వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి శుక్రవారం ఒక బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. ఈ మేరకు పొంగులేటి పూర్తి ఆధారాలతో అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి శుక్రవారం ఒక బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. ఈ మేరకు పొంగులేటి పూర్తి ఆధారాలతో అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం అర్బన్ సీఐ మధుసూదన్ కథనం ప్రకారం... ఖమ్మంలో రోటరీనగర్‌లో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయ మెయిల్ అడ్రస్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బెదిరిస్తూ మెయిల్ పంపారు. శనివారంలోగా ఎన్నికల పోటీ నుంచి విరమించుకోవాలని లేకుంటే... జిల్లా వ్యాప్తంగా కరపత్రాలు పంచుతామని, పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు తిరిగి మెయిల్ పంపాలని అందులో పేర్కొన్నారు. ‘నీ ఓటమే లక్ష్యం’ అని పేర్కొంటూ శ్రీనివాసరెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి మెయిల్ పెట్టారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి ఉన్నతస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.


