మన పిల్లలను మనమే చంపుతున్నామా..?!

రోదిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబీకులు


బుడి బుడి అడుగుల బుడ్డి బుడ్డి పిల్లలు.

వారు వేరెవరో కాదు.. మన కన్న బిడ్డలే.

చూస్తుండగానే.. క్షణాల్లోనే చనిపోతున్నారు...!

కాద్కాదు.. మనమే చంపేస్తున్నాం...!!

మనమే హంతకులం.. ముమ్మాటికీ మనమే..!!!




చింతకాని(మధిర):

ఇది చదువుతుంటే.. నమ్మలేనట్టుగా, ఆశ్చర్యంగా, బాధగా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే.. ఈ కథనం చివరిదాకా చదవండి.



రెండేళ్లకే నూరేళ్లు నిండాయి

చింతకాని మండలం నాగిలిగొండ గ్రామానికి చెందిన పంది నరేష్, సరిత దంపతులకు కుమారుడు నాగచైతన్య. వాడి వయసు రెండే ళ్లు.  వాడికో బుడ్డి చెల్లి కూడా ఉంది. దాని వయసు తొమ్మిది నెలలు. ఆ బుడ్డోడు ప్రతి రోజూ చుట్టుపక్కల ఇళ్లల్లోకి బుడి బుడి అడుగులు వేసుకుంటూ వెళ్లి ఆడుకుంటాడు. అక్కడున్న వారికి బుజ్జి బుజ్జి మాటలతో కబుర్లు చెబుతాడు. అందరినీ అలరిస్తాడు.

మంగళవారం ఉదయం, వరి పొలానికి మందు చల్లేందుకని ట్రాక్టర్‌పై మందు కట్టలు వేసుకుని వెళ్లేందుకు తండ్రి నరేష్‌ సిద్ధమయ్యాడు. బుడ్డి నాగచైతన్య వెంటపడ్డాడు. తాను కూడా వస్తానంటూ ఏడుస్తున్నాడు. వాడిని ఇంట్లోకి తండ్రి తీసుకెళ్లాడు. తల్లి వద్ద వదిలేసి వెళ్లాడు.



ఆ బుడ్డోడిని తల్లి బుజ్జగించింది. కొద్దిసేపటి తరువాత వాడు ఏడుపు మానాడు. ఆమె ఆ పాప ఆలనాపాలనా చూసుకుంటోంది. ఆ బుడ్డోడు, రోజులాగానే తమ ఇంటికి పక్కనే ఉన్న కనగంటి ప్రవీణ్‌ ఇంటికి ఆడుకునేందుకు వెళ్లాడు.

ప్రవీణ్‌–శ్రీలత దంపతులకు కూడా ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. ఈ బుడ్డోడి(నాగచైతన్య)ని ఆమె వాళ్ల ఇంటికి పంపించింది. తన బుజ్జి బాబును చూసుకోవడంలో నిమగ్నమైంది.



ఆ గడుగ్గాయి బుడ్డోడు (నాగచైతన్య) చిన్న టవల్‌ తీసుకుని మళ్లీ బయటికొచ్చాడు. తిన్నగా ప్రవీణ్‌ ఇంట్లోకి వెళ్లాడు. వాడిని శ్రీలత ఏమాత్రం గమనించలేదు. తన పనుల్లో, బుజ్జి బాబును చూసుకోవడంలో నిమగ్నమైంది.

వాళ్ల ఇంటి వెనుకనున్న నీటి తొట్టి వద్దకు బుడ్డి నాగచైతన్య వెళ్లాడు. అందులోని నీటిలో టవల్‌ను ముంచి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. మూడు అడుగుల లోతున్న ఆ తొట్టిలో బుడ్డోడు పడిపోయాడు.



పొలం వద్దకు వెళ్లిన ప్రవీణ్, ఇంటికి వచ్చాడు. కాళ్లు కడుక్కునేందుకని నీటి తొట్టి వద్దకు వెళ్లాడు. షాక్‌... తొట్టిలో బుడ్డి నాగచైతన్య కనిపించాడు. బయటకు తీశాడు. కొన ఊపిరితో ఉన్నాడేమోనని శరీరంపై చేతులతో రుద్దాడు. అప్పటికే నాగచైతన్య ప్రాణాలు గాల్లో కలిశాయి.

ప్రవీణ్‌–శ్రీలత దంపతులు నాగచైతన్య ఇంటికి వెళ్లి, వాడి తల్లికి చెప్పారు. విగత జీవిగా మారిన కొడుకుని చూసిన ఆ తల్లి సొమ్మసిల్లింది.

అప్పటికి అరగంట కిందటే పొలం వద్దకు వెళ్లిన నరేష్, ఈ దుర్వార్తతో ఏడ్చుకుంటూ పరుగు పరుగున ఇంటికొచ్చాడు. కుమారుడి మృతదేహంపై పడి ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.



నాయనమ్మ ఉండి ఉంటే..

నాగచైతన్యను రోజూ నాయనమ్మ చూసుకుంటోంది. ఆమె మంగళవారం, కిరోసిన్‌ తెచ్చేందుకని రేషన్‌ డీలర్‌ వద్దకు వెళ్లింది. కిరోసిన్‌ తీసుకుని ఇంటికి వచ్చేప్పటికే ఘోరం జరిగింది. ఆమె గుండె పగిలేలా రోదిస్తోంది. ‘‘నేను బయటకు వెళ్లకుండా ఉంటే నా మనవడు దక్కేవాడు’’ అంటే గుండెలు బాదుకుంటోంది.



మన నిర్లక్ష్యమే చంపేసింది

ఇప్పుడు చెప్పండి... ఈ బుడ్డోడిని చంపింది ఎవరు? మన నిర్లక్ష్యం కాదా? పిల్లాడిని అలా బయటకు పంపిన తల్లిదండ్రుల నిర్లక్ష్యం.. నీటి తొట్టిపై మూత వేయని నిర్లక్ష్యం,.. ఈ నిర్లక్ష్యమే ఆ బుడ్డోడని చంపేసింది. గతంలోనూ అచ్చం ఇలాగే పిల్లలు చనిపోయిన ఘటనలు జరిగాయి.

ఇప్పుడు నిజాయితీగా, గుండెలపై చేయి వేసుకుని చెప్పండి.. ఈ బుడ్డోడి చావుకు మనం కారణం కాదా?

మనలోని నిర్లక్ష్యం కారణం కాదా? మనం హంతకులం కాదా..?

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top