దేశీ వరి 'సిరులు'

Athota Farmer Agriculture Indigenous rice Crops - Sakshi

మనం ఏనాడో మరిచిపోయిన దేశవాళీ వరి రకాలను సంరక్షించటం, అందులోని పోషకాలను, విశిష్ట ఔషధ గుణాలను నేటి తరానికి ఆహారంతోపాటు అందించడానికి కొందరు అన్నదాతల బృందం పరితపిస్తోంది. ఈ ప్రకృతి వ్యవసాయదారులది గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని అత్తోట గ్రామం. ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పండించిన విత్తనాలతో ‘దేశవాళీ వరి విత్తన నిధి’ ఏర్పాటు లక్ష్యంతో సమష్టిగా కృషి చేస్తుండటం వీరి ప్రత్యేకత. దేశీ వరి వంగడాలలోని జీవవైవిధ్యం సంరక్షణకు తోడ్పడుతూ, అక్కడి మట్టికి కొత్త పరిమళం అద్దుతున్నారు. అధిక దిగుబడి పొందటం కన్నా ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా సంప్రదాయ వరి రకాలను మక్కువతో సమష్టిగా సాగు చేస్తున్న ఈ రైతుల బృందానికి జేజేలు!

అత్తోటలో దేశవాళీ వరి వంగడాల సాగుకు ఆద్యుడు యర్రు బాపన్న. మరో ఏడుగురు స్థానిక రైతులు కలిసొచ్చారు. సమష్టిగా దేశవాళీ వరి రకాల విత్తనాభివృద్ధికి పూనుకున్నారు.   కొన్నేళ్ల క్రితం 5–10 సెంట్లలో కొన్ని రకాలతో ఆరంభించారు. 2018లో చేపట్టిన వంద రకాల సాగు సత్ఫలితాన్నిచ్చింది. 2019 ఖరీఫ్‌లో అయిదు ఎకరాల్లో 180 దేశీ వరి ర కాలను సాగు చేశారు. రానున్న ఖరీఫ్‌లో మరికొంత విస్తీర్ణాన్ని పెంచి 200 రకాల వంగడాల సాగుకు సమాయత్తమవుతున్నారు. వీరి స్ఫూర్తితో గ్రామంలో మరో 60 మంది రైతులు సొంతంగా 80 రకాల వరి రకాలను సాగు చేస్తుండటం మరో విశేషం!

నిలువెత్తు వెన్నుతో ‘బహురూపి’, ఏపుగా పెరిగిన ‘కాలాబట్టి’ , చినికుమిని రకం
‘భారత్‌ బీజ్‌ స్వరాజ్‌ మంచ్‌’ ప్రతినిధి శివప్రసాదరాజు నుంచి ఈ రకాల విత్తనాలను సేకరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుకు కావాల్సిన ద్రవ, ఘన జీవామృతాలు, కషాయాలను స్వయంగా తయారు చేసుకుంటున్నారు. సాధ్యపడని ఇతర రైతులు కోరితే తయారుచేసి ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ  రైతు సాధికార సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ జాతీయ జన్యువనరుల బ్యూరో, వాసన్‌ స్వచ్ఛంద సంస్థల నుంచి అవసరమైన సాంకేతిక సహకారాన్ని పొందుతున్నారు. గత సీజనులో వర్షాలు కొంత ఇబ్బంది పెట్టినా, ఎకరాకు 25–30 బస్తాల చొప్పున దిగుబడిని తీయగలిగారు. వీరు సాగు చేసిన వరి రకాల్లో బీపీటీ తరహాలోనే రోజువారీ ఆహార వినియోగానికి వీలుగా ఉండే ‘రత్నచోళి’ ఉంది.

వర్షాధారమై, ఎక్కువ పోషకాలుండే ‘సారంగనలి’ మరో రకం. వండేటపుడు చక్కని సువాసననిచ్చే పొడుగైన బియ్యం ‘ఢిల్లీ బాసుమతి’, ‘ఇంద్రాణి’ రకాలు ఉన్నాయి. గడ్డి నుంచి బియ్యం వరకు సమస్తం నలుపురంగులో ఉండి రోగనిరోధక శక్తినిచ్చే ‘కాలాబట్టి’ (బ్లాక్‌ రైస్‌) ఉంది. తెగుళ్లు, దోమకాటు దరిచేరని ‘దాసమతి’, మధుమేహాన్ని అదుపుచేసే నవారా, బలవర్ధకమైన ‘మాపిళై సాంబ’తోపాటు నెల్లూరు మొలగొలుకులు, తులసీ బాసో, బాస్మతి, బహురూపి, చినుకుమిని, కుంకుమసాలి, దురేశ్వర్, పంచరత్న, రక్తశాలి, చింతలూరి సన్నం, కుజపటాలియా... వంటివి ప్రముఖమైనవి. దిగుబడిలో హెచ్చు తగ్గులున్నా ఈ రకాలన్నీ ఆరోగ్య ప్రయోజనాలనిచ్చేవి కావటంతో వీటిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వ్యాధినిరోధక శక్తిని కలిగించేవీ, అవయవాల ఎదుగుదలకు ఉపయోగపడేవీ, నరాల బలహీనతను తగ్గించే రకాల దేశీ వరి రకాలూ వున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పని లేకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేస్తున్నందున సురక్షితమైన సేంద్రియ ఆహారం కూడా కావడంతో వీటి విలువ తెలిసిన వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ! – బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి

దేశవాళీ సాగు ఎప్పుడూ దెబ్బతీయదు
దేశవాళీ వరి వంగడాల్లో గణనీయమైన జన్యు వైవిధ్యాలున్నాయి. వివిధ కారణాలతో ఇవి మరుగునపడిపోయాయి. అనేక రకాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఔషధగుణాలున్న వీటి సంరక్షణకు మా వంతు కృషి చేస్తున్నాం. దేశవాళీ వంగడాల సాగు రైతును ఎప్పుడూ దెబ్బతీయదు. అత్యంత అధ్వాన్నమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ కనీసం యాభై శాతం ఫలితాన్ని అందిస్తుంది.– యర్రు బాపన్న (9100307308), ప్రకృతి వ్యవసాయదారుడు, అత్తోట, గుంటూరు జిల్లా

హైబ్రిడ్‌ బియ్యంతో ఆకలి అణగదు
హైబ్రిడ్‌ బియ్యం తింటే ఆకలి అణగదు. మరో 50 శాతం అదనంగా హైబ్రిడ్‌ బియ్యాన్ని తినాల్సి వస్తుంది. రుచి కూడా అంత బాగుండదు. దేశవాళీ బియ్యం ఇందుకు భిన్నం. మంచి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కలిగి వుండటంతో, కొన్ని రకాలు మధుమేహ రోగులకు ఆరోగ్య సంరక్షిణులుగా నిలుస్తున్నాయి.– నామని రోశయ్య (9666532921), ప్రకృతి వ్యవసాయదారుడు,అత్తోట, గుంటూరు జిల్లా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top