చర్మానికి చేటు కాలం | As long as the skin damage | Sakshi
Sakshi News home page

చర్మానికి చేటు కాలం

Dec 10 2015 12:35 AM | Updated on Apr 7 2019 4:36 PM

చర్మానికి చేటు కాలం - Sakshi

చర్మానికి చేటు కాలం

చలికాలం ప్రభావం నేరుగా చర్మంపైనే పడుతుంది. ఈ సీజన్‌లో బయటి తేమ తగ్గడంతో దాన్ని చర్మం నుంచి లాగేస్తుంటుంది వాతావరణం.

వింటర్
చలికాలం ప్రభావం నేరుగా చర్మంపైనే పడుతుంది. ఈ సీజన్‌లో బయటి తేమ తగ్గడంతో దాన్ని చర్మం నుంచి లాగేస్తుంటుంది వాతావరణం. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది. దాంతో అందరూ చర్మ సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఈ సీజన్‌లో మేనికి మేలు చేసే మార్గాలివే... టీనేజీ పిల్లల్లో తమ సౌందర్యం గురించి స్పృహ ఎక్కువ. ఈ సీజన్‌లో ఎండ తీవ్రత గురించి అంతగా ఆలోచించరు కాబట్టి పిల్లలు...

అందునా ప్రధానంగా యుక్తవయస్కులోని వారు ఎండలో తిరగడమూ ఎక్కువే. చలిని సైతం లెక్క చేయకుండా రాత్రి పొద్దుపోయాకా ఆరుబయటకు వెళ్లడమూ మామూలే. వీళ్లు చేయాల్సినవి...
 
* పొద్దుపోయాక రాత్రి చలిలో తిరిగేవారు వ్యాజిలేన్ రాసుకోవాలి. ఇక పగటి ఎండలోకి వెళ్లేవారు ట్యానింగ్‌ను, ఎండ అలర్జీలను (సన్ అలర్జీస్) నివారించడానికి సన్‌స్క్రీన్ లోషన్ వాడటం మంచిది. అయితే జిడ్డు చర్మం ఉన్న టీనేజ్ పిల్లలు నూనె లేని (ఆయిల్ ఫ్రీ) సన్‌స్క్రీన్స్ రాసుకోవాలి. అలాగే పొడి చర్మం ఉన్నవారు మాయిష్చరైజర్ ఎక్కువగా ఉండే ఆయిల్ బేస్ సన్‌స్క్రీన్స్ రాసుకోవాలి.
* ఈ సీజన్‌లో  ఎస్‌పీఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) 40-50 ఉన్న క్రీములు వాడటం మంచిది.
 ఈ క్రీమ్స్ వాడండి
* ఈ  సీజన్‌లో సాధారణంగా కోల్డ్ క్రీమ్స్ వాడటం పెరుగుతుంది. అయితే ఎలాంటి క్రీములు ఎంపిక చేసుకోవాలనే అంశం చాలామందిని  అయోమయానికి గురిచేస్తుంది. కూల్ సీజన్‌లో కోల్డ్ క్రిమ్స్ ఎలా ఉండాలంటే...
* ఈ సీజన్‌లో వాడాల్సిన కోల్డ్ క్రీమ్స్ సువాసనరహితంగా ఉండటం మంచిది. ఎంత వాసన తక్కువైతే చర్మంపై వాటి దుష్ర్పభావం అంతగా తగ్గుతుంది.
* అవి అలర్జీ కలిగించనివి (హైపో అలర్జిక్ క్రీమ్‌లు) వాడాలి. అలర్జీ కలిగించే వాటితో మళ్లీ కొత్త సమస్య రావచ్చు.
* సాధారణం క్రీమ్‌లలో మూల పదార్థం (బేస్)గా నీటిని వాడతారు. అదే ఆయింట్‌మెంట్ తయారీలో ప్రధాన పదార్థం (బేస్)గా నూనెను వాడతారు. అందుకే పొడిచర్మాలకి ఆయింట్‌మెంట్ ఫార్మేషన్ మంచిది. సాధారణ, జిడ్డు చర్మాలకి క్రీమ్ ఫార్మేషన్ మంచిది.
 ఇలా చేస్తే సరి!
* స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు వాడాలి.
* స్నానం చేసి, కాస్త తడిగా ఉన్నప్పుడే డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాయాలి. రోజుకు 3, 4 సార్లు ఈ క్రీమ్ రాయాలి.
* చలికాలంలో వేడినీళ్లు మంచివని కొందరు అంటుంటారు. అయితే ఈ సీజన్‌లో  వాతావరణం తేమను లాగేస్తుందన్న విషయం తెలిసిందే. వేడినీళ్లు కూడా ఇందుకు దోహదపడి ఇంకా పొడిబారుస్తాయి. కానీ చన్నీళ్లు ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే స్నానానికి వేడి వేడి నీళ్లకు బదులు గోరువెచ్చని నీటినే వాడాలి.
* ఈ సీజన్‌లో చర్మానికి క్లెన్సర్లు వాడకూడదు. అవి మరింత పొడిబారేలా చేస్తాయి.
  పాదాలకూ, చేతులకూ కాటన్ గ్లౌజ్ వేసుకోవడం మంచిది. అది పగుళ్లను నివారిస్తుంది.
* తలస్నానం చేయడానికి రెండు గంటల ముందర మాడుకు నూనె మసాజ్ చేసుకోవాలి. నూనె కండిషనర్‌గా పనిచేస్తుంది. పొడిజుట్టు ఉన్నవారైతే షాంపూ తర్వాత తప్పనిసరిగా కండిషనర్ వాడాలి.
* తడి జుట్టును ఆరబెట్టుకోడానిక డ్రైయర్ వాడకూడదు. ఎందుకంటే అది చర్మాన్ని మరింత పొడిబారుస్తుంది.
 
క్రీమ్స్‌లో ఉండేవి
సాఫ్ట్ పారఫిన్, పెట్రోలియమ్ జెల్లీ, అలోవీరా, గ్లిజరిన్, షీయా బటర్, స్టెరైల్ ఆల్కహాల్, ఐసోప్రొపైల్ పాల్మిటేట్, అవకాడో ఆయిల్, ప్రిమ్‌రోజ్ ఆయిల్, సార్బిటాల్, అల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్... ఇవి కోల్డ్ క్రీముల్లోని కంటెంట్స్. ఇవన్నీ పొడి చర్మాన్ని తేమగా ఉంచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వాడటం మంచిదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement