నమ్మకద్రోహం

నమ్మకద్రోహం


► కమిషనరుపై బాధిత గ్రామాల ప్రజల మండిపాటు

► డంపింగ్‌ యార్డు సమస్య జఠిలం

► రోడ్డుపై బైఠాయించి నిరసన

► మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి
రామాపురం(తిరుపతి రూరల్‌): ‘తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు...సమస్యను పరిష్కారించాల్సింది పోయి బాధిత గ్రామ ప్రజలను రెచ్చగొడుతున్నారు...అధికారులు, ఎంపీ వచ్చి సమస్య పరిష్కరిస్తామని 22 వరకు సమయం తీసుకుని వెళ్లారు...కానీ కమిషనర్, ఎంపీ నమ్మించి మోసం చేశారు... గ్రామస్తుల ప్రమేయం లేకుండా తిరుపతిలో మీటింగ్‌ పెట్టి కాంట్రాక్టర్లకు బొమ్మలు చూపించి సమస్య పరిష్కారమైందని ప్రకటిం చడం 14 బాధిత గ్రామాలను మోసగించడమే’నని డంపింగ్‌ యార్డు బాధిత గ్రామాల ప్రజలు దుయ్యబట్టారు.తిరుపతి కమిషనర్‌ హరికిరణ్, ఎంపీ శివప్రసాద్‌ తీరుపై మండిపడ్డారు. బాధితులను విస్మరించి అఖిలపక్షం మీటింగంటూ మోసగించారని విమర్శలు గుప్పించారు. కమిషనర్‌ తీరుకు నిరసనగా చెత్త లారీలు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించి రాస్తారోకో, ధర్నా చేపట్టారు. పెద్ద సంఖ్యలో ఆందోళన చేస్తున్న డంపింగ్‌యార్డు బాధిత గ్రామస్తులకు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్దతు తెలిపారు. గ్రామస్తులతో పాటు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామస్తులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. సాయంత్రం గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆందోళన చేస్తున్న ప్రజల వద్దకు వచ్చారు. వారికి మద్దతు ప్రకటించారు. డంపింగ్‌ యార్డును పరిశీ లించారు.ఎంపీని నమ్మి మోసపోయాం..

గ్రామస్తులు, ఎమ్మెల్యే ఆందోళనతో ఎంపీ డాక్టర్‌ శివప్రసాద్‌ రెండు రోజుల క్రితం రామాపురం వచ్చారు. ప్రత్యామ్నాయ స్థలం చూసుకునేందుకు 22 వరకు సమయం ఇవ్వాలని, ఈ నెల 22వ తేదీన వస్తున్న ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తామని  చెవిరెడ్డిని, గ్రామస్తులను ఎంపీ కోరారు.యార్డు తరలించేవరకు ఆందోళన విరమించేది లేదని ఎంపీకి గ్రామస్తులు తేల్చి చెప్పారు. చెవిరెడ్డి చొరవ తీసుకుని, ఎంపీపై నమ్మకం ఉంచుదామని.. గడువు ఇద్దామని గ్రామస్తులను ఒప్పించారు. చెత్త తరలింపునకు అంగీకరించారు. రెండు రోజులకే ఎంపీ మాట మార్చడంపై వారు మండిపడుతున్నారు. కమిషనర్‌ ప్రకటనను ఎంపీ ఖండించకపోవడంతో ఇద్దరు కలిసి మోసగించారని వారు ఆరోపిస్తున్నారు. కాగా చెత్త తరలిస్తే అంగీరించేది లేదని బాధిత గ్రామ పంచాయతీలు తీర్మానించాయి.కమిషనర్‌ తీరుతో జఠిలం..

డంపింగ్‌ యార్డు సమస్యపై తిరుపతి కమిషనర్‌ హరికిరణ్‌ మండలంలోని ఇద్దరు కాంట్రాక్టర్లను పిలిచి సోమవారం తుడా కార్యాలయంలో సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే చెవిరెడ్డి, బాధిత గ్రామలవారిని పిలవలేదు. సమావేశానంతరం ‘చెత్త సమస్య పరిష్క రం అయిందని, చెత్తను తరలించేం దుకు గ్రామస్తులు అంగీకరించారని కమిషనర్‌ ప్రకటించారు. మీడియాలో కమిషనర్‌ ప్రకటన చూసిన బాధిత 14 గ్రామాల ప్రజలు మండిపడ్డారు.ఎంపీ అనుమతి లేకుండ కమీషనర్‌ ఈ ప్రకటనను చేయరని, ఇద్దరు కలిసి బాధిత గ్రామ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీని కమిషనర్‌ పావుగా వాడుకుని చెత్తను మా నెత్తిన వేస్తున్నారని వాపోయారు. కావాలనే రెచ్చగొడుతున్నారని, సమస్య పరిష్కారం కావడం ఆయనకు ఇష్టం లేదన్నారు. బాధిత ప్రజలు ఏకమై మంగళవారం రామాపురం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ధర్నా చేపట్టారు. చెత్త లారీలు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఓ చెత్త ట్రాక్టర్‌లోని చెత్తను రోడ్డుపైనే డంప్‌ చేయించి పరిశీలించారు.అండగావుంటా..

14 గ్రామాల ప్రజలకు ఆందోళనకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్దతు తెలిపారు. రాస్తారోకో, ధర్నాలో ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వారితోనే రోడ్డుపైనే బైఠాయించి వారికి భరోసా కల్పిం చారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top