మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా అనంతపురం నగరపాలక సంస్థలో అతి తక్కువగా అంటే 60.24 శాతం పోలింగ్ నమోదు కావడం వెనుక కారణాలు ఏమిటనే దానిపై రాజకీయ పార్టీల నాయకులు విశ్లేషిస్తున్నారు.
సాక్షి, అనంతపురం : మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా అనంతపురం నగరపాలక సంస్థలో అతి తక్కువగా అంటే 60.24 శాతం పోలింగ్ నమోదు కావడం వెనుక కారణాలు ఏమిటనే దానిపై రాజకీయ పార్టీల నాయకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోవడమా లేదా ఓటర్లకు స్లిప్పులు అందజేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందా లేకపోతే అసలు ఓటర్లు ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదా అనే వాటిపై లోతుగా చర్చిస్తున్నారు.
ముఖ్యంగా నగరంలో జాబితాలో ఓటరుగా పేరున్నా స్లిప్పులు లేనందున చాలా మంది పోలింగ్ కేంద్రం వరకు వచ్చి వెనుక్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరికీ ఓటరు స్లిప్పులు అందజేశామని జిల్లా అధికారులు పేర్కొంటున్నా పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం స్లిప్పుల కోసం ఓటర్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కారణమేదైనా ఓటర్లలో చైతన్యం తీసుకరాకపోతే మేలో జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా అనంతపురంలోనే ఓటు సద్వినియోగంపై జిల్లా యంత్రాంగం ఆటోల ద్వారా వీధుల్లో ప్రచారం చేసినా ఓటర్లు మాత్రం స్పందించక పోవడం వెనుక ఆంతర్యమేమిటని ఇటు అధికారులు, అటు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. మునిసిపల్ ఎన్నికల సందర్భంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న మడకశిరలో అత్యధికంగా 85.22 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పుట్టపర్తి, ధర్మవరం మునిసిపాలిటీల్లో 82.05 శాతం, కళ్యాణదుర్గంలో 81.90, రాయదుర్గంలో 79.57, గుత్తిలో 77.02, పామిడిలో 76.70, కదిరిలో 73.89 శాతం, తాడిపత్రిలో 73.14, గుంతకల్లులో 70.63, హిందూపురంలో 69.02 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. అన్ని మునిసిపాలిటీల కంటే అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో ఉద్యోగులు, మేధావులు, అక్షరాస్యులు ఉన్నా మిగిలిన మునిసిపాలిటీలో నమోదైన పోలింగ్ శాతం కంటే భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనైనా పోలింగ్ శాతం పెంచుకుని ఏవిధంగా లబ్ధి పొందాలనే విషయమై ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఓటర్లలో చైతన్యం తీసుకరాకపోతే నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తే బాగుంటుందనే విషయమై కూడా చర్చిస్తున్నారు.