టీడీపీ పైశాచికానికి అబల బలి | TDP MLA negligence in not getting CM relief fund for medical treatment | Sakshi
Sakshi News home page

టీడీపీ పైశాచికానికి అబల బలి

Jul 3 2026 3:48 AM | Updated on Jul 3 2026 3:48 AM

TDP MLA negligence in not getting CM relief fund for medical treatment

‘పచ్చ’రూప రాక్షసులు  

కీచకులై వేధించి దాడి చేసి.. బలవన్మరణానికి ప్రేరేపించిన ఘాతకులు  

వైద్యం కోసం సీఎం సహాయనిధినీ దక్కకుండా టీడీపీ ఎమ్మెల్యే దౌష్ట్యం 

మీ పార్టీ అధికారంలోకి వచ్చాక దరఖాస్తు చేసుకోండంటూ అపహాస్యం  

ఏడాదిన్నరపాటు మంచంలోనే నరకం చూసిన బాధితురాలు 

చనిపోయే వరకు వెంటాడి మరీ వేధించిన కిరాతకులు

పచ్చరూప రాక్షసుల పైశాచికానికి మరో అబల బలైంది. వారి కీచకత్వానికి తాళలేక బలవన్మరణానికి యత్నించింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ సాయం కోసం అర్థిస్తే.. మానవత్వం కూడా చూపకుండా మృగాల్లా వెంటాడి మరీ నరకం చూపిన కిరాతకుల దౌష్ట్యానికి నిండుప్రాణం వదిలింది. సీఎం సహాయనిధినీ దక్కకుండా సైంధవుల్లా అడ్డుపడి చనిపోయే వరకు సూటిపోటి మాటలతో రాబందుల్లా పొడిచిపొడిచి బాధించిన దుష్టకూటమి పాలనలో వైద్యం అందక ఏడాదిన్నరగా మంచానికే పరిమితమైన ఆ మానవతి గురువారం తనువు చాలించింది. సభ్యసమాజాన్ని కలచివేసేఈ హృదయవిదారక ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది.   

కళ్యాణదుర్గం: టీడీపీ మూకల పైశాచికానికి మరో అబల బలైంది. ఏడాదిన్నరపాటు మృత్యువుతో పోరాడి ఆమె కన్నుమూసింది. కళ్యాణదుర్గం వడ్డే కాలనీలో నివాసముంటున్న చంద్రకళ, చిన్నా దంపతులు బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రకళపై స్థానిక టీడీపీ నాయకుడు రామాంజినేయులు కన్ను పడింది. కోరిక తీర్చాలంటూ వేధించాడు. 

వేధింపులు ఎక్కువ కావడంతో పద్ధతి మార్చుకోవాలని చంద్రకళ హెచ్చరించింది.దీంతో రెచ్చి పోయిన రామాంజినేయులు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదిన్నర క్రితం చంద్రకళపైనా, ఆమె కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అవమానభారంతో మనస్తాపానికి గురైన చంద్రకళ అప్పట్లో యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెకు అనంతపురం, బెంగళూరు నగరాల్లోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. 

వైద్య ఖర్చులకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేశారు. ఆస్పత్రి నుంచి వచ్చిన చంద్రకళ కేవలం మంచానికే పరిమితమైంది. పొట్ట భాగంలో రంధ్రం చేసి పైపు ద్వారా ద్రవ పదార్థాలు అందించేవారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ తలారి రంగయ్య.. మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి చంద్రకళ పరిస్థితిని తీసుకెళ్లి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.  

     చంద్రకళ (ఫైల్‌) , పోలీసు స్టేషన్‌ వద్ద ధర్నాకు దిగిన బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు 

తూతూ మంత్రంగా కేసు 
టీడీపీ నేత కుటుంబ సభ్యులు చంద్రకళపై దాడికి పాల్పడినప్పుడు పట్టించుకోని పోలీసులు ఆమె యాసిడ్‌ తాగి బలవన్మరణానికి యత్నించిన తర్వాత కేసు నమోదు చేసి గంటలోపే స్టేషన్‌ బెయిలిచ్చి నిందితులను వదిలేశారు. దీంతో తమ బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ చంద్రకళ కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద ధర్నాకు దిగారు. బాధ్యులపై అప్పట్లో టీడీపీ నేతల ఒత్తిళ్లతో తూతూ మంత్రంగా కేసులు కట్టి తమ బిడ్డ చావుకు కారణమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి పిల్లలకు దిక్కెవరంటూ ప్రశ్నించారు. దీంతో పట్టణ సీఐ హరినాథ్‌ మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిందితులు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సీఎం సహాయ నిధికీ మోకాలడ్డు
చంద్రకళను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వద్దకు బాధితురాలి కుటుంబ సభ్యులు వెళ్లారు. అయితే.. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే నెపంతో ‘మీ పార్టీ అధికారంలోకి వచ్చి నప్పుడు దరఖాస్తు చేసుకోండంటూ..’ హేళన చేశారు. సాయం అందకుండా మోకాలడ్డారు. అంతటితో ఆగకుండా తమపై పెట్టిన కేసు రాజీ చేసుకోవాలంటూ వేధింపులకు పాల్పడ్డారు. తీవ్ర ఒత్తిడి చేశారు. మీరే దాడి చేశారంటూ అక్రమ కేసులు బనాయిస్తామని నిత్యం భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వేధింపులకు కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న బాధను చూడలేక మంచంలోనే చంద్రకళ నరకం అనుభవించింది. ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున ప్రాణం విడిచింది.

మా బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు 
మా బిడ్డను అన్యాయంగా టీడీపీ వారే పొట్టున పెట్టుకున్నారు. టీడీపీ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదు. నా కూతురికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలి.  – బయన్న, మృతురాలి తండ్రి  

పోలీసు వ్యవస్థ బలంగా పనిచేయాలి 
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలంగా పనిచేయాలి. ఎమ్మెల్యేలకు, మంత్రులకు బందోబస్తు వెళ్లడానికి కేటాయిస్తున్న సమయం ప్రజలను రక్షించేందుకు వినియోగించాలి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలకు గొల్ల మమత, బోయ శ్రావణి, వడ్డే చంద్రకళలాంటి ఎంతో మంది అబలలు తనువు చాలించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి మహిళల రక్షణ పట్ల చిత్తశుద్ధి లేదు. పట్టపగలే ఓ వృద్ధురాలిని చంపితే ఇప్పటికీ పోలీసులు నిందితులను పట్టుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. చంద్రకళ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరఫున అండగా ఉంటాం.  – డాక్టర్‌ తలారి రంగయ్య, మాజీ ఎంపీ, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, కళ్యాణదుర్గం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement