తల్లి, భార్య హత్య.. ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య | Tragedy in Venkatakrishnapalyam Narayanavanam mandal Tirupati district | Sakshi
Sakshi News home page

తల్లి, భార్య హత్య.. ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య

Apr 23 2026 4:21 AM | Updated on Apr 23 2026 4:21 AM

Tragedy in Venkatakrishnapalyam Narayanavanam mandal Tirupati district

నారాయణవనం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడం తిరుపతి జిల్లా నారాయణవనం మండలం, వెంకటకృష్ణపాళ్యంలో విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో తల్లి, భార్య హత్యకు గురికాగా, ఇద్దరు బిడ్డలతో కలిసి ఆ ఇంటి యజమాని మోహన్‌ (45) ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అయితే తల్లిని, భార్యను మోహనే హత్య చేశాడా..? లేక మరెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్నది మిస్టరీగా మారింది. 

ఈ ఘోరానికి కారణాలు తెలియరాలేదు.  నారాయణవనం మండలం వెంకటకృష్ణపాళ్యంలో నివాసం ఉంటున్న మోహన్‌ నెల క్రితం నారాయణవనంలో స్టీల్, సిమెంట్‌ వ్యాపారం ప్రారంభించాడు. అత ని భార్య హరిత (33) టైలరింగ్‌తో పాటు బ్యూటీ పార్లర్‌ నడుపుతోంది. వీరికి ఇద్దరు పిల్లలు. పుత్తూరులోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో  కుమార్తె హిమని (15) తొమ్మిదో తరగతి, కుమారుడు కౌశిక్‌ (12) ఏడో తరగతి చదువుతున్నారు. మోహన్‌ తల్లి చంద్రకళ (65) కూడా వీరితో పాటే ఉంటోంది.  

సిమెంట్‌ లోడు కోసం బ్యాంకులో డీడీ కట్టడానికి ఉంచుకున్న నగదును మోహన్‌ బుధవారం ఉద యం 10.30 గంటలకు పక్కింటి రాధకు ఇచ్చి.. తనకు పని ఉందని తర్వాత తీసుకుంటానని చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు మోహన్‌ ఇంటికి  చంద్రకళ అన్న బాలకృష్ణ వచ్చాడు. ఆ సమయంలో చంద్రకళ, హరిత హత్యకు గురై విగతజీవు లుగా పడిఉండడాన్ని చూశాడు. హరిత మెడకు చున్నీ బిగించి ఉండగా, చంద్రకళ శరీరంపై తీవ్ర గాయాలున్నాయి.  ఇరుగు పొరుగువారు పోలీసులకు  సమాచారం అందించారు. 

మోహన్‌కు తెలియజేసేందుకు మొబైల్‌కు కాల్‌చేయగా కలవలేదు. దీంతో అతని పిల్లలు చదువుతున్న పుత్తూరులోని కార్పొరేట్‌ పాఠశాలకు ఫోన్‌చేయగా 11 గంటల సమయంలో మోహన్‌ పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. మోహన్, పిల్లల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బుధవారం రాత్రి పుత్తూరు పరిధిలోని వేపగుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో కాచిగూడకు వెళ్తున్న రైలు కింద పడి మోహన్, ఇద్దరు పిల్లలు హిమని, కౌశిక్‌ మృతి చెందారని రైల్వే పోలీసులు గుర్తించి, స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement