
సరిహద్దు ఉగ్రవాదం భారత్, చైనా దేశాలపై ప్రభావం చూపుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదం అనేది మానవత్వానికి, శాంతికి ముప్పుగా పరిణమించిందని తియాన్‌జిన్ వేదికగా సోమవారం జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు
‘‘ఉగ్రవాద సమస్యలతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి. ఎస్‌సీవో సభ్య దేశంగా భారత్ కీలక భూమిక పోషిస్తోంది. ఎస్‌సీవో కోసం భారత్ విజన్, పాలసీ 3 పిల్లర్లపై ఆధారపడి ఉంది. భద్రత, అనుసంధానం, అవకాశాలు 3 పిల్లర్లుగా నిలుస్తాయి. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు 2025(SCO Summit)లో మోదీ ప్రసంగించారు.
సరిహద్దు ఉగ్రవాదం భారత్‌తో పాటు చైనాపైనా ప్రభావం చూపుతోంది. ఇరు దేశాలకూ ఇదొక సవాల్‌గా మారిందని మోదీ స్పష్టం చేశారు.ఈ సమస్యను ఎదుర్కొనడానికి పరస్పర సహకారం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగితేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు.
పాక్ ప్రధానిపై విసుర్లు
SCO సదస్సు వేదికలో పాకిస్తాన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంగా బహిరంగంగా విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపం. అయినా ఉగ్రవాదంపై రాజీ ఉండబోదు అని స్పష్టం చేశారు. ‘‘ఆ సమయంలో కొన్ని దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలకు మా కృతజ్ఞతలు. అలాగే.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలను మేం అంగీకరించబోం’’ అని వ్యాఖ్యానించారాయన.
భద్రత ప్రతి దేశ హక్కు. ఉగ్రవాదం మనమందరికీ సవాల్. ఇది కేవలం భారత్‌కు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు. SCO సభ్యదేశాలు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండించాలి. అంతర్జాతీయంగా ఏకతా అవసరమని మోదీ పిలుపునిచ్చారు.
ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అక్కడే ఉన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పాక్‌కు అపమానకరమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకు ముందు.. సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతలను ఆప్యాయంగా పలకరించిన మోదీ.. పాక్ ప్రధాని వైపు కనీసం కన్నెత్తి చూడలేదు.
పాక్ పేరు లేకుండానే..
సదస్సు ముగింపు ప్రకటనలో చైనా సహా యూరేషియన్(యూరప్+ఆసియా సమాహారం) దేశాలు భారత్ వైపు నిలిచాయి. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ.. ఎస్‌సీవో సదస్సులో తీర్మానం చేశాయి. అయితే.. అందులో ఎక్కడా పాకిస్థాన్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. చైనా, టర్కీ సహా పలు దేశాలు పహల్గాం బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశాయి. దాడికి పాల్పడినవారిని శిక్షించాలని వేదిక నుంచి గళం వినిపించాయి. ఉగ్రవాదం, విభజనవాదం, తీవ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని సభ్యదేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అదే సమయంలో.. పాక్‌లో జరిగిన జాఫర్ ఎక్స్‌ప్రెస్, ఖుజ్దార్ దాడులను కూడా ఖండించాయి.

మరోవైపు.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్, చైనా అధినేతలు చర్చించుకున్నారు. ఈ విషయంలో భారత్ చైనా మద్దతు కోరగా.. చైనా అందుకు అంగీకరించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు.