రెండు సదస్సులు భిన్న దృశ్యాలు

G7 Summit Held In Canada - Sakshi

వర్తమాన ప్రపంచ పరిస్థితులకు అద్దం పట్టే రెండు చిత్రాలు మీడియాలో సోమవారం ప్రముఖంగా దర్శనమిచ్చాయి. అందులో ఒకటి చైనాలోని చింగ్‌దావ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశాలకు సంబంధించిందైతే...రెండోది కెనడాలోని క్యుబెక్‌లో జరిగిన జీ–7 దేశాల అధినేతల సమావేశ దృశ్యం. ఎస్‌సీఓ సదస్సులో నేతలందరూ వాణిజ్యం, భద్రత రంగాల్లో సమష్టిగా కలిసి పనిచేసి అభివృద్ధి సాధించాలని నిర్ణయించుకోగా...జీ–7లో నేతలు పరస్పర ఆరోపణలతో పొద్దుపుచ్చారు. జీ–7 సదస్సు ముగిశాక కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో దేశాధినేతలమధ్య అవగాహన కుదిరిందంటూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయగా అది నిజం కాదని, దాన్ని తాము ఖండిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించి సదస్సు పరువు తీశారు. అయితే ఎస్‌సీఓ సదస్సులోనూ విభేదాలు రాకపోలేదు. చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌(బీఆర్‌ఐ)కు భారత్‌ మినహా ఎస్‌సీఓ దేశాలన్నీ మద్దతు ప్రకటించాయని సదస్సు ముగింపు తర్వాత విడుదలైన ప్రకటన తెలిపింది. రెండు సదస్సుల తీరు తెన్నులనూ గమనిస్తే మనం ఎంత మెలకువతో వ్యవహరించాలో అర్ధమవుతుంది.

ఎస్‌సీఓ యూరేసియా దేశాల కోసం చైనా చొరవతో ఏర్పాటైన సంస్థ. అందులో రష్యాతోపాటు మన దేశం, పాకిస్తాన్, కజఖ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజిస్తాన్‌ సభ్య దేశాలుగా ఉంటే ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌ వంటివి పరిశీలక హోదాలో పాల్గొంటున్నాయి. బీఆర్‌ఐపై భిన్నాభిప్రాయం మినహా ఆ సదస్సులో చర్చించిన ఇతర అంశాలపై మన దేశానికి ఏకీభావం ఉంది. ఎస్‌సీఓలో మన దేశానికి పూర్తి స్థాయి సభ్యత్వం రావడం ఇదే ప్రథమం. మనతోపాటు పాకిస్తాన్‌కు కూడా ఇందులో చోటు దక్కింది. చైనా చొరవతో రూపుదిద్దుకున్న బీఆర్‌ఐ ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. అమెరికాతో పాటు అగ్ర రాజ్యాలన్నీ స్వీయ మార్కెట్ల రక్షణ కోసం మార్గాలు వెదుక్కుంటున్న వేళ ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాల వాణిజ్యాన్ని అనుసంధానించే బీఆర్‌ఐ నిస్సందేహంగా బహుళవిధ ప్రయో జనకరమైనదే. ప్రాచీన కాలంలోని సిల్క్‌ రోడ్‌ను తలపించేలా ఖండాంతరాల్లోని దాదాపు 80 దేశా లను అనుసంధానించే ఈ ప్రాజెక్టు ప్రపంచ జనాభాలో 64శాతం మంది అంటే 450 కోట్ల ప్రజా నీకాన్ని ఏకం చేస్తుంది. 

ఈ దేశాలన్నిటి మధ్యా వాణిజ్యం అత్యంత సులభమై అన్ని దేశాలూ సంప న్నవంతం కావడానికిది దోహదపడుతుంది. ఆగ్నేయాసియా, యూరప్, ఆఫ్రికా దేశాలతో నేరుగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడానికి, మన మార్కెట్‌ను ఇప్పటికన్నా ఎన్నో రెట్లు విస్తరించు కోవడానికి బీఆర్‌ఐ నిస్సందేహంగా ఉపయోగపడుతుంది. అయితే మన దేశానికున్న ప్రధాన అభ్యంతరమల్లా అలాంటి ప్రాజెక్టు దేశాల సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతలను గుర్తించి గౌరవించాలన్నదే. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న చైనా–పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌(సీపీఈసీ) పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భూభాగంలోని గిల్గిత్‌–బాల్టిస్తాన్‌ల మీదుగా వెళ్తోంది. సారాంశంలో బీఆర్‌ఐ ప్రాజెక్టును మన దేశం అంగీకరించడమంటే పాక్‌ దురాక్రమణకు ఆమోదం తెలపడమే, సాధికారత కల్పించడమే అవుతుంది. 

అగ్రరాజ్యాల మధ్య విభేదాలు ముదురుతూ జీ–7 దేశాల శిఖరాగ్ర సద స్సుల వంటివి కూడా విఫలమవుతున్న వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక చోదక శక్తిగా ఎదగా లని చైనా తహతహలాడుతోంది. పలుకుబడిని విస్తరించుకోవాలని ఆశిస్తోంది. అటువంటప్పుడు దాదాపు 130 కోట్ల జనాభాతో ఆసియాలో తన పొరుగునే అతి పెద్ద మార్కెట్‌గా రూపుదిద్దుకున్న భారత్‌ మనోభావాలను విస్మరించడం చైనాకు తగని పని. తన సార్వభౌమత్వాన్ని సవాలు చేసే విధంగా ఏర్పాటైన ప్రాజెక్టులో ఏ దేశమైనా ఎలా పాలుపంచుకోగలదో చైనా ఆలోచించాలి. నిజానికి దాదాపు రెండేళ్లనుంచి ఈ విషయంలో మన దేశం అభ్యంతరం చెబుతూ వస్తోంది. ఎస్‌సీఓలో భారత్, పాకి స్తాన్‌లు రెండూ చేరడంతో సంస్థ బలోపేతమైందని చెప్పిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌... సభ్య దేశాలు ఘర్షణాత్మక వాతావరణాన్ని విడనాడాలని, ఇతర సభ్య దేశాల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను మానుకోవాలని సూచించారు. మంచిదే. కానీ బీఆర్‌ఐలో ఉన్న లోపాల మాటేమిటి? 

తన ప్రయోజనాలకు భిన్నంగా ఉన్న ఇండో–పసిఫిక్‌ ప్రాంత కూటమిలో మన దేశం పాలు పంచుకుంటున్నదన్న దుగ్ధ చైనాకు ఉంది. భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాల భాగ స్వామ్యంతో ఏర్పాటయ్యే ఆ ‘చతుర్భుజ కూటమి’ ఇంకా శైశవ దశలోనే ఉంది. నాలుగు దేశాల మధ్యా చర్చలు సాగుతున్నా చివరిలో వేర్వేరు ప్రకటనలు వెలువడుతున్నాయి తప్ప ఉమ్మడి ప్రకటనల దశ ఇంకా మొదలు కాలేదు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా ఉండాలని, అన్ని దేశాల అభివృద్ధికీ దోహదపడేలా ఉండాలని స్థూలంగా ఆ కూటమి భావిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని దీవులు తమవేనంటూ సొంతం చేసుకున్న చైనా తీరును మిగిలిన మూడు దేశాలూ పరోక్షంగా తప్పుబడుతున్నాయి. 

అక్కడి సముద్ర జలాల్లో స్వేచ్ఛా సంచారానికి వీలుం డాలని, అంతర్జాతీయ నిబంధనలు వర్తించాలని ఆ దేశాలు అంటున్నా మన దేశం ప్రకటనలు ఇంత వరకూ వాటి జోలికి పోలేదు. అయినా మనపై చైనా గుర్రుగా ఉంది. అందుకే కావొచ్చు... బీఆర్‌ఐ విషయంలో మన వాదనను విస్మరిస్తోంది. జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగిన తీరు, అక్కడ భారత్‌ ప్రస్తావన తెచ్చి విమర్శించిన ట్రంప్‌ వైఖరి గమనించాక మన విదేశాంగ విధానం మరింత పదునుదేరాలని అర్ధమవుతుంది. అయిదు వారాల క్రితం అనధికార శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ, జిన్‌పింగ్‌లు ఇప్పుడు ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా కూడా కలుసుకున్నారు. మరో అన ధికార శిఖరాగ్ర సదస్సు కోసం వచ్చే ఏడాది మన దేశం వస్తానని జిన్‌పింగ్‌ చెప్పారు. ఈ పరిణా మాలు ఎంతో ఆశావహమైనవి. ఇవి అపోహలనూ, విభేదాలనూ పటాపంచలు చేసి రెండు దేశాల మధ్యా మరింత సాన్నిహిత్యానికి దోహదపడాలని ఆశిద్దాం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top