తెలంగాణ అభివృద్ధే ధ్యేయం


తాండూరు, న్యూస్‌లైన్:  తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పని చేస్తోందని ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి విజయాదేవి పోటీ చేస్తున్న 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుజరాత్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ 200 మంది సామర్థ్యంతో డిజిటల్ టాకీసులను ఏర్పాటు చేస్తామన్నారు. వీటినే ఉదయం పూట క్లాస్‌రూమ్‌లుగా ఉపయోగించుకోవచ్చన్నారు.



 వచ్చే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యంతోపాటు వ్యవసాయ రంగాన్ని అన్నివిధాలా అభివృద్ధిపరిచేందుకు కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు. వందకుపైగా సంక్షేమ పథకాలను పేదల దరి చేర్చడమే టీఆర్‌ఎస్ లక్ష ్యమన్నారు. తాండూరులో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి పాటుపడతామన్నారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకులు తాండూరులో అభివృద్దిని విస్మరించారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బైండ్ల విజయ్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్, నాయకులు రంగారావు, విజయ్, సంగమేశ్వర్, సోమశేఖర్, అనురాధ పాల్గొన్నారు. అనంతరం ఆయన పలు వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు.



 దోశ వెరీ టేస్ట్

 ఉదయం తాండూరుకు వచ్చిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శాంతినగర్‌లోని ఓ హోటల్‌లో దోశ తిన్నారు. తాండూరు దోశ వెరీ టేస్ట్ అని కితాబిచ్చారు. బిల్లు చెల్లించేందుకు కౌంటర్ వద్దకు వెళ్లగా.. హోటల్ యజమాని కృతజ్ఞతగా వద్దన్నా.. నో ప్రాబ్లం తీసుకోండి అంటూ బిల్లు చెల్లించారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top