ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగే

ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగే - Sakshi


నేను ప్రధాని పదవికి పోటీ పడటం జీర్ణించుకోలేకపోతున్నారు: మోడీగంగ-కావేరీ నదుల అనుసంధానాన్ని గాలికి వదిలేశారు

9 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు రెండంకెల కన్నా తక్కువ సీట్లే

సీమాంధ్ర అభివృద్ధికి నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది

కేసీఆర్‌పై తిట్ల దండకం ఎత్తుకున్న చంద్రబాబు

మోడీకి కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్న పవన్‌కల్యాణ్

తిరుపతిలో ఎన్‌డీఏ బహిరంగ సభలో ప్రసంగాలు


 

 తిరుపతి: ఈ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని.. తొమ్మిది రాష్ట్రాల్లో తల్లీ-కొడుకుల సారథ్యంలోని ఆ పార్టీ రెండంకెల కన్నా తక్కువ సీట్లే సంపాదిస్తుందని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ జోస్యం చెప్పారు. దేశంలో నల్లధనం దోచేసిన వారిని రక్షించేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు విశ్వప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బుధవారం రాత్రి 9.30 గంటలకు సీమాంధ్రలోని తిరుపతిలో నిర్వహించిన ఎన్‌డీఏ కూటమి తొలి ఎన్నికల ప్రచారసభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. గంగ - కావేరి నదుల అనుసంధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. వీరి విధానాల కారణంగా దేశంలో శత్రుదేశాల చేతుల్లో చనిపోయిన సైనికుల సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారన్నారు.కమలం గుర్తు చూపినందుకు తనపై గుజరాత్‌లో కేసు నమోదు చేశారని, తనపై తొలి కేసు ఇదేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు తాను ప్రధాని పదవికి పోటీ పడటం జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను వచ్చానని.. సీమాంధ్ర అభివృద్ధికి తన వద్ద బ్లూప్రింట్ ఉందని.. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ నగరం చిన్నబోయేలా రాష్ట్ర రాజధానిని నిర్మిస్తామని పేర్కొన్నారు. సీమాంధ్రలో నౌక, మెరైన్ ఇంజనీరింగ్, పెట్రోలియం వనరులు అభివృద్ధి, వైజాగ్ కేంద్రంగా రక్షణ పరికరాల తయారీ ప్రత్యేక యూనిట్లు తెస్తామన్నారు. తూర్పుతీరం వైపు ప్రపంచమంతా చూస్తున్నదని నౌకాయాన మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్‌కు దీటుగా హార్డ్‌వేర్ పార్కులు తెస్తామన్నారు.కేసీఆర్‌ని సైకిల్‌తో తొక్కేస్తా: చంద్రబాబు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెడపుట్టాడని, గురువుకే పంగనామాలు పెట్టే వ్యక్తి అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘‘కేసీఆర్ జాగ్రత్త.. సీమాంధ్రులకు హైదరాబాద్‌లో అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను.. సైకిల్ గేర్లు మార్చి స్పీడు పెంచి నీపై నుంచి తొక్కుకుంటూ వెళ్తా’’ అంటూ సీమాంధ్రులను ఆకట్టుకునేందుకు తంటాలు పడ్డారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని ప్రసంగంలో పేర్కొన్నప్పుడు జనం నుంచి పెద్దగా స్పందన లేకపోవటంతో వెంటనే కేసీఆర్‌పై తిట్లదండకం అందుకుని చంద్రబాబు పైవిధంగా మాట్లాడారు. కేసీఆర్ తన శిష్యుడేనని, చేతగానివాడని, చెడపుట్టాడ ని అన్నారు. ‘‘నాతో పెట్టుకోవద్దు’’ అంటూ కేసీఆర్‌ను హెచ్చరించారు. తాను సీఎం అయితే హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేయనని, సీమాంధ్రలో ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. కేసీఆర్ కుటుంబం మోడీకి క్షమాపణ చెప్పాలి: పవన్‌కల్యాణ్ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెబితేనే తాను కేసీఆర్ కుటుంబానికి క్షమాపణ చెబుతానని సినీనటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా తాను బెదిరేది లేదన్నారు. తాను ఏమి ఆశించి రాజకీయాల్లోకి రాలేదన్నారు. కేసీఆర్ సీమాంధ్రులను తిడుతున్నా, బెదిరిస్తున్నా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌనంగా ఉన్నారంటూ వారు ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డికి దమ్ముంటే తెలంగాణ మారుమూల గ్రామాల్లో తిరగాలన్నారు.  నరేంద్రమోడీ మాట్లాడుతూండగా పదే, పదే పవర్‌స్టార్ అంటూ పవన్‌కల్యాణ్ అభిమానులు అరుపులు, కేకలతో గోలగోల చేశారు. దీనితో.. వెంకయ్యనాయుడు ఒకింత అసహనంగా.. అపండయ్యా మీ గోల అంటూ మూడు సార్లు విసుక్కున్నారు. వాజ్‌పేయిని స్వర్గస్తుడ్ని చేసిన వెంకయ్య నరేంద్రమోడీ హిందీలో చేసిన ప్రసంగాన్ని బీజేపీ జాతీయనాయకుడు వెంకయ్యనాయుడు తెలుగులోకి తర్జుమా చేస్తూ వినిపించే క్రమంలో.. మోడీ ప్రసంగం కన్నా అధికంగా, మోడీ ఒకటి చెప్తే దానికి మరొకటి జోడించి చెప్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక సందర్భంలో.. గంగ-కావేరి నదుల అనుసంధానం కోసం మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి ప్రయత్నించారని మోడీ చెప్పగా.. వెంకయ్య తర్జుమా చేస్తూ ‘స్వర్గీయ వాజ్‌పేయి’ అనటంతో సభికులు ఆశ్చర్యపోయారు. అంతకుముందు వెంకయ్య మాట్లాడుతూ.. సీమాంధ్రవాసుల అభద్రతను తాను కర్ణాటక రాజ్యసభ సభ్యునిగా ఉండి పార్లమెంటులో ప్రస్తావించాల్సి వచ్చిందన్నారు. ఎన్‌డీయే అధికారంలోకి వస్తే సీమాంధ్ర సాగునీటి కోసం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ప్రాజెక్టులు కడితే ఈ రోజు కేసీఆర్ నీళ్లు ఇవ్వనంటున్నాడు. గోదావరి జలాలేమన్నా ఆయన అబ్బసొమ్మా?’’ అని వ్యాఖ్యానించారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top