హేతుబద్ధత ఎక్కడ? | Sakshi
Sakshi News home page

హేతుబద్ధత ఎక్కడ?

Published Tue, Mar 17 2020 12:43 AM

Editorial On Andhra Pradesh Local Body Polls Postponed - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా సాకుతో ఆరు వారాలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదివారం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్థానిక సంస్థలకు ప్రభుత్వాలు వీసమెత్తు విలువీయడం లేదని, వాటికి సకాలంలో ఎన్నికలు జరపడం లేదని ప్రజాస్వామికవాదుల నుంచి తరచు విమర్శలొస్తూ వుంటాయి. ఇదొక రివాజుగా మారుతున్నదని గ్రహించాక నిర్దిష్ట వ్యవధిలో ఎన్నికల నిర్వహణను తప్పనిసరిచేస్తూ 1992లో కేంద్రం రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. అయినా ఆ సవరణకు తూట్లు పొడుస్తూనేవున్నారు. ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసినప్పుడైనా, ఆ తర్వాత మొన్నటివరకూ అయిదేళ్లు ఆ పదవిలో కొనసాగినప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలంటే ఆయనకు ప్రాణాంతకమే.

న్యాయస్థానాలు మొట్టికాయలేసినా... విప క్షాలు ఒత్తిళ్లు తెచ్చినా బేఖాతరే. 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అప్పటి ఉమ్మడి హైకోర్టు ఆదేశించినా ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. స్థానిక సంస్థలపై ఆయనకెంత చిన్నచూపో బాబు గతంలో రాసుకున్న ‘మనసులో మాట’ బయటపెట్టింది. చిత్రమేమంటే విప క్షానికి పరిమితమైనా ఈ విషయంలో ఆయన వైఖరి మారలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన రిజ ర్వేషన్లను సవాలు చేస్తూ తన పార్టీ వ్యక్తితో న్యాయస్థానాల్లో పిటిషన్‌ దాఖలు చేయించారు.

చైనాలోని వూహాన్‌లో కరోనా జాడ కనబడ్డాక ఆ సాకుతో ఎన్నికలు వాయిదా వేయిద్దామని బాబు ప్రయ త్నించారు. ఆయనతో కాంగ్రెస్, జనసేన గొంతు కలిపాయి. ఈ అవరోధాలన్నీ దాటుకుని ఈ నెల 7న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడినప్పటినుంచి బాబుకు కంటిమీద కునుకు లేదు. కరోనా రాష్ట్రానికి ఎప్పుడొస్తుందా, ఎప్పుడు ఎన్నికల్ని ఆపేస్తుందా అన్నట్టు ఆయన ఎదురు చూశారు. ఆ అవసరం లేకుండానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్థానిక ఎన్నికలను ఏకంగా ఆరువారాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించి బాబు మనోభీష్టాన్ని నెరవేర్చారు. 

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వాలు మోకాలడ్డుతుంటాయి. కానీ ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తిచేయాల్సిన కమిషనే ఈసారి ఆ పని చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. కేంద్రం కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించినందువల్ల వాయిదా వేస్తున్నామని నిమ్మగడ్డ చేస్తున్న వాదన తర్కానికి నిలబడదు. ఈ నెల 7న షెడ్యూల్‌ ప్రకటించేనాటికీ, ఇప్పటికీ ఆంధ్రప్రదే శ్‌లో కొత్తగా తలెత్తిన విపత్కర పరిస్థితులేమీ లేవు. సోమవారం కేంద్రం ప్రకటించిన గణాంకాలు గమనిస్తే దేశవ్యాప్తంగా వెల్లడైన కరోనా కేసులు 116 కాగా, మృతుల సంఖ్య 2. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా అనుమానిత కేసులు 79. వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపాక అందులో 66మందికి ఆ వ్యాధి లేదని తేలింది. ఒక్కరికి మాత్రం పాజిటివ్‌ అని వచ్చింది. అతను కూడా కోలుకుంటున్నాడని, త్వరలో డిశ్చార్జి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించింది.

వ్యాధిగ్రస్తులెవరైనా ఉన్నట్టు తేలితే వారికి ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించడానికి వీలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలు ఏర్పాట్లు చేసింది. అనుమానితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఇప్పటికే తిరుపతి, విశాఖల్లోవున్న వైరాలజీ ల్యాబ్‌లకు తోడు విజయవాడలో కూడా మరొకటి నెలకొల్పారు. ఈ వాస్తవాలన్నీ ఎన్నికల కమి షనర్‌కు అవసరం లేదా? తమకు హైకోర్టు జడ్జి అధికారాలుంటాయని వాదిస్తున్న కమిషనర్‌.. ఆ అధి కారాల ప్రాతిపదికగా తీసుకునే నిర్ణయాలకు హేతుబద్ధత కూడా అవసరమన్న సంగతిని ముందుగా గ్రహించాలి. రాష్ట్రంలో కరోనా వ్యాధి ఉందో లేదో... ఉంటే దాని తీవ్రత ఎంతో నిమ్మగడ్డ తనకు తాను ఎలా నిర్ణయానికి రాగలుగుతారు? ఆ వ్యాధికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసు కుంటున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించకుండా వాస్తవ పరిస్థితేమిటో ఆయనకు బోధ పడేదెలా? కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదించామన్న సంజాయిషీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఎక్కడో ఢిల్లీలో వున్నవారితో మాట్లాడగలిగిన కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాం గాన్ని సంప్రదించాలన్న ఇంగిత జ్ఞానం ఎందుకు లేకపోయింది? కనీసం జిల్లా కలెక్టర్లతో మాట్లాడినా క్షేత్రస్థాయి పరిస్థితులేమిటో ఆయనకు అవగాహన కలిగేది. అప్పటికీ శంక తీరకపోతే సభలూ, సమావేశాలపై ఆంక్షలు పెట్టవచ్చు. పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచి తక్కువ వ్యవధిలో అధికశాతం మంది ఓట్లేసేవిధంగా చర్యలు తీసుకోవచ్చు. ఏం చేసైనా సకాలంలో స్థానిక సంస్థలకు ప్రాణప్రతిష్టచేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలన్న సంకల్పం కమిషన్‌కే కొరవడటం విస్మయం కలిగిస్తుంది.

నోటిఫికేషన్‌ వెలువడిననాటినుంచీ ఎన్నికలకు గండికొడదామని బాబు ఎంతగా తాపత్రయ పడుతున్నారో అందరికీ తెలుస్తూనేవుంది. తన పార్టీ శ్రేణుల్ని రంగంలోకి దించి, హింసను ప్రేరేపించి దాన్ని కారణంగా చూపుదామని ఆయన చేసిన ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలు కొన్నిరోజులుగా గమని స్తూనే వున్నారు. కానీ ఎన్నడూలేని విధంగా నామినేషన్ల ప్రక్రియ స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విచ్చలవిడిగా పారకుండా చేయడంలో, ఎవరూ శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా చూడటంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధిం చింది. షెడ్యూల్‌ ప్రకారం మరో వారంలో ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు మొదలై నెలాఖరుకల్లా ఫలితాలు కూడా వెలువడతాయి. కరోనా తన ప్రతాపం చూపకముందే స్థానిక సంస్థలు ఉనికిలోకొచ్చి, ఆ వ్యాధిని అరికట్టడంలో తమ వంతు పాత్ర పోషించగలుగుతాయి. ఈ విషయంలో అవగాహనారాహిత్యంతో ప్రవర్తించిన ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని న్యాయస్థానాలు సరిదిద్దుతాయని, స్థానిక స్వపరిపాలన స్ఫూర్తిని కాపాడతాయని ఆశించాలి.

Advertisement
Advertisement