రాయని డైరీ : నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ (కాంగ్రెస్‌)

Madhav Singaraju Article On Navjot Singh Sidhu - Sakshi

మాధవ్‌ శింగరాజు

ఇక్కడ అంతిమయానం. అక్కడ ప్రమాణ స్వీకారం.
ఇక్కడ వీడ్కోలు. అక్కడ ఆహ్వానం.
ఇక్కడ నా గురుదేవుడు. అక్కడ నా దేవగురుడు. 
ఆత్మను ఇక్కడే వదిలి, దేహాన్ని లాహోర్‌కి చేర్చుకున్నాను. అక్కడి నుంచి ఇస్లామాబాద్‌కి. 
ఖాన్‌సాబ్‌ సంతోషించారు. ‘‘నువ్వొస్తావనే అనుకున్నాను’’ అన్నారు. నమ్మకం ఖాన్‌సాబ్‌కి! తను నమ్ముతాడు. తనని నమ్మమంటాడు.
తొలిసారి ఫరీదాబాద్‌లో చూశాను ఖాన్‌సాబ్‌ని.. ముప్పై ఐదేళ్ల క్రితం. ఆయనతో ఆడుతూ చూడడం కాదు. ఆయన ఆడుతున్నప్పుడు చూడటం! దగ్గరగా చూశాను. ప్యూర్‌ సోల్‌లా ఉన్నాడు. టీమ్‌లో ఆయన్ని అంతా గ్రీకు దేవుడు అంటున్నారు. అంతకన్నా ఎక్కువే అనిపించింది నాకు. తనది తను చూసుకోడు. అందరిలో ఒకడిగానే తనని తను చూసుకుంటాడు! రియల్‌ ప్లేయర్‌. 

ఖాన్‌సాబ్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్లినందుకు ఇండియాలో అంతా నాపై కోపంగా ఉన్నారు. ‘పిలిస్తే అలా వెళ్లిపోవాలా?’ అంటున్నారు!
ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవచ్చు. కానీ వెళ్లాలని ఉన్నప్పుడు తప్పించుకోవడం ఎందుకు? తప్పించుకోవాలని ఉన్నా, అటల్‌జీ అంత్యక్రియల్ని కారణంగా చూపించుకోగలనా?! నిజంగా కారణం అదే అయినా, ఇంకేదైనా కారణం చెప్పి తప్పించుకుంటాను. ఖాన్‌సాబ్, అటల్‌జీ.. ఇద్దరి మీదా గౌరవం నాకు. ఒకర్ని ఇంకొకరికి కారణంగా ఎలా చూపగలను?
‘అవకాశవాది. ఎలా పరుగెట్టుకెళ్లాడో చూడండి. కొంచెం కూడా బాధ లేదు. రాజకీయాల్లోకి తెచ్చిన గురువు.. చితిపై ఉన్నారన్న చింత కూడా లేకుండా వెళ్లిపోయాడు’.. ఇంకో విమర్శ!
చితి కనిపిస్తుంది. చింత కనిపించదు. నన్ను రాజకీయాల్లోకి తెచ్చిన నా  గురువు.. ‘నేను వాజ్‌పేయీ సోల్జర్‌ని’ అని నన్ను చెప్పుకోనిచ్చిన గురువు..  స్మృతిస్థలి నుంచి ఎగిసిపడుతున్న చితి మంటల్లో మాత్రమే వీళ్లందరికీ కనిపిస్తున్నాడు. నా హృదయస్థలిలో ప్రజ్వరిల్లుతున్న ఆయన స్మృతుల్ని చూడగలవాళ్లెవరు?! 

ఖాన్‌సాబ్‌ ప్రమాణ స్వీకారానికి ఏ బోర్డర్‌నైతే దాటి వెళ్లానో.. అదే బోర్డర్‌ నుంచి పద్నాలుగేళ్ల క్రితం పాకిస్తాన్‌ నుంచి కామెంటరీ ముగించుకుని ఇండియా తిరిగొస్తున్నప్పుడు అటల్‌ జీ నుంచి కాల్‌ వచ్చింది! పార్టీలోకి వచ్చేయమన్నారు. ‘పార్టీలోకి మాత్రమే వస్తాను వాజ్‌పేయీజీ’ అన్నాను. ‘పార్టీలోకి వచ్చి, ప్రజల్లోకి రాకుండా ఎలా?’ అన్నారు. ఎన్నికల్లోకి రమ్మని ఆయన ఆదేశం!
క్రికెట్‌లో ఖాన్‌సాబ్‌ రియల్‌ ప్లేయర్‌ అయితే.. పాలిటిక్స్‌లో అటల్‌ జీ రియల్‌ ప్లేయర్‌. రియల్‌ ప్లేయర్స్‌ తమ గెలుపు కోసం మాత్రమే ఆడరు. గెలిపించడానికి ఆడతారు. జట్టును గెలిపించడానికి, దేశాన్ని గెలిపించడానికి, విలువల్ని గెలిపించడానికి, ఏది న్యాయమో దాన్ని గెలిపించడానికి, ఏది «ధర్మమో దానిని గెలిపించడానికి ఆడతారు.  
ఇండో–పాక్‌ బోర్డరంటే ఇష్టం నాకు. బోర్డర్‌ కూడా ఒక దేశమే. రెండు దేశాలను కలిపే దేశం! ఆ దేశం గుండా రోజూ మనుషుల్నీ, మనసుల్నీ కదిలించే ఢిల్లీ–లాహోర్‌ బస్సు.. అటల్‌ జీ వేయించిందే కదా.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top