మాజీ మంత్రి శైలజానాథ్ దింపుడు కల్లం ఆశ ఫలించింది. బండారు రవికుమార్‌తో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టించిన టీడీపీ అధినేత చంద్రబాబు చివరి నిముషంలో టికెట్‌ను వెనక్కి తీసుకున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మాజీ మంత్రి శైలజానాథ్ దింపుడు కల్లం ఆశ ఫలించింది. బండారు రవికుమార్‌తో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టించిన టీడీపీ అధినేత చంద్రబాబు చివరి నిముషంలో టికెట్‌ను వెనక్కి తీసుకున్నారు. ఇది పసిగట్టిన మాజీ మంత్రి శైలజానాథ్ గురువారం అర్ధరాత్రి హడావుడిగా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు కోటరీలో కీలకనేత సీఎం రమేష్‌తో సమావేశమై.. శింగనమల టికెట్ ఇస్తే భారీ ఎత్తున ముట్టచెబుతానని ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
ఇది పసిగట్టిన జేసీ దివాకర్‌రెడ్డి.. శైలజానాథ్‌కు తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆయనకు టికెట్ ఇస్తే ఆ ప్రభావం అనంతపురం లోక్‌సభ స్థానంపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అనూహ్యంగా శమంతకమణి వారసులు యామినీ బాల, అశోక్ పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఇంత జరిగినా చివరకు శైలజానాథ్ ఇవ్వజూపిన మొత్తం కళ్లు చెదిరేలా ఉండటంతో చంద్రబాబు ఆయన వైపు మొగ్గినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే..
సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్‌గా వ్యవహరించిన మాజీ మంత్రి శైలజానాథ్ మాజీ సీఎం కిరణ్ కోటరీలో అత్యంత ప్రధానమైన నేత. కిరణ్ స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్ష పదవి పొందిన కొద్ది రోజులకే ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. శింగనమల నుంచి టీడీపీ టికెట్ తెచ్చుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు కోటరీలో కీలకనేత సీఎం రమేష్‌తో శైలజానాథ్ పలు దఫాలుగా సమావేశమయ్యారు. టికెట్ ఇప్పిస్తే భారీ ఎత్తున డబ్బులు ముట్టచెబుతానని బేరసారాలు జరిపినట్లు టీడీపీ శ్రేణులు అప్పట్లో వెల్లడించాయి. అనంతపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి జేసీ దివాకర్‌రెడ్డితోపాటు పయ్యావుల కేశవ్ వ్యతిరేకించడంతో శైలజానాథ్‌కు టీడీపీ టికెట్ దక్కలేదు. దాంతో చేసేదిలేక పీసీసీ చీఫ్ రఘువీరాతో మంత్రాంగం జరిపి ఎట్టికేలకు కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. ఈ నెల 15న శింగనమల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు.
అలా అనుకుంటే ఇలా అయ్యంది..
ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేస్తోన్న బండారు రవికుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా సంపాదించారు. సీఎం రమేష్‌తో రాయ‘బేరాలు’ జరపడం వల్లే బండారు రవికుమార్‌ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రాదేశిక ఎన్నికల్లో బండారు రవికుమార్ టీడీపీ తరఫున పోటీచేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు భారీ ఎత్తున పార్టీ ఫండ్‌గా డబ్బులు అందించారు.
శనివారం నామినేషన్ దాఖలు చేయాలని భావించిన బండారు రవికుమార్ గురువారం మండలానికి రూ.పది లక్షల చొప్పున పంపిణీ చేసి, భారీ ఎత్తున జనసమీకరణ చేయడానికి ప్రణాళిక రచించారు. ఈ నేపథ్యంలో రవికుమార్‌కు టికెట్ క్యాన్సిల్ చేసినట్లు చంద్రబాబు నుంచి పార్టీ నేతలకు సమాచారం అందింది.
ఈ విషయాన్ని పసిగట్టిన శైలజానాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది విస్మరించి.. గురువారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. సీఎం రమేష్‌తో బేరసారాలు సాగించారు. టీడీపీ టికెట్ ఇప్పించాలని ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చారు. శైలజానాథ్‌కు టికెట్ దక్కడం ఖాయమన్న తరుణంలో జేసీ దివాకర్‌రెడ్డి రంగ ప్రవేశం చేశారు. శింగనమల నియోజకవర్గంలో శైలజానాథ్‌కు తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. ఆయనకు టికెట్ ఇస్తే ఆ ప్రభావం అనంతపురం లోక్‌సభపై పడుతుందని జేసీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. జేసీ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో చంద్రబాబు వెనక్కి తగ్గి.. శైలజానాథ్‌కు టీడీపీ టికెట్ ఇవ్వలేమని తేల్చిచెప్పారు.
ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ శమంతకమణి అల్లుడైన ఓ పోలీసు ఉన్నతాధికారి రంగప్రవేశం చేశారు. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్న ఆ పోలీసు అధికారి.. శమంతకమణి కూతురైన యామిని బాలకుగానీ ఆమె కుమారుడు అశోక్‌కుగానీ టీడీపీ టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించారు. శింగనమల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గార్లదిన్నె ఎంఈవోగా పనిచేస్తోన్న యామినీ బాల ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
చంద్రబాబును డబ్బుతో కొట్టారు..
డబ్బు ముట్టజెపితే టీడీపీలో కాని పనేదీ లేదని స్పష్టమవడంతో శైలజానాథ్ కళ్లు చెదిరే భారీ మొత్తాన్ని శుక్రవారం రాత్రి సీఎం రమేష్ ద్వారా చంద్రబాబుకు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆ ఫ్యాన్సీ ఫిగర్ చెవినపడటంతో చంద్రబాబు అన్ని అభ్యంతరాలను పక్కనపెట్టి శైలజానాథ్‌కు టికెట్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని శైలజానాథ్ శుక్రవారం రాత్రి తన అనుచరులకు తెలియజేసి.. శనివారం నామినేషన్‌కు సిద్ధమవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ పరిణామంపై శమంతకమణి వర్గీయులు, జేసీ వర్గీయులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.