సెబితే ఇనరా... మీ సంగతి సూస్తా!

సెబితే ఇనరా... మీ సంగతి సూస్తా! - Sakshi


- బెదిరింపులకు దిగుతున్న బొత్స


-వైఎస్‌ఆర్ సీపీ నేతలకు ఫోన్ చేసి పార్టీ మారాలంటూ వేధింపులు

 -ఓటమి భయంతోనే ఇదంతా..

 - అసెంబ్లీ మెట్లెక్కేందుకు  అడ్డదారులు తొక్కుతున్న  మాజీ మంత్రి


 


 చీపురుపల్లి, న్యూస్‌లైన్:  - ‘ఏరా బాగున్నావా... ఏం ఎందుకలా సేశావు... నేనేం తప్పు సేసాను, నువ్వేం సెప్పినా సేసాను కదేటి. అల్లప్పుడు అన్నాయంగా అది చేయమన్నా సేసాను కదేటి, మరి పార్టీ ఒదిలి ఎల్లిపోవడమేంటి, మన పార్టీలోకి వచ్చేయ్’



  - ‘ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం నేనే ఎమ్మెల్యేను అవుతా. ఎమ్మార్వో నుంచి రాష్ట్ర కార్యదర్శి దాకా నా పేరు చెబితే ప్రతీ అధికారి పలుకుతాడు, ఏ పనైనా సేయించగలను, ఇంకా కాదంటే తరువాత ఒక్కొక్కడి సంగతి సూస్తా’



 -  ఇవి ఏదో సినిమాలోని ప్రతినాయకుడి  డైలాగులు కావు. సాక్షాత్తూ రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేరుగా ఫోన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో జరుగుతున్న సంభాషణలు.


ఒకప్పుడు మకుటం లేని మహారాజుగా జిల్లాలో ఓ వెలుగు వెలిగిన బొత్స సత్యనారాయణ మళ్లీ ఎలాగైనా అసెంబ్లీ మెట్లెక్కాలని ఆరాటపడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడూ  బెదిరింపు రాజకీయాలతో తన హవాను కొనసాగించారు. తరువాత పరిస్థితులు మారాయి. ప్రజలు ఈసడించుకున్నారు. పట్టించుకునే వారే కరువయ్యారు. అయినా చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఇప్పుడు కూడా ఆదే తరహా రాజకీయాలు చేస్తున్నారని చీపురుపల్లిలో పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రె స్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.


 


ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో కూడా అదే పరిస్థితి ఉండడంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఏం చేయాలో పాలుపోక  సతమతమవుతున్నారు. ప్రజాస్వామ్యంగా రాజకీయాలు చేస్తే గెలుపు సాధ్యం కాదని అర్థమైన ఆయన బెదింపులకు దిగుతున్నారు. కాంగ్రెస్‌ను వీడి వైఎస్‌ఆర్ సీపీలోకి వెళ్లిన మాజీ, తాజా సర్పంచ్‌లు, ఇతర నేతలపై పార్టీ మారాలంటూ తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. పాత విషయాలు కదుపుతూ, ఏం చేయాలన్నా తానే చేయగలనంటూ ఓ వైపు నచ్చజెబుతూ, మరోవైపు బెదిరింపులకు దిగుతున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుదేలవడంతో ఆ నేతలు కుట్రలకు తెరలేపారు.


 


ఒక వైపు తప్పుడు ప్రచారం చేస్తూ మరో వైపు టీడీపీతో గూడుపుఠాణి జరుపుతున్నారు. అయితే కాంగ్రెస్‌కు, లేదంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కుమ్మక్కు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చేస్తున్నప్పటికీ గట్టెక్కగలమో లేదోనన్న భయంతో నేరుగా మాజీ మంత్రి బొత్స రంగంలోకి దిగారు.


 


చీపురుపల్లి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేస్తున్నారు. బెదిరింపులతో పాటు డబ్బు ఆశ కూడా చూపిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే గుండెల నిండా గూడుకట్టుకున్న అభిమానంతో కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారంతా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారేది లేదంటూ తెగేసి చెబుతున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top