ఆసుపత్రిలో మహిళ మృతి | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో మహిళ మృతి

Published Tue, Nov 8 2016 2:47 AM

woman dead in hospital

జంగారెడ్డిగూడెం :  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతిచెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు సోమవారం ఆందోళనకు దిగారు. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. కామవరపుకోట మండలం కొండగూడెం గ్రామానికి చెందిన అందుగుల సరోజిని తన కుమార్తె బేబిరాణి అనారోగ్యానికి గురికావడంతో స్థానిక నిర్మలా ఆసుపత్రికి ఆదివారం తీసుకువచ్చింది. బేబిరాణికి  వైద్యులు చికిత్స చేశారు. ఇంతలో సరోజినికి విరేచనాలు అయ్యాయి. దీంతో అదే ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు వైద్యం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సరోజిని మృతిచెందింది. విషయం తెలుసుకున్న సరోజిని బంధువులు , గ్రామస్తులు ఆసుపత్రికి చేరుకున్నారు. సరోజిని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వైద్యులు ఆందోళనకారులను శాంతింపచేసే యత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం సీఐ జి.శ్రీనివాసయాదవ్, ఎస్‌సై ఎం.కేశవరావు సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోళన విరమించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.అయినా ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో పోలీసులు వారిని చెల్లాచెదురుచేశారు. దీంతో ఆందోళనకారులు మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువెళ్లి ఆందోళన చేపడుతామని ప్రకటించారు. ఆసుపత్రి వైద్యులు, పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఇదిలా ఉంటే సరోజిని భర్త మూడేళ్ల క్రితం మృతిచెందారు. సరోజినికి బేబిరాణి, పూర్ణ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నాలుగు నెలల క్రితం బేబిరాణికి వివాహమైంది. తండ్రి ఎప్పుడో చనిపోగా, తల్లి కూడా మృతి చెందడంతో ఆడపిల్లలు దిక్కులేని వారయ్యారని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. 
 

Advertisement
Advertisement