి సమయాలే అని నిరూపిస్తున్న ఈ కాఫీ రేవ్స్‌ ట్రెండ్‌ ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ..ఉన్నంత కాలమైతే అన్ని వయసుల వారినీ అలరించగలదన్నది మాత్రం వాస్తవం. కొత్తకొత్త ఫార్మాట్స్‌తో ప్రయోగాలు చేస్తున్న ఈతరం ఈ ఒరవడిని ఓ కల్చర్‌గా స్థిరపరుస్తుందన్న గ్యారెంటీ కూడా కనిపిస్తోంది. వీటివల్ల ఇండియాలో కాఫీ బిజినెస్‌ పెరగడమే కాదు రానున్న అయిదేళ్లలో రెండింతలవుతుందని బిజినెస్‌ అనలిస్ట్‌లు అంచనాలూ వేస్తున్నారు.
– సరస్వతి రమ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement