సుపరిపాలన జగన్‌తోనే సాధ్యం | Sakshi
Sakshi News home page

సుపరిపాలన జగన్‌తోనే సాధ్యం

Published Sat, Mar 29 2014 4:47 AM

Good governance, possible Jagan

పొదలకూరు, న్యూస్‌లైన్: కొత్తరాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తుండగా, చంద్రబాబు మాత్రం అధికారం కోసం అర్రులుజాస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బిరదవోలు పంచాయతీలోని చెర్లోపల్లిలో శుక్రవారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణ సాధ్యమైన హామీలనే మాత్రమే ఎన్నికల ప్రచార సభల్లో ఇస్తున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు మాత్రం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారని ధ్వజమెత్తారు. విలువలు, విశ్వసనీయత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన జగన్ కొత్త రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆదాయ వనరుల ప్రకారం మేనిఫెస్టోను రూపొందించారన్నారు.

 

రాష్ట్ర ప్రయోజనాలు పట్టని చంద్రబాబు ఆదాయం, ఖర్చు ఎంత అని ఆలోచించకుండా ఇష్టానుసారంగా హామీలు గుప్పిస్తున్నారన్నారు. రెండు మార్లు సీఎంగా పనిచేసిన ఆయన అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. అధికారం వస్తే ప్రజలను పట్టించుకోకుండా, రాకుంటే భవిష్యత్ ఉండదనే ఆందోళనతో పిచ్చిపట్టినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. జనాన్ని మోసం చేసేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించడం తగదన్నారు.
 ఎమ్పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించబోతోందన్నారు. భారీ మెజార్టీ సాధించేందుకు కార్యకర్తలు పట్టుదలగా కృషి చేయాలన్నారు. కాకాణి వెంట పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, కోనం బ్రహ్మయ్య, మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, బిరదవోలు సర్పంచ్ వెన్నపూస శ్రీనివాసులురెడ్డి, రావుల చినఅంకయ్యగౌడ్, వూకోటి లక్ష్మీనారాయణ, గూడూరు శ్రీనివాసులు ఉన్నారు.

Advertisement
Advertisement