ఆస్తి కోసం భర్తను చంపిన భార్య | wife murder to husbend for Property | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం భర్తను చంపిన భార్య

Jul 7 2017 2:50 AM | Updated on Jul 27 2018 2:21 PM

ఆస్తి కోసం భర్తను చంపిన భార్య - Sakshi

ఆస్తి కోసం భర్తను చంపిన భార్య

ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే చంపింది భార్య. ఈ హత్యకు పిల్లలు కూడా సహకరించడం అమానుషం.

సహకరించిన పిల్లలు
పదమూడేళ్లుగా వేరుగా ఉంటున్న దంపతులు

బచ్చన్నపేట(జనగామ):
ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే చంపింది భార్య. ఈ హత్యకు పిల్లలు కూడా సహకరించడం అమానుషం. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై భరత్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం దబ్బగుంటపల్లి గ్రామానికి చెందిన పంతం శ్రీనివాస్‌(43), బాలమణికి 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం ఉన్నారు. కాగా వీరికి మనస్పర్ధలు వచ్చి పదమూడేళ్లుగా వేరుగా ఉంటున్నారు. గ్రామంలో శ్రీనివాస్‌ పేరు మీద 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కాగా ఆ భూమిని తన పేరున మార్పిడి చేయాలని భార్య బాలమణి పలుమార్లు పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది.

శ్రీనివాస్‌ అందుకు అంగీకరించకపోవడంతో ఆ విషయంలో గొడవలు జరిగి శ్రీనివాస్‌ పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చాడు. భార్యా, పిల్లలు కూలీ..నాలీ.. చేసుకుంటూ జనగామలో జీవనం కొనసాగిస్తున్నారు. గురువారం వారు జనగామ నుంచి గ్రామానికి వచ్చి ఇంటి వద్ద ఉన్న భర్త  శ్రీనివాస్‌ను వారి పిల్లలు భవాని, పూజ, ప్రవీణ్, నవీన్‌ వ్యవసాయ బావి వద్దకు పోదామని తీసుకొని వెళ్లారు. అక్కడే ఉన్న భార్య బాలమణి పథకం ప్రకారం కళ్లల్లో కారంపొడి చల్లింది. వెంటనే అతడి పిల్లలు తోసేసి నెత్తిపై రాళ్ళతో కొట్టి చంపేశారు.

చనిపోయాడని నిర్ధారణకు వచ్చాక మృతదేహాన్ని అక్కడే వదిలేశారు. గమనించిన చుట్టు పక్కల బావుల వద్ద గల రైతులు అక్కడకి వెళ్లే సరికి వారు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఎస్సై వచ్చి ఆటోలో వెళ్తున్న నిందితులను కొన్నె గ్రామం వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ పద్మనాభరెడ్డి, సీఐ కరీముల్లాఖాన్‌ పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement