వశిష్ట తీరం.. పర్యాటక ధామం | VASISHTA BASIN.. TOURISM DEVELOPEMENT | Sakshi
Sakshi News home page

వశిష్ట తీరం.. పర్యాటక ధామం

Apr 27 2017 12:49 AM | Updated on Sep 5 2017 9:46 AM

వశిష్ట తీరం.. పర్యాటక ధామం

వశిష్ట తీరం.. పర్యాటక ధామం

ఒయ్యారాలు ఒలకబోసే గోదావరి.. ఏటిగట్టు వెంబడి కొబ్బరిచెట్లు.. నది మధ్యలో చిన్నచిన్న దీవుల్లా లంక గ్రామాలు.. అడుగుపెట్టగానే ఆహ్లాదపరిచే వాతావరణం.. వశిష్ట గోదావరి తీరం వెంబడి కనిపించే దృశ్యాలివి. కాసేపు నిలబడి ప్రకృతి రమణీయత ఆస్వాదించాలంటే అనువైన పరిస్థితులు లేవు. ఈ లోటు ఇకపై భర్తీ కానుంది. వశిష్ట తీరం త్వరలో పర్యాటక కేంద్రంగా...

ఆచంట : ఒయ్యారాలు ఒలకబోసే గోదావరి.. ఏటిగట్టు వెంబడి కొబ్బరిచెట్లు.. నది మధ్యలో చిన్నచిన్న దీవుల్లా లంక గ్రామాలు.. అడుగుపెట్టగానే ఆహ్లాదపరిచే వాతావరణం.. వశిష్ట గోదావరి తీరం వెంబడి కనిపించే దృశ్యాలివి. కాసేపు నిలబడి ప్రకృతి రమణీయత ఆస్వాదించాలంటే అనువైన పరిస్థితులు లేవు. ఈ లోటు ఇకపై భర్తీ కానుంది. వశిష్ట తీరం త్వరలో పర్యాటక కేంద్రంగా మారబోతుంది. దొంగరావిపాలెంలో అతిథి సౌకర్యాలకు పర్యాటక శాఖ నిధులు కేటాయించింది. ఇక్కడ వసతి గృహాలు, రెస్టారెంట్లు, బోటు షికారు వంటి నిర్మాణాలు చేపట్టబోతోంది. పనిలో పనిగా ఆచంట మండలం పెదమల్లంలో గతంలో నిర్మించిన పర్యాటక కేంద్రాన్ని పునరుద్ధరించేందుకూ నిధులు కేటాయించింది.
 
రూ.3 కోట్లతో అభివృద్ధి
దొంగరావిపాలెం నుంచి పెదమల్లం గ్రామాల మధ్య గోదావరి అందాల్ని తిలకిస్తూ ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. దొంగరావిపాలెం వద్ద రూ.1.80 కోట్లతో పర్యాటకుల కోసం విశ్రాంతి భవనాలు, గోదావరి రుచులు అందించడానికి రెస్టారెంట్లు, గోదావరిలో విహరించడానికి బోట్లు సమకూర్చనుంది. దొంగరావిపాలెం నుంచి గోదా వరి వారధి దాటుకుని పెదమల్లం వరకూ బోట్లపై ప్రయాణించి లంక గ్రామాల అందాలు తిలకించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అనువుగా సిద్ధాంతం నుంచి దొంగరావిపాలెం వరకూ ఏటిగట్టుపై రహదారి, సిద్ధాంతం నుంచి పెదమల్లం వరకూ ఏటిగట్టు అభివృద్ధి పనులు చేపడతారు. వెన్నెల్లో గోదావరి అందాలను పడవపై ప్రయాణించి ఆస్వాదించడానికి ఏర్పా ట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే మరో రెండు నెలల్లోనే నిర్మాణాలు పూర్తిచేసి పర్యాటక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.  
 
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
15 ఏళ్ల కిత్రం ఆచంట మండలం పెదమల్లంలో పర్యాటక శాఖ అతిథి గృహాలు నిర్మించింది. కదిలే గృహాల్లాంటి బోట్లను అందుబాటులోకి తెచ్చింది. పెదమల్లం నుంచి చించినాడ సమీపంలోని దిండి గ్రామానికి బోటు షికారు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రయాణించే ప్యాకేజీ ధరలు ఎక్కువగా ఉండటం.. నదిలో ఇసుక మేటల వల్ల భారీ బోట్లు ప్రయాణించడానికి ఆటంకం కలగటంతో కొద్ది రోజుల్లోనే ఇక్కడి పర్యాటక కేంద్రం మూతపడింది. తాజాగా ఇక్కడి నిర్మాణాలను పునరుద్ధరించడంతోపాటు, మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి పర్యాటక శాఖ రూ.1.20 కోట్లు కేటా యించింది. దొంగరావిపాలెం–పెదమల్లం కేంద్రాల మధ్య త్వరలోనే కొత్త ప్యాకేజీతొ సందర్శకులను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. దొంగరావిపాలెం, పెదమల్లం గ్రామాల్లో పర్యాటక అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులొచ్చాయని ఏపీ  టూరిజం డివిజినల్‌ ఇంజినీర్‌ జి.సత్యనారాయణ తెలిపారు. ఈ రెండుచోట్ల పదేసి చొప్పున కాటేజీల నిర్మాణం, రెస్టారెంట్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. రెండు నెలల్లో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement