అరవింద్ కేజ్రీవాల్ రాయని డైరీ | unwriten dairy of aravind kegriwal by madhav singaraju | Sakshi
Sakshi News home page

అరవింద్ కేజ్రీవాల్ రాయని డైరీ

May 24 2015 1:00 AM | Updated on Aug 20 2018 3:46 PM

అరవింద్ కేజ్రీవాల్ రాయని డైరీ - Sakshi

అరవింద్ కేజ్రీవాల్ రాయని డైరీ

ఇల్లూడ్చుకుంటున్నాను. గుమ్మంలో పేపరు, పాలప్యాకెట్ పడి ఉన్నాయి. పేపర్‌ని బయటికి చిమ్మేసి, పాలప్యాకెట్‌ని లోపలికి తెచ్చుకున్నాను. హాలు ఊడుస్తుంటే తలుపు దగ్గర చప్పుడయింది...

 - మాధవ్ శింగరాజు
 
ఇల్లూడ్చుకుంటున్నాను. గుమ్మంలో పేపరు, పాలప్యాకెట్ పడి ఉన్నాయి. పేపర్‌ని బయటికి చిమ్మేసి, పాలప్యాకెట్‌ని లోపలికి తెచ్చుకున్నాను. హాలు ఊడుస్తుంటే తలుపు దగ్గర చప్పుడయింది. ఎవరో బీజేపీ వాళ్ల బిళ్ల బంట్రోతులా ఉన్నాడు. తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు. ‘‘మా సాబ్‌కి ఇన్ఫామ్ చెయ్యకుండా మీరు మీ ఇంటిని ఎలా ఊడ్చుకుంటారు?’’ అంటున్నాడు! ‘‘సాబ్ ఎవరు! ఇది నా ఇల్లు. నేనూడ్వకపోతే మీ సాబ్ వచ్చి ఊడుస్తాడా?’’ అన్నాను. ‘‘మా సాబ్ ఎందుకు ఊడుస్తాడు? మీ ఇల్లు మీరే ఊడ్చుకోవాలి.

కానీ ఊడుస్తున్నట్లు ముందుగా మా సాబ్‌కి చెప్పాకే మీరు ఊడ్చుకోవాలి’’ అన్నాడు. ‘‘ఎవరు మీ సాబ్!’’ అన్నాను. ‘‘తెలిసే అడుగుతున్నారు కదా?! మా సాబ్ నజీబ్ జంగ్ సాబ్. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సాబ్’’  అన్నాడు. ‘‘మీరున్న ఇల్లు కూడా మా సాబ్ ఏరియా కిందికే వస్తుంది’’ అన్నాడు.
 ‘‘నువ్వెళ్లు నేను మాట్లాడతాను’’ అన్నాను. విన్లేదు. ‘‘మాట్లాడాకే వెళ్తాను’’ అని నట్టింట్లో నిలబడ్డాడు. ‘‘చీపురు తగులుతుంది పక్కకు తప్పుకో’’ అన్నాను. కదల్లేదు. ‘‘ఇదిగో ఈ లెటర్ పట్టుకెళ్లి మీ సాబ్‌కి ఇవ్వు’’ అన్నాను. అప్పుడు కానీ కదల్లేదు.

వెంటనే జంగ్ నుంచి రిప్లయ్! ‘నేషనల్ కాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్, ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్ రూల్స్‌ని అనుసరించి మాకు చెప్పకుండా మీరు మీ ఇంటిని ఊడ్చుకోవడం కానీ, మీ పనిమనుషులను మార్చుకోవడం కానీ, కొత్తవారిని చేర్చుకోవడం కానీ చేయకూడదు’ అని సారాంశం. నా కోపం నషాళానికి అంటింది. జంగ్ వాలకం లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌లా లేదు. మోదీ రైట్‌హ్యాండ్‌కి గన్‌మేన్‌లా ఉంది. చూడాలి. ఎంతవరకు వెళ్తాడో.
 ఆప్ అధికారంలోకి వచ్చి ఇవాళ్టికి సరిగ్గా వంద రోజులు. ఏదో ముక్కీ మూలిగీ ఇంతవరకు నెట్టుకొచ్చామట. అనేవాళ్లు అంటూనే ఉంటారు. పని చేసేవాళ్లు మూలగపోతే, పనిలేని వాళ్లు మూలుగుతారా! మీడియా మూలుగుతుందా? మోదీ మూలుగుతాడా? నజీబ్ జంగ్ మూలుగుతాడా?

నూర్రోజులుగా ఢిల్లీ అంతా ఊడ్చి ఊడ్చి ఒళ్లు అలసిపోయింది నాకూ, మా టీమ్‌కి. నేనైతే క్రోసిన్ మాత్రలు వేసుకుని ఊడ్చిన రోజులూ ఉన్నాయి. ప్రజల సమస్యలన్నీ తీర్చేశాక ఎప్పుడైనా ఒకరోజు సెలవు పెట్టి, ఆటో కట్టించుకుని హాయిగా సిటీ అంతా తిరిగి రావాలి. వస్తానంటే నజీబ్ జంగ్‌ని కూడా కూర్చోబెట్టుకుని నా ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారో చూపించాలి. మోదీని కూడా వెంటబెట్టుకుని వెళ్లొచ్చు కానీ... ఆయన్ని ఆటోలోకి ఎక్కించడం, ఆటోలోంచి దించడం కష్టం కావచ్చు. భూమ్మీద ప్రయాణించడం ఆయనకు అలవాటు తప్పి ఏడాది పూర్తవుతోందిగా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement