సీబీఐకి గహ్లోత్‌ పొగ

Editorial About Rajasthan Politics - Sakshi

రాజస్తాన్‌ కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలు చివరకు సీబీఐకి ఆ రాష్ట్రంలో తలుపులు మూశాయి. దాడులు నిర్వహించాల్సివున్నా, దర్యాప్తు చేయాల్సివున్నా ఆ సంస్థ ముందుగా తమ అనుమతి తీసుకోవడం తప్పనిసరంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగిన కుట్రలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌తోపాటు మరో ఇద్దరి ప్రమేయం వున్నదని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఆడియో టేపులు విడుదల చేయడం పర్యవసానంగా అక్కడి రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తీసుకుంది. ఆ టేపుల వ్యవహారంపై రాజస్తాన్‌ పోలీస్‌ విభాగం స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌(ఎస్‌ఓజీ) దర్యాప్తు మొదలుపెట్టడం, హరియాణాలోని అయిదు నక్షత్రాల హోట ల్‌లో కొలువుదీరిన అసమ్మతి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని ప్రశ్నించడానికి ఆర్భాటంగా వెళ్లడం అందరూ చూశారు. అటు టెలిఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఆ కారణంతోనే సీబీఐ  ముందస్తు అనుమతి పొందాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

రాజస్తాన్‌ సంక్షోభంలో అంతిమంగా ఎవరిది పైచేయి అవుతుందన్న సంగతలా వుంచితే... సీబీఐ పదే పదే ఇలాంటి నింద ఎదుర్కొనక తప్పడం లేదని మరోసారి రుజువైంది. కేంద్రంలో అధికారంలో వుండే వారు చెప్పినట్టుగా వింటుందన్న అభియోగం సీబీఐపై ఎప్పటినుంచో వుంది. ఆ సంస్థ డైరెక్టర్లుగా వున్నవారు ఆ నిందను రూపుమాపడానికి బదులు దాన్ని బలపరిచేవిధంగానే ప్రవర్తించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇదంతా బాహాటంగా సాగింది. కనుకనే ఒక దశలో స్వయంగా సర్వోన్నత న్యాయస్థానమే దాన్ని ‘పంజరంలో చిలుక’గా అభి వర్ణించింది. బొగ్గు కుంభకోణంలో దర్యాప్తు నివేదికలను నిర్దిష్ట సమయంలో సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో సమర్పించాల్సివుండగా, అంతకన్నా ముందు ఆ నివేదికల్ని ప్రభుత్వంలోని కీలక నేతలకు చూపుతున్నదని ఆరోపణలొచ్చాయి. మొదట్లో అదంతా అబద్ధమని కొట్టిపారేసిన సీబీఐ, చివరకు తప్పు ఒప్పుకోవాల్సివచ్చింది. ‘నిజమే... నివేదికల్ని చూపాం. అది ఇకపై జరగనివ్వబోమ’ని అఫిడ విట్‌ సమర్పించింది. అప్పటి ఏలికలుగా కాంగ్రెస్‌ నేతలే దాన్ని ఆ స్థితికి తెచ్చారు.  స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా తమను ప్రశ్నించినవారినల్లా సీబీఐ బూచిని చూపించి బెదిరించడానికి ప్రయ త్నించిన చరిత్ర వారిది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు మొదలైతే ఏం జరుగుతుందో తెలియబట్టే గహ్లోత్‌ ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు. 

గహ్లోత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని చూస్తే ఏడాదిన్నరక్రితం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రవర్తించిన తీరు గుర్తొస్తుంది. ఆయన కేంద్రంపై వీరోచితంగా పోరాడుతున్నానంటూ జనాన్ని మభ్యపెట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగేవారు. రాష్ట్రంలో అడుగుపెట్టనీయబోమంటూ శపథాలు చేసేవారు. ఒకసారి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తిరుమల వచ్చినప్పుడు కొందరితో ఆయనపై రాళ్ల దాడి చేయించారు. పోలవరం ప్రాజెక్టులోనూ, రాజధాని భూముల విషయంలోనూ అప్పటికే బాబు, ఆయన అనుచరగణం భారీయెత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. కనుక తన అవినీతి చరిత్ర అంతా బట్టబయలవుతుందేమో... సీబీఐ దర్యాప్తు తప్పదేమో అన్న బెంగ ఆయన్ను పీడించింది. దాంతో రాష్ట్రంలో ముందస్తు అనుమతి వుంటే తప్ప సీబీఐ దర్యాప్తు చేయరాదన్న ఉత్తర్వులు తెచ్చారు. చిత్రమేమంటే అధికారంలో వున్నా, విపక్షంలో వున్నా సీబీఐని కొన్నేళ్లపాటు తన జేబు సంస్థగా మార్చుకోగలిగిన చరిత్ర బాబుది. కనుకనే ఈ బాపతు నేతలందరికీ సీబీఐ మున్ముందు ఏం చేస్తుందో అందరికన్నా బాగా తెలుసు. పదవి, అధికారం ముసు గులో వాస్తవాలను మరుగుపర్చడానికి ప్రయత్నిస్తే... అందుకోసం వ్యవస్థల్ని దిగజారిస్తే వ్యక్తులతో పాటు ఆ వ్యవస్థలు కూడా దెబ్బతింటాయి. సీబీఐ అలా దెబ్బతిన్నదని ఈ నేతలు భావిస్తుండవచ్చు. కానీ అందులో తమ భాగస్వామ్యం కూడా ఎక్కువే వున్నదని ముందుగా వీరంతా ఒప్పుకోవాలి. 

రాజస్తాన్‌లో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు తీవ్రమైనవి. డబ్బుకు ఆశపడి పార్టీ మారడానికి, ప్రభుత్వాలను కూల్చడానికి ప్రజా ప్రతినిధులే ప్రయత్నించడం అనేది ఆందోళ నకరమైన పరిణామమే. దేశంలో తరచుగా ఇలాంటివి జరుగుతూనేవున్నాయి. ఇప్పుడు ఇదంతా అన్యాయమని మొత్తుకుంటున్నవారు గతంలో ఇలాంటి పనులు చేసిన చరిత్ర వున్నవారే. ఇంతకూ సీబీఐని రాష్ట్రంలో రానీయకపోవడమన్నది గహ్లోత్‌ స్వీయ నిర్ణయమా లేక పార్టీ నిర్ణయమా? ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు కూడా ఇదే మాదిరి చేస్తారా అన్నది చూడాలి. పైలట్‌ను అసమర్థుడు, పనికిమాలినవాడు అని తిట్టిన గహ్లోత్‌ తన చర్యల తీరును కూడా పరిశీలించుకోవాలి. ఒకపక్క హరియాణా హోటల్‌లో పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలు తలదాచుకోవడం తప్పంటున్న ఆయన... తన ఎమ్మెల్యేలను జైపూర్‌లోని హోటల్‌లో ఎందుకు వుంచాల్సివచ్చిందో చెప్పాలి.

రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్‌దే గనుక తమ ఎమ్మెల్యేలను ఎవరో అపహరిస్తారన్న సంశయం ఆ పార్టీకి వుండనక్కరలేదు. అందుకవసరమైన బందోబస్తు వారి వారి ఇళ్ల దగ్గరే ఏర్పాటు చేయొచ్చు. కానీ వారిని స్వేచ్ఛగా వుంచితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... ఏం జరుగుతుందోనన్న బెంగ వల్లనే అధికార పక్షం సైతం తన ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించింది. మొత్తానికి సొంత ఇంటిని చక్కదిద్దుకోవడం చేతగాక కాంగ్రెస్‌ చేజేతులా ఈ పరిస్థితి తెచ్చుకుంది. బీఎస్‌పీ వగైరా పార్టీల నుంచి కొత్తగా కాంగ్రెస్‌కు వలసలు వచ్చినా ఇప్పుడున్నది అరకొర మెజారిటీయే. కనుక తక్షణం బలపరీక్ష జరిగితే ఈ లెక్కలు కూడా తారుమారై గహ్లోత్‌ సర్కారు చిక్కుల్లో పడినా పడొచ్చు. ఇప్పుడు గట్టెక్కినా అది దినదినగండంగా బతుకీడ్వాల్సిందే. ఈలోగా సీబీఐని రానివ్వబోమని, మరెవరినో అడ్డుకుంటామని నిర్ణయాలు తీసుకోవడం వల్ల గహ్లోత్‌కు అదనంగా ఒరిగేదేమీ వుండదు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top