గడప గడపకూ వెళ్లండి: వైఎస్ జగన్

గడప గడపకూ వెళ్లండి: వైఎస్ జగన్ - Sakshi


- జూలై 8 నుంచి గడప గడపకూ వెళ్లండి, మాట్లాడండి

- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్ధేశం

 

 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి, ఎమ్మెల్యేలు కావాలనుకునే వారికి, ఉత్సాహంగా పనిచేసే వారికి మద్దతు ఇస్తానని వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో గెలవాలనుకునే వారు,  ఎమ్మెల్యేలు కావాలనుకునే వారు రాజకీయ కుటుంబం నుంచే రావాల్సిన అవసరం లేదు. వారి తండ్రి, మామ ఎమ్మెల్యే అయి ఉండాల్సిన పని లేదు. గత కుటుంబ చరిత్రకు ఉండాల్సిన పనిలేదు. నాయకుడు కావాలనుకున్న వారికి ఒక సీక్రెట్ చెపుతానంటూ... గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమనేదే ఆ సీక్రెట్ అన్నారు.  ‘‘ప్రజలతో మాట్లాడాలి. వారి తో కొంత సమయం వెచ్చించాలి. సాధకబాధకాలు తెలుసుకోవాలి. వీధి, వాడ, డొంక అన్ని సమస్యలపైనా అవగాహనకు రావాలి.గ్రామాన్ని వదిలే సమయానికి  ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ఇందుకు జూలై 8 నుంచి ప్రారంభమయ్యే  గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం పూర్తిగా ఉపయోగపడుతుంది. నాయకునిగా ఎదగడానికి ఇదొక మహత్తర అవకాశం అవుతుంది’’ అని జగన్ విశ్లేషించారు. విజయవాడలో మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి ఉత్సాహంగా వచ్చేవారిని తాను స్వాగతిస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో అధికార టీడీపీ సాగిస్తున్న అవినీతి, అక్రమ పాలన గురించి  గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలకు విపులంగా వివరిస్తే ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని విశ్లేషించారు.తెలుగు ప్రజల నమ్మకానికి ప్రతిరూపమైన ‘యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ’ విధివిధానాలను వివరిస్తూ.. టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి, 1,45,549 కోట్లు’ పుస్తకంలో ప్రచురించిన కుంభకోణాల వివరాలను తెలియజెపితే చాలని పార్టీ శ్రేణులు, నాయకులకు జగన్ ఉద్బోధించారు. వాగ్ధానాల వంచనలతో, అధికారానికి చంద్రబాబు వేసిన అడ్డదారి నిచ్చెనలను తెలియజెప్పి... చంద్రబాబు పాసా? ఫెయిలా? ప్రజా బ్యాలెట్ అనే కరపత్రంలోని వంద ప్రశ్నలకు మార్కులు వేయాలని ప్రజలను కోరితే ఆయనకు  సున్నా మార్కులే వస్తాయని గంటాపథంగా చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లండి...: దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జన్మదినమైన జూలై 8 నుంచి ఐదు నెలల పాటు ప్రతి ఇంటికి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే, కో ఆర్డినేటర్ వెళ్లాలని జగన్ సూచించారు. ‘ప్రతి ఇంటి వద్ద కనీస సమయమైనా ఉండాలి. ఆ ఇంట్లో వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి.  వారి ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందాలి. ఒక్కో గ్రామానికి 4, 5 గంటలు వెచ్చించాలి. ఇలా అయిదు నెలల్లో అన్ని  గ్రామాలను చుట్టాలి. అదే సమయంలో గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించాలి. పార్టీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనే వారిని గుర్తించాలి. బూత్ కమిటీని వేయాలి. ఇలా చేస్తే మీరే లీడర్లు అవుతార’ని భరోసాగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రచ్చబండలా చేయవద్దని కోరారు. సీనియర్ శాసనసభ్యుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రెండేళ్లలో రెండు పర్యాయాలు నియోజకవర్గమంతా తిరిగారు. అలా చేసినవారిని ప్రజలు ఎందుకు ఆశీర్వదించరు? వారు ప్రజాప్రతినిధిగా ఎందుకు గెలవరని ప్రశ్నించారు. ప్రజల ఆప్యాయతలు, ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top