ఇది పరీక్షాసమయం !

Editorial About People Neglecting Coronavirus Situations - Sakshi

దేశం నలుమూలలా వేగంగా విస్తరించజూస్తున్న మృత్యు వైరస్‌ను అంతమొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపే స్ఫూర్తిగా సమస్త భారతావని ఆదివారం నాడు సమరభేరి మోగించింది. పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా... చిన్నా పెద్దా, ఆడా మగా, ధనిక బీద తారతమ్యం పాటించకుండా అందరికందరూ ఆసేతు హిమాచలం జనతా కర్ఫ్యూను జయప్రదం చేశారు. ఈ క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయక అత్యవసర సేవల్లో నిమగ్నులైన వారందరికీ ఇళ్ల ముందు, బాల్కనీల్లో నిలబడి కోట్లాదిమంది తమ కృతజ్ఞతాపూర్వక చప్పట్లతో జేజేలు పలికారు.

జనసమ్మర్ధంతో నిరంతరం కిటకిటలాడే ప్రదేశాలు సైతం ఒక్కరంటే ఒక్కరు కనబడక బోసిపోయాయి. ఇప్పటికే కోవిద్‌–19 కొన్ని దేశాల్లో వేస్తున్న వీరంగం గమనిస్తే ఇప్పుడున్న బాధితుల సంఖ్య అచిరకాలంలోనే ఇంతింతై పెరుగుతుందన్న సూచనలు అందరినీ హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వాలు అమల్లోకి తెస్తున్న చర్యలు గమనిస్తుంటే ఈ రాకాసి వైరస్‌తో మరింతకాలం పోరాడక తప్పదన్న సంకేతాలు కనబడుతున్నాయి. దేశంలోని 17 రాష్ట్రాలూ, అయిదు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 జిల్లాల్లో, పలు నగరాల్లో ‘లాక్‌డౌన్‌’ అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలు, నగరాలు కూడా ఉన్నాయి.

దురదృష్టమేమంటే ఇంకా చాలామంది ప్రభుత్వాలు చేస్తున్న సూచనల్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. తమకేం కాదులే అన్న ధీమాతో ఇష్టానుసారం సంచరిస్తున్నారు. తోటివారి ప్రాణాలను ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నారు. దేశంలో సోమవారం కొత్తగా 37 కేసులు కనబడటం గమనిస్తే ఈ మహమ్మారి అంతకంతకూ ఎలా తీవ్ర రూపం దాలుస్తున్నదో తెలుస్తుంది. వీటితో కలుపుకుంటే ఇంతవరకూ దేశంలో కరోనా కేసుల సంఖ్య 433కి చేరుకుంది. 130 కోట్లమంది జనాభాలో వీటి శాతం ఎంత అని తేలిగ్గా తీసిపారేయకూడదన్నది వైద్య నిపుణులు చెబుతున్న మాట. మూడోవారానికల్లా ఈ సంఖ్య అనేక రెట్లు పెరుగుతుందని, ఆ తర్వాత నియంత్రణకు సైతం లొంగదని అంటున్నారు.

అన్నిటికన్నా ఆందోళనకరమైన విషయం– విదేశాలకు వెళ్లడంగానీ, అలా వెళ్లినవారికి  సన్నిహితంగా మెలిగిన చరిత్రగానీ లేని వారికి సైతం ఈ మహమ్మారి అంటుకోవడం. తెలంగాణలో ఇలాంటి ఒక కేసు బయటపడగా, కోల్‌కతాలో ఇదే తరహా వ్యక్తి కరోనా బారినపడి కన్నుమూశాడు. అంటే వేరే దేశాలకు పోయి వచ్చి నిబంధనలకు విరుద్ధంగా జనం మధ్యన కొందరు సంచరిస్తున్నారని అనుకోవాలి. అలాంటి ఒకరిద్దరు పట్టుబడ్డారు కూడా. అందువల్లే లాక్‌డౌన్‌ ప్రకటనను తీవ్రంగా తీసుకుని అమలు చేయని వారికి గట్టి హెచ్చరికలు చేయడం మొదలైంది. ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం నరేంద్ర మోదీయే స్వయంగా హెచ్చరించారు.

కేంద్రం ప్రకటించిన జిల్లాలు, నగరాలు మాత్రమే కాదు... మిగిలిన ప్రాంతాలను సైతం ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ పరిధిలోకి తెస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. దాదాపు అన్ని రాష్ట్రాలూ ఇదే పని చేస్తున్నాయి. ఎక్కడినుంచైనా పనిచేసే వెసులుబాటు అందరికీ ఉండదు. సాధారణ కాలంలోనే అర్ధాకలితో బతుకులు వెళ్లదీయక తప్పని స్థితిలోవుండే బడుగు జీవుల్ని అసలు గడప దాటొద్దంటే సమస్యే. కనుకనే ఆ వర్గాలవారికి రేషన్‌ సరుకులు అందించడం, ఇతర ఖర్చుల కోసం నగదు అందించడం వంటి చర్యలకు ప్రభుత్వాలు ఉపక్రమించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి మానసపుత్రికలు గ్రామ సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ ఈ కష్టకాలంలో అద్భుతంగా పని చేస్తూ ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి చేయూతనీయడం ఊరటనిస్తుంది. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి కరోనా గురించి సామాన్యుల్ని చైతన్యవంతుల్ని చేయడం, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి వారికి తగిన సూచనలీయడం, ఈ సమాచారాన్నంతటినీ ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా ఆరోగ్యశాఖకు అందించడం ఏపీ ప్రజలకు భరోసానిస్తోంది. సామాజిక దూరం పాటించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరమని వైద్య నిపుణులు చేస్తున్న సూచనల్ని పాటిస్తూ చాలా రాష్ట్రాలు సరిహద్దులు మూసేశాయి. ప్రజా రవాణా వ్యవస్థల్ని ఆపేశాయి. తప్పనిసరి కాని దుకాణాలు సైతం తెరవొద్దని తాఖీదులిచ్చాయి. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి గట్టెక్కిన చైనాగానీ, ఇప్పటికీ సంక్షోభంలోనే వుంటూ బయటపడే మార్గం తోచక కొట్టుమిట్టాడుతున్న ఇటలీగానీ చెబుతున్న అనుభవాలు మనం పరిగణనలోకి తీసుకోనట్టయితే మున్ముందు పెను ముప్పు తప్పదు.

సంక్షోభ కాలాన్ని చూసి మనం నిరాశానిస్పృహల్లోకి కూరుకుపోనవసరం లేదు. ‘ఏ పారడైజ్‌ బిల్ట్‌ ఇన్‌ హెల్‌’ అనే గ్రంథంలో రచయిత్రి రెబెకా సోల్నిట్‌ చెప్పిన మాటల్ని గుర్తుంచుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, తెలియని భూతమేదో మనల్ని మింగేస్తున్న భావన కలిగినప్పుడు మనుషుల్లోని మానవీయత మేల్కొంటుందని, వారిలోని ధైర్యసాహసాలు, చొరవ, తాము బతుకుతూ అందరినీ బతికించాలన్న తపన హృదయపు లోలోతుల్లోంచి పెల్లుబికి వస్తాయని ఆమె అంటారు. అందుకామె అమెరికా అంతర్యుద్ధం మొదలుకొని ఆ దేశాన్ని ఊపేసిన ఎన్నో ఉత్పాతాలను ఉదహరించారు. అయితే అందరినీ ఇబ్బందులపాలు చేసే ఆపదల్ని తమకనుకూలంగా మలుచుకోవాలని దిగజారేవారూ, లాభార్జన తప్ప మరేదీ పట్టనివారూ అక్కడక్కడ ఉంటారు. కానీ సకాలంలో అటువంటి చీడపురుగుల్ని గుర్తించి ఏకాకుల్ని చేయడమే అసలైన మందు. అది సమాజంలోని అందరి కర్తవ్యం కావాలి. ఆదివారం  జనపదాలన్నిటా మార్మోగిన సమైక్యత నిరంతరమై ప్రవహించాలి. ఈ మహమ్మారిని దుంపనాశనం చేయడంలో నేను సైతం ఉన్నానన్న సంతృప్తి ప్రతి ఒక్కరిలో ఏర్పడాలి.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top