మేకలతో మేత... కోళ్లతో కూత! | Chickens and goats grazing ... howl! | Sakshi
Sakshi News home page

మేకలతో మేత... కోళ్లతో కూత!

Apr 19 2014 1:37 AM | Updated on Aug 14 2018 4:46 PM

మేకలతో మేత... కోళ్లతో కూత! - Sakshi

మేకలతో మేత... కోళ్లతో కూత!

మా తెలుగు సార్ అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే... సమకాలీన అంశాలతో పోలిక చెబుతూ పాఠం మాకు అర్థమయ్యేలా చేస్తారాయన. ఆవ్వాళ్ల సామెతలపై పాఠం చెబుతున్నారాయన.

మా తెలుగు సార్ అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే... సమకాలీన అంశాలతో పోలిక చెబుతూ పాఠం మాకు అర్థమయ్యేలా చేస్తారాయన. ఆవ్వాళ్ల సామెతలపై పాఠం చెబుతున్నారాయన. ‘‘సామెత అంటే సామ్యత. అంటే పోలిక. కాబట్టి ఇవ్వాళ్ల ‘అత్తలతో కలిసి అమ్మడం, కోడళ్లతో కలిసి కొనడం’ అనే సామెతను చెబుతూ మీకో పోలిక చూపుతా. అది అర్థమైతే మాకు పాఠం కూడా తేలిగ్గా బుర్రకెక్కుతుంది అన్నారాయన’’
 
‘‘అత్తలతో కలిసి అమ్మడం... కోడళ్లతో కలిసి కొనడం అనే దానికి అర్థం చెప్పే ముందర మనమూ అలాంటి ఒక కొత్త సామెత సృష్టిద్దాం. అదేమిటంటే... ‘మేకలతో కలిసి మేయడం... కోళ్లతో కలిసి కూయడం’ అన్నమాట. అంటే ఏమిటీ అర్థం. గుట్టల మీదా, కొండచరియల మీదా ఎప్పుడైనా మేకల్ని చూశారా. తలవంచుకుని తదేకంగా మేస్తూ పోతాయి. అదేపనిగా ఆరగిస్తూ ఉంటాయి. మరో పని చేస్తున్నట్టు కనిపించవు. అలాగే కూత విషయానికి వస్తే కోడి కూడా అంతే. పొద్దున్నే పొదుపుగా ఒకసారి కూస్తుంది అంతే. తెలివైనవాళ్లెవరైనా చేయాల్సిందిదే. అదే పనిగా కూస్తూ తమ శక్తిని వృథా చేసుకోకూడదన్నమాట.
 
ఇక పొద్దున్న కూసే ఒక కూతతోనే తానో యుగకర్తలాగా, కొత్త దినానికి తానూ ఒక ఆహ్వానం పంపినట్టుగా పోజు పెట్టవచ్చు. అలాగే ఇక మేకల్లో కలిశాక చెప్పేదేముంది... మేతే... మేత’ బాగుంది కదా. పాత సామెత అయిన అత్తలతో కలిసి అమ్మడం, కోడళ్లతో కలిసి కొనడం కూడా  ఇలాంటిదేనన్నమాట. తాము యుక్తవయసులో ఉన్నప్పటి కొన్ని వస్తువులు అత్తలకు ఇప్పుడు అంత అవసరంగా అనిపించవు. కాబట్టి తమకు అనవసరం అయిన వస్తువులను అమ్మి లాభం కళ్లజూస్తుంటారు. ఇక కోడళ్లు ఎలాగూ కొత్తగా కాపురానికి వచ్చినవాళ్లు కాబట్టి అన్ని విలాస వస్తువులూ తమకు అవసరంలా అనిపిస్తాయి. అత్తలతో కలిసి ఏదైనా వస్తువును అమ్మారనుకోండి. అప్పుడు ఆ లాభంలో వాటా ఖాయం. ఇక కోడళ్లతో కలిసి కొన్నారనుకోండి. ఆ వస్తువు ఎలాగూ తమ వద్దనే పదిలంగా ఉంటుంది. క్లాసులో ఎవరైనా మన సమకాలీన రాజకీయాల్లో జరిగే లైవ్ దృష్టాంతాన్ని చెబుతూ దీనికి ఉదాహరణ ఇవ్వగలరా’’ అని అడిగారు మా తెలుగు సారు. అంతే నేను చెబుతాను సార్ అంటూ లేచాడు మా రాజకీయాల్రావు. అతడి అసలు పేరు రాజారావు. కానీ ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడతాడు కాబట్టి రాజకీయాల్రావు అంటుంటారు అతడిని. ‘‘చెప్పు’’ అని మా సార్ అనగానే తగులుకున్నాడు మావాడు.
 
‘‘ఇప్పుడు తెలంగాణ తెచ్చిన ఫలానా పార్టీతో కలిస్తే ఆ ప్రాంతంలో ఓట్లు వస్తాయి కాబట్టి అక్కడ పొత్తు కావాలనుకుంటాడు ఓ బాబు. అలాగే సీమాంధ్రలో కలిస్తే ఓట్లకు గండి పడుతుంది కాబట్టి ఏదో వంక చెప్పి ఇక్కడ వద్దంటాడు. అంటే తెలంగాణలో సదరు పార్టీ కాళ్లను కమలాల్లా కళ్లకద్దుకుని, సీమాంధ్రలోకి వచ్చేసరికి అదే పార్టీ పొత్తును కమలాపండు తొక్కలా తీసిపారేస్తాడన్నమాట. ఈ పని చేసేదెవరూ అన్న పొడుపు కథకు జవాబు తెలిసిన వారికి మీరు చెప్పే సామెతతోని సామ్యత ఎవరితోనో చక్క గా అర్థమవుతుంది సార్’’ అంటూ సామెత అర్థాన్ని పొడుపుకథలా వివరించాడు మా రాజకీయాల్రావు.
 
‘‘భలే చెప్పావు రాజకీయాల్రావ్..’’ అంటూ మెచ్చుకుంటూనే... ‘‘ఇలాంటిదే మరో వాడుకా ఉంది. పనిచేయాల్సి వస్తే తప్పించుకోడానికి దూడల్లో కలిసేదెవరూ, పచ్చగడ్డి మేయాల్సి వస్తే ఎద్దుల్లో కలిసి ఆ ‘పచ్చ’గడ్డి కోసం పాకులాడెదెవరూ, అత్తల సామెతలోలా పొత్తులు కుదుర్చుకునేదెవరు, అందితే జుత్తు-అందకపోతే పొత్తు అనేది ఎవరో తెలిస్తే ఇవ్వాళ్ల మన సామెతల క్లాసు సార్థకమేరా’’ అన్నారు మా తెలుగు సారు. అదెవరో చెప్పుకోండి చూద్దాం.    - యాసీన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement