ఇద్దరు వివాహితల బలవన్మరణం | two suicides | Sakshi
Sakshi News home page

ఇద్దరు వివాహితల బలవన్మరణం

May 13 2017 11:22 PM | Updated on Sep 5 2017 11:05 AM

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వివాహితలు బలవన్మరణానికి పాల్పడ్డారు.

పరిగి (పెనుకొండ) : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వివాహితలు బలవన్మరణానికి పాల్పడ్డారు. పరిగి మండలం ఎస్‌.బీరేపల్లిలో కంసల అశ్వత్థచారి భార్య ప్రభావతి(30) అనే వివాహిత శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ అంజనయ్య శనివారం తెలిపారు. దంపతులిద్దరూ గతంలో గార్మెంట్‌కు వెళ్లేవారన్నారు. అయితే కొంతకాలంగా ప్రభావతి ఇంట్లోనే ఉంటుండగా, భర్త ఒక్కడే వెళ్లేవాడని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇంటి తలుపులు తీయకపోగా, రాత్రి ఇంటికొచ్చిన భర్త పిలిచినా పలక్కపోవడంతో అనుమానంతో లోపలకి తొంగి చూడగా.. ఇనుప తీర్లకు వేసిన ఉరికి వేలాడుతూ కనిపించిందన్నారు. క్షణాల్లో ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో చుట్టుపక్కల వారు పోగయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

అరవకూరులో మరొకరు..
కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం అరవకూరులో చంద్రకళ(26) అనే వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. భార్యాభర్తల మధ్య శుక్రవారం గొడవ జరిగిందని వివరించారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె రాత్రైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ దొరకలేదు. రాత్రి పొద్దుపోయాక నీరున్న బావిలో మృతదేహమై తేలియాడుతుండగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement