యువకుడి దారుణహత్య | youngman murdered | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణహత్య

Mar 3 2017 12:22 AM | Updated on Jul 30 2018 8:37 PM

మండల పరిధిలోని నన్నూరు సమీపంలో బుధవారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.

- మృతదేహాన్ని తగులబెట్టిన దుండగులు
- స్థానికేతరుడిగా గుర్తించిన పోలీసులు
- నన్నూరు సమీపంలో ఘటన
 
ఓర్వకల్లు :  మండల పరిధిలోని నన్నూరు సమీపంలో బుధవారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఘటన తీరును బట్టి పథకం ప్రకారమే హత్య చేసినట్లు తెలుస్తోంది. కత్తులతో విచక్షణా రహితంగా నరికి, హత్యానంతరం మృతదేహానికి తగులపెట్టారు. నన్నూరు సమీపంలోని నారాయణ బాలికల జూనియర్‌ కళాశాలకు కూతవేటు దూరంలో జమాల్‌షా దర్గాకు వెళ్లే దారిలో జాతీయరహదారి పక్కనే గురువారం  కాలిపోయిన శవం స్థానికులు గుర్తించారు. ఈ మేరకు తాలుకా రూరల్‌ సీఐ నాగరాజు యాదవ్, ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ, నాగాలపురం ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, మల్లికార్జున ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రక్తపు మరకలు, మృతదేహంపై లోతైన గాయాలను బట్టి పోలీసులు హత్యగా గుర్తించారు.
 
వాహనంపై తీసుకొచ్చి తల, మెడ, భుజాలు, పొత్తి కడుపుపై విచక్షణా రహితంగా నరికి చంపేసినట్లు తెలుస్తోంది. తర్వాత పెట్రోల్‌ పోసి శవానికి నిప్పుపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కాలిపోవడంతో గుర్తుపట్టలేని విధంగా మారింది. హతుడు నన్నూరు, మీదివేముల, లొద్దిపల్లె గ్రామాల ప్రాంతానికి చెంది ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తుండగా పోలీసులు మాత్రం స్థానికేతరుడిగా చెబుతున్నారు. డాగ్‌స్క్వాడ్‌ బృందం అక్కడికి చేరుకుని పరిసరాల్లో తనిఖీలు చేశారు. ఆచూకీ కోసం మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఐసుపెట్టెలో భద్రపరచనున్నట్లు ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement