విలన్‌ కరోనా

Amitabh Bachchan Tested Positive Of Coronavirus - Sakshi

గబ్బర్‌ సింగ్‌... షాకాల్‌... మొగాంబో... ఇలాంటి మహామహా విలన్లు సినిమా క్లయిమాక్స్‌ వచ్చేసరికి మట్టి కరుస్తారు. కాని లోకం మీదకు వచ్చి ఆరు నెలలు అవుతున్నా కరోనాను పోలీసులు వచ్చి పట్టుకెళ్లడం లేదు. ఈ తాజా విలన్‌ చేస్తున్న వికటాట్టహాసానికి పెద్ద పెద్ద హీరోలు కూడా చేష్టలిడిగి చూస్తున్నారు.

‘జయా... ఏం దిగులు పడకు. సాహసవంతుడైన నా తమ్ముడు అమితాబ్‌ క్షేమంగా తిరిగి వస్తాడు. నిన్ను, నీ ఇంట్లో ఉన్న అందరినీ బాగా చూసుకుంటాడు’ అని ట్వీట్‌ చేశాడు ధర్మేంద్ర... తన ‘షోలే’ పార్టనర్‌ అమితాబ్‌ కోవిడ్‌ బారిన పడ్డాడన్న వార్త తెలిసి. ధర్మేంద్ర మాత్రమే కాదు...  దేశంలో ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది అభిమానులు అమితాబ్‌ ఆరోగ్యం గురించి లోలోపల ఒక బెంగ పెట్టుకొని పైకి గట్టిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. లోలోపలి బెంగ ఆయన గతంలో ఎదుర్కొన్న తీవ్ర అనారోగ్య పరిస్థితుల గురించి. వయసు గురించి. శనివారం రాత్రి అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్‌ స్వయంగా తమ ట్విట్టర్‌ హ్యాండిల్స్‌ ద్వారా తమకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని ప్రకటించిన మరుసటి నిమిషం నుంచి అమితాబ్‌ అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. ఆదివారం ఉజ్జయిని ఆలయం లో ప్రత్యేక పూజలు కూడా మొదలుపెట్టారు. అమితాబ్‌ను అభిమానులు ఇలాంటి పూజలతో గతంలో కాపాడుకున్నారు. ఇప్పుడూ కాపాడుకుంటారు.

కుటుంబంలో నలుగురికి
అమితాబ్‌ కుటుంబంలో అమితాబ్‌కు, అభిషేక్‌కు శనివారం కోవిడ్‌ పాజిటివ్‌ నిర్థారణ చేశారు. ఆదివారం కోడలు ఐశ్వర్యరాయ్‌కు, మనవరాలు ఆరాధ్యకు కోవిడ్‌ నిర్థారణ వార్తలు వచ్చాయి. అయితే ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలు అసింప్టమేటిక్‌గా ఉండటంతో వారిని హాస్పిటల్‌లో ఉంచాలా వద్దా అనే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు జయా బచ్చన్‌కు నెగెటివ్‌ వచ్చింది. కాని డాక్టర్లు మరోసారి ఆమెకు కోవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. అమితాబ్‌ రెండు బంగ్లాలు ‘ప్రతీక్ష’, ‘జల్సా’, ఆయన ఆఫీసు ‘జనక్‌’ అన్నీ ముంబై పురపాలక సంఘ అధికారులు సీల్‌ చేసి ‘కంటైన్‌మెంట్‌ ఏరియా’గా ప్రకటించారు. ఈ మూడు చోట్ల పని చేసే సిబ్బందికి పరీక్షలు సాగుతున్నాయి. 
కరోనా భారతదేశంలో అడుగుపెట్టిన మరుక్షణం దాని తీవ్రత ప్రకటితమయ్యి లాక్‌డౌన్‌ ప్రకటించే వేళకు ముందుగా మేల్కొన్న నటుడు అమితాబ్‌ బచ్చన్‌. ఆయన వెంటనే సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇల్లు దాటకుండా ఇంటినుంచే వీడియో సందేశాలు ఇచ్చారు. మనమడు అగస్త్య నందాతో జిమ్‌ చేస్తూ, ఒక్కోసారి మాస్క్‌తో సెల్ఫీలు దిగుతూ అభిమానులను ఉత్సాహ పరిచారు. సినీ కార్మికుల సహాయానికి ప్రయత్నాలు చేశారు.

తాజా సినిమా ‘గులాబో సితాబో’ అమేజాన్‌లో రిలీజయ్యి ఆయన నటనకు పేరు రావడంతో సెలబ్రేట్‌ చేసుకున్నారు. కాని ముంబైలో కరోనా తీవ్రత ఆయన ఇంటి వరకు చేరింది. ప్రస్తుతం ముంబైలో 91 వేల కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇటీవల షూటింగ్‌లో పాల్గొంటున్న అభిషేక్‌ బచ్చన్‌ ద్వారా కాని, లేదా అమితాబ్‌ ఇంట జరిగిన చిన్న చిన్న ప్రమోషనల్‌ కార్యక్రమాల వల్ల గాని ఏ విధంగానో కరోనా వారి ఇంట్లోకి ప్రవేశించింది. అమితాబ్, అభిషేక్‌ ఇద్దరూ ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చేరారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని, శనివారం సౌకర్యంగా నిద్రపోయారని హాస్పిటల్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. రేఖ మాట కోసం వెతుకులాట
అమితాబ్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలగానే నెటిజన్లందరూ రేఖ కోసం సెర్చ్‌ చేశారు. రేఖ ఏం కామెంట్‌ పెడుతుందోనని చూశారు. కాని రేఖ ఇప్పటివరకూ స్పందించలేదు. మరోవైపు రేఖ సెక్యూరిటీ గార్డ్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఆమె బంగ్లాను అధికారుల సీజ్‌ చేశారు. ఆమెను కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోమని కోరగా తన వద్దకే వచ్చి పరీక్షలు నిర్వహించాలని రేఖ కోరారు. ‘కూలీ’ (1983) షూటింగ్‌ సమయంలో అమితాబ్‌ గాయపడినప్పుడు రేఖ కాలి నడకన తిరుపతికి రావడం ప్రత్యేక ప్రార్థనలు చేయడం విశేషంగా వార్తలకెక్కింది. అమితాబ్, రేఖల ప్రేమగాథ జగద్విదితం.

అనుపమ్‌ ఖేర్‌ ఇంట్లో
కోవిడ్‌ వ్యాప్తి మరో బాలీవుడ్‌ దిగ్గజం అనుపమ్‌ ఖేర్‌ కుటుంబం వరకు కూడా చేరింది. ఆమె తల్లి దులారి, తమ్ముడు రాజు, ఆయన భార్య, కుమార్తె... మొత్తం ముగ్గురు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యారు. రాజు కుమారుడు ప్రణిత్‌కు నెగెటివ్‌ వచ్చింది. అనుపమ్‌ఖేర్‌కు కూడా నెగెటివ్‌ వచ్చింది. ‘మా అమ్మకు ఆకలి కావడం లేదంటే మేము వేరే ఏదో కారణం అనుకున్నాం. మీ ఇంట్లో పెద్దవారెవరైనా ఆకలి కావడం లేదని చెప్తే దయచేసి కోవిడ్‌ పరీక్షలు చేయించండి’ అని అనుపమ్‌ ఖేర్‌ వీడియో సందేశంలో చెప్పారు. అనుపమ్‌ ఖేర్‌ తల్లి ప్రస్తుతం కోకిలా బెన్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 

ప్రమాదం అంచున
ముంబైలో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు వల్ల సాధారణ ప్రజానీకంతో పాటు బాలీవుడ్‌ కూడా ప్రమాదంలో పడింది. ఆమిర్‌ ఖాన్‌ ఇంట్లో, శ్రీదేవి ఇంట్లో కోవిడ్‌ కేసులు వచ్చాయి. రణ్‌బీర్‌ కపూర్, కరణ్‌ జొహర్‌ స్టాఫ్‌ కూడా కోవిడ్‌ బారిన పడ్డారు. సంగీత దర్శకుడు వాజిద్‌ ఖాన్‌ కోవిడ్‌కు ప్రాణాలు విడిచాడు. మరోవైపు కోవిడ్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి సల్మాన్‌ ఖాన్‌ ముంబై నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాన్వెల్‌ ఫామ్‌ హౌస్‌లో ఉండిపోయాడు. ప్రస్తుతానికి సల్మాన్‌ ఖాన్‌ కొద్దిగా సురక్షితం అనిపిస్తున్నాడు. అయితే కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి షారుఖ్‌ ఖాన్‌ పెద్దగా వార్తల్లో లేడు. ఈ నేపథ్యంలో మొదలైన, మొదలు కానున్న షూటింగ్‌ల పైన తిరిగి సందేహాలు మొదలయ్యాయి. మరింత జాగ్రత్తలు తీసుకోవాలని యూనియన్లు కోరుతున్నాయి. కాని కనపడని విలన్‌ సెట్‌లోకి ఎలా అడుగుపెడతాడో తెలియనప్పుడు దానిని గేట్‌ దగ్గర ఆపడం ఎలా? – సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top