
లోకాయుక్తను ఏర్పాటు చేస్తే మోడీ జైలుకే
గుజరాత్‌లో లోకాయుక్తను ఏర్పాటు చేసినట్లయితే.. జైలుకు వెళ్లే మొదటి వ్యక్తి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీయే అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్
న్యూఢిల్లీ/అమ్రేలి(గుజరాత్): గుజరాత్‌లో లోకాయుక్తను ఏర్పాటు చేసినట్లయితే.. జైలుకు వెళ్లే మొదటి వ్యక్తి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీయే అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన గుజరాత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మోడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘తాను దేశానికి ‘చౌకీదార్’(కాపలాదారు)గా ఉంటానని మోడీ చెప్పారు. పేదల భూములను కారుచౌకగా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన చౌకీదార్‌ను మీరు నమ్ముతారా. ఆ వ్యక్తి దేశానికి చౌకీదారుగా ఉంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి’’ అని ఆయన ప్రజలకు సూచించారు. మోడీకి గుజరాత్ వ్యాపార దిగ్గజం అదానీకి మధ్య భాగస్వామ్యం ఉందని రాహుల్‌గాంధీ ఆరోపించారు.
గుజరాత్ ప్రభుత్వం నుంచి తాను పొందుతున్న ప్రయోజనాలకు ప్రతిఫలంగా మోడీ ఎన్నికల ప్రచారానికి అదానీ నిధులు అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు కోసం అదానీ కంపెనీకి మోడీ ప్రభుత్వం రూ. 26 వేల కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టిందని, అలాగే తక్కువ ధరకు భూములు అప్పగించి మరో పది వేల కోట్ల రూపాయల లాభం చేకూర్చిందని ఆరోపించారు. గుజరాత్ అభివృద్ధి మోడల్‌పై మోడీ చేస్తున్న ప్రచారాన్ని కూడా రాహుల్ తప్పుబట్టారు.