పచ్చని కుటుంబాల్లో తాగుడు చిచ్చు | wife murders her husband | Sakshi
Sakshi News home page

పచ్చని కుటుంబాల్లో తాగుడు చిచ్చు

Aug 10 2017 10:45 PM | Updated on Sep 17 2017 5:23 PM

పచ్చని కుటుంబాల్లో తాగుడు చిచ్చు

పచ్చని కుటుంబాల్లో తాగుడు చిచ్చు

పచ్చని కుటుంబాల్లో మద్యం చిచ్చురేపుతోంది. నిత్యమూ పీకలదాకా తాగి ఇంటికి చేరుకుంటున్న భర్త వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో భరించలేని ఓ ఇల్లాలు తన గుండెను దిటువు చేసుకుంది.

వేధింపులు తాళలేక చిక్కేపల్లిలో భర్తనే మట్టుబెట్టిన ఇల్లాలు
తనను ధిక్కరిస్తోందంటూ కుందుర్పిలో భార్యపై హత్యాయత్నం
రెండు ఘటనలకూ కారణమైన మద్యం


పచ్చని కుటుంబాల్లో మద్యం చిచ్చురేపుతోంది. నిత్యమూ పీకలదాకా తాగి ఇంటికి చేరుకుంటున్న భర్త వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో భరించలేని ఓ ఇల్లాలు తన గుండెను దిటువు చేసుకుంది. స్వీయరక్షణలో భాగంగా ప్రతి దాడికి పూనుకుంది. అంతే.. నెత్తుటి మడుగులో భర్త కుప్పకూలాడు. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు ఇదే తరహాలోనే చోటు చేసుకున్న మరో ఘటనలో తాగుబోతు భర్తదే పైచేయిగా మారింది. మద్యం మత్తులో వేటకొడవలితో భార్యను నరికాడు. కొనఊపిరితో బాధితురాలు ఆప్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలకూ మద్యమే కారణం కావడం గమనార్హం.

వేధింపులు భరించలేక..
యాడికి(తాడిపత్రి రూరల్‌): ప్రతి రోజూ మద్యం మత్తులో తనతో పాటు కుమార్తెనూ వేధింపులకు గురిచేస్తున్న భర్తను ఓ ఇల్లాలు హతమార్చింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. యాడికి మండలంలోని చిక్కేపల్లికి చెందిన మునిస్వామి, ఆదిలక్ష్మి దంపతులు.  19 సంవత్సరాల క్రితం వివాహమైన వీరికి ఇంటర్మీడియట్‌ చదువుకుంటున్న ఓ కుమార్తె ఉంది. తొలుత వీరి కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోయింది. ఇటీవల మద్యానికి బానిసైన మునిస్వామి రోజూ తప్పతాగి ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. తాగుడు మానేయాలని కోరిన భార్యపై భౌతిక దాడులు చేసేవాడు. వారించేందుకు ప్రయత్నించిన కుమార్తెను సైతం చితకబాదేవాడు. బుధవారం అర్ధరాత్రి తాగిన మత్తులో ఇంటికి చేరుకున్న మునిస్వామి, తన భార్యతో గొడవపడ్డాడు. ఆమె ఎంత వారించిన వినకుండా దాడికి తెగబడ్డాడు.  సహనం కోల్పోయిన ఆదిలక్ష్మి అక్కడే ఉన్న తుమ్మకట్టెతో చీకట్లో మునిస్వామి తల, ముఖంపై బలంగా దాడి చేసింది. ఘటనతో తల పగిలి మునిస్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పామిడి సీఐ నరేంద్రనాథరెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు గురువారం అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

చిన్నపాటి ఘర్షణకే..
కుందుర్పి: చిన్నపాటి ఘర్షణకే కట్టుకున్న ఇల్లాలిపై వేటకొడవలితో దాడి చేసిన ఘటన కుందుర్పిలో సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. కుందుర్పికి చెందిన పురుషోత్తంకు రామలక్ష్మితో 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకూ వీరి సంసారంలో సాఫీగా సాగింది. తర్వాత పురుషోత్తం మద్యానికి బానిసగా మారాడు. వద్దని భార్య ఎంత నచ్చచెప్పినా అతను వినేవాడు కాదు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగాయి. పలుమార్లు కుటుంబ పెద్దలు పంచాయితీలు నిర్వహించి సర్దిచెప్పినా అతనిలో మార్పురాలేదు. దీంతో భర్తతో కలిసి కాపురం చేయలేనంటూ రామలక్ష్మి వేరుగా ఉంటూ వస్తోంది. బతుకుతెరువు కోసం కుందుర్పిలో హోటల్‌ ఏర్పాటు చేసుకునేందుకు రామలక్ష్మి ప్రయత్నాలు మొదలుపెట్టింది. గురువారం ఉదయం ఆమె హోటల్‌ ప్రారంభోత్సవం చేసింది. ఆ సమయంలో మద్యం మత్తులో పురుషోత్తం అక్కడకు చేరుకుని ఘర్షణకు దిగాడు. వేటకొడవలితో మెడపై నరికాడు. రక్తపు మడగులో ఆమె నేలకొరగడంతో, తేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రామలక్ష్మిని తల్లిదండ్రులు వెంటనే జిల్లా సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement