
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్లు 31న చైనాకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2019 తరువాత ప్రధాని మోదీ చైనాకు వెళుతున్న తొలి పర్యటన ఇది. తూర్పు లడఖ్, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సరిహద్దు వివాదాలపై భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగని ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాకు వెళ్లనున్నారు. ఈ సమావేశం టియాంజిన్‌లో జరగనున్నది. ఈ ఉన్నత స్థాయి దౌత్య భేటీ రెండు ఆసియా దిగ్గజాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచనున్నది. తూర్పు లడఖ్‌లో సరిహద్దు ప్రతిష్టంభనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజింగ్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం.. ఇటీవలే పూర్తి సభ్యత్వం పొందిన రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఇరాన్‌లతో సహా ఎనిమిది సభ్య దేశాల నేతలను ఒకచోట చేర్చనుంది.
మోదీ చేస్తున్న ఈ పర్యటన పర్యటన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో వ్యక్తిగత సమావేశానికి మార్గం సుగమం చేయనుంది. 2020లో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత వీరి మధ్య భేటీ జరగడం ఇదే మొదటిసారి.ఈ ఇరువురు నేతలు ఇటీవల జరిగిన ప్రపంచ శిఖరాగ్ర సమావేశాలలో తారసపడినప్పటికీ, ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. అధికారిక ప్రకటన లేనప్పటికీ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చర్చలు జరగనున్నాయి.
2020 మేలో జరిగిన గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా కూడా కొందమంది సైనికులను కోల్పోయింది. అయితే వారి సంఖ్యను చైనా బహిరంగంగా వెల్లడించలేదు. కాగా త్వరలో జరగబోయే ద్వైపాకక్షిక సమావేశంలో భారత్- చైనా మధ్య ప్రత్యక్ష విమాన సంబంధాలను తిరిగి ప్రారంభించడంపై చర్చ జరగనున్నదని సమాచారం. అలాగే వీసాలను సులభతరం చేయడానికి, సరిహద్దుల్లో నదులకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు ప్రతిపాదనలు జరగనున్నాయని తెలుస్తోంది.