గ్రేటర్ వరంగల్ స్టాండింగ్ కమిటీ ఎంపిక ప్రక్రియ కొంతమంది కార్పొరేటర్లను ఒత్తిడికి గురిచేస్తోంది. స్టాండింగ్ కమిటీ సభ్య పదవికి పోటీ చేయదల్చే కార్పొరేటర్లు నేడు సాయంత్రం 3 గంటల్లోగా తమ నామినేషన్ల పత్రాలను బల్దియా ప్రధాన కార్యాలయంలో సమర్పించాలి.
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నేడే
Aug 15 2016 11:53 PM | Updated on Aug 21 2018 12:18 PM
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ స్టాండింగ్ కమిటీ ఎంపిక ప్రక్రియ కొంతమంది కార్పొరేటర్లను ఒత్తిడికి గురిచేస్తోంది. స్టాండింగ్ కమిటీ సభ్య పదవికి పోటీ చేయదల్చే కార్పొరేటర్లు నేడు సాయంత్రం 3 గంటల్లోగా తమ నామినేషన్ల పత్రాలను బల్దియా ప్రధాన కార్యాలయంలో సమర్పించాలి. మంగళవారం ఉదయం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్ సమావేశమై స్టాండింగ్ కమిటీలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆశావహులైన కార్పొరేటర్లు ఒత్తిడికి లోనవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐదున్నర సంవత్సరాల వ్యవధి తర్వాత బల్దియాలో పాలక వర్గం ఏర్పడింది. వీరిలో 80 శాతం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఉండగా, కొంతమంది సీనియర్లూ ఉన్నారు. వీరిలో పలువురు ఆశావహులు తమకంటే తమకు స్టాండింగ్ కమిటీలో అవకాశం కల్పించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల బలం అత్యధికంగా కలిగి ఉన్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆరు స్టాండింగ్ కమిటీ పదవులను కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఆ పార్టీలోని ఆశావహుల నడుమ తీవ్ర పోటీ నెలకొంది. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి 2 స్టాండింగ్ కమిటీ పోస్టులు, అందులో ఒకటి అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి, మరొకటి వరంగల్ ప్రాంతానికి కేటాయించనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇద్దరికి, వర్ధన్నపేట నుంచి ఒకరికి, పరకాలకు ఒక స్థానం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement