
జిల్లాలో యథేచ్ఛగా గంజాయి విక్రయాలు
మారుమూల ప్రాంతాల్లోనూ లభిస్తున్న సరుకు
పెన్నులు, చాక్లెట్ల రూపంలో అమ్మకాలు
నిత్యం మత్తులో తూగుతున్న యువత
ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో అఘాయిత్యాలు
గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన వారిలో యువకులే అధికం
పుట్టపర్తి శివారు ప్రాంతాల్లో చీకటి పడగానే యువత ఓ చోటకు చేరుతున్నారు. గంజాయిని గుప్పుగుప్పుమంటూ పీలుస్తూ మత్తులో తూలిపోతున్నారు. చిత్రావతి నది పరివాహక ప్రాంతంతో పాటు సాయినగర్‌లో విచ్చలవిడిగా గంజాయి వినియోగిస్తున్నట్లు తెలిసింది. చిత్రావతి రోడ్డులోని చాలామంది యువత గంజాయికి బానిసలైనట్లు సమాచారం. ఇక హిందూపురం, కదిరి, ధర్మవరం తదితర ప్రాంతాల్లోనూ గంజాయి మత్తుకు చాలామంది బానిసలయ్యారు.
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా యువత ‘దమ్మారో దమ్’ అంటూ గంజాయి మత్తులో తూలుతోంది. ఇన్నాళ్లూ పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన గంజాయి.. ఇప్పుడు పల్లెలకూ పాకింది. దీంతో గంజాయి విక్రయిస్తున్న.. వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గుడి, బడి తేడా లేకుండా అన్ని చోట్ల గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి..
గంజాయి ఎక్కువగా ఒరిసా, కర్ణాటక నుంచి జిల్లాకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గంజాయి.. తొలుత పెనుకొండ చేరుకుంటుంది. అక్కడక్కడా నిల్వ చేసి చాక్లెట్లు, పెన్నుల్లో నింపి విక్రయిస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో కొనేవారు కూడా రూ.100 చెల్లిస్తే రోజుకు కావాల్సినంత మత్తు వచ్చే గంజాయి లభిస్తోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని బడాబాబుల అండదండలతో కొందరు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుండటంతో యువత, విద్యార్థులు మత్తుకు అలవాటు పడు తున్నట్లు తెలుస్తోంది.
మత్తులో నేరాలకు పాల్పడుతూ..
గంజాయి అలవాటు పడిన వారు రోజూ సాయంత్రం కాగానే సరుకు గురించి ఆరా తీస్తున్నారు. వాట్సాప్ గ్రూప్‌ల సమాచారం ఆధారంగా గంజాయి దొరికే ప్రాంతానికి వెళ్లి మత్తులో మునిగిపోతున్నారు. అయితే గంజాయి విక్రేతలు రోజుకో ప్రాంతాన్ని ఎంపిక చేయడం... అంతదూరం వెళ్లి గంజాయి తాగిన వారు తిరిగి వచ్చే సమయంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొందరైతే హత్యలకూ వెనుకాడటం లేదు. ఇటీవల పుట్టపర్తి మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లిలో ఓ హత్య కేసులోని నిందితులు ఘటన సమయంలో గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసింది.
ఇక చిత్రావతి రోడ్డులో ఓ విదేశీయుడు గంజాయి మత్తులో భవనం పైనుంచి పడి చనిపోయిన ఘటన నెల క్రితం వెలుగు చూసింది. ఇక గతేడాది విజయదశమి రోజున చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి వద్ద అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం చేసిన వారందరూ గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసింది. వారిపై గతంలోనూ గంజాయి కేసులున్నాయి.
వదిలిపెట్టే ప్రసక్తే లేదు
గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. గంజాయి విక్రేతలు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు. యువత కూడా మత్తుకు దూరంగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి. దాడులు చేసి నిందితులను పట్టుకుంటాం. – సతీశ్‌కుమార్, ఎస్పీ