
అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు
పట్టణంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. పక్కఇళ్లకు గడియలు వేసి తమ ‘హస్తకళ’ను ప్రదర్శించారు.
♦ తాండూరు తులసీనగర్‌లో ఆరు ఇళ్లలో చోరీ
♦ అర్బన్ సీఐ నివాసం ఉంటున్న భవనంలోనూ అపహరణ
♦ పక్క ఇళ్లకు గడియలు పెట్టిన దుండగులు
♦ 12 తులాల బంగారు, 8 తులాల వెండి నగల చోరీ
♦ వివరాలు సేకరించిన ఏఎస్పీ చందనదీప్తి
తాండూరు: పట్టణంలో అర్ధరాత్రి దొంగ లు రెచ్చిపోయారు. పక్కఇళ్లకు గడియలు వేసి తమ ‘హస్తకళ’ను ప్రదర్శించారు. తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య నివాసం ఉండే భవనంలోనూ చోరీకి పాల్పడడం కలకలం రేపింది. దుండగులు బంగారు, వెండి ఆభరణాలతోపాటు కొంత నగదును అపహరించుకుపోయారు. చోరీలతో తులసీనగర్ వణికిపోయింది. ఏఎస్పీ చందనదీప్తి వివరాలు సేకరించారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. తాండూరు తులసినగర్‌లోని సిద్ధివినాయక్ దేవాలయం సమీపంలో శెట్టి నిలయంలోని పైఅంతస్తులో అర్బన్ సీఐ వెంకట్రామయ్య అద్దెకు ఉంటున్నారు.
ఇదే భవనంలోని కింద భాగంలో పెద్దేముల్ మండలం కందనెల్లి ప్రభుత్వ పాఠశాల టీచర్ రవీందర్‌గౌడ్ కూడా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆయన తన కొడుకును తీసుకొని నగరంలోని ఆస్పత్రికి భార్యతో కలిసి వెళ్లాడు. అర్ధరాత్రి ఆయన ఇంటి తాళాన్ని పగులగొట్టిన దొంగలు లోపలికి చొరబడ్డారు. బీరువా తాళం పగులకొట్టి 10 తులాల బంగారు, 8 తులాల వెండి ఆభరణాలను అపహరించారు. దొంగలు వాటర్ బాటిల్‌ను, ఒక చిన్నగుడ్డ ముక్కను ప్రధాన ద్వారం వద్ద వదిలేసి వెళ్లారు. అయితే, దొంగలు తమ వేలిముద్రలు లభించకుండా తుడిచేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సీఐ ఉంటున్న పక్కన భవనంలోని మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్న రవిగౌడ్ ఇంటి తాళాన్ని పగులగొటి ్టన దొంగలు అక్కడ ఏమీ లభించకపోవడంతో సామగ్రి చిందరవందరగా పడేశారు. ఇదే కాలనీలో రిటైర్డ్ టీచర్ జగన్నాథ్ భవనంలో అద్దెకు ఉంటూ బషీరాబాద్ మండలంలో పని చేస్తున్న ప్రభుత్వ టీచర్లు పాండునాయక్, కవిత దంపతులు సెలవుల్లో తమ స్వగ్రామానికి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి దొంగలు వారి ఇంటి తాళాలను పగులకొట్టారు. బీరువాను ధ్వంసం చేసి, 2 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 వేల నగదు చోరీ చేశారు. రిటైర్డ్ మార్కెట్ కమిటీ కార్యదర్శి నర్సిరెడ్డి శుక్రవారం విత్తనాలు వేసేందుకు తన స్వగ్రామం ఇందర్‌చెడ్ కు వెళ్లగా దొంగలు బీరువాలోని ఐపాడ్‌తోపాటు మరో విలువైన ఫోన్‌ను అపహరించారు.
నర్సిరెడ్డి ఇంటి సమీపంలో నారాయణదాస్ భవనంలో టైలరింగ్ చే స్తూ అద్దెకు ఉండే మహిళ ప్రముఖ గురువారం బంధువుల ఇంటికి వెళ్లగా దొంగలు ఆమె ఇంటి తాళం పగులగొట్టగా ఏమీ లభించలేదు. ఇదే కాలనీలోని మల్లయ్య భవనంలో అద్దెకు ఉంటున్న రాఘవేందర్ గురువారం కుటుంబీకులతో కలిసి శ్రీశైలానికి వెళ్లారు. దొంగలు ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఏమీ దొరకకపోవడంతో సామగ్రిని చిందరవందరగాప డేశారు. ఆయా ఇళ్లల్లో చోరీలు జరిగినట్టు శనివారం ఉదయం పొరుగింటి వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
జాగిలాలతో పరిశీలన
డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం రంగంలోకి దిగాయి. జాగిలాలు చోరీలు జరిగిన ఇళ్ల చుట్టూ తిరిగాయి. క్లూస్ టీం ఆరు ఇళ్లలో వేలి ముద్రలు సేకరించింది. వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు నివాసం ఉంటే తులసీనగర్‌లో రాత్రివేళ పెట్రోలింగ్ నామమాత్రంగా సాగుతుందని స్థానికులు విమర్శించారు. ఏఎస్పీ చందనదీప్తి, అర్బన్ సీఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ నాగార్జున ఘటనా స్థలాలను సందర్శించి వివరాలు సేకరించారు.
చోరీల తీరును బట్టి ప్రొఫెషనల్స్ దొంగలే ఈ పనికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఏఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు వేరే గ్రామాలకు వెళ్తే తమ విలువైన వస్తువులను లాకర్‌లో భద్రపర్చుకోవాలని ఈ సందర్భంగా ఏఎస్పీ సూచించారు. అయితే, శుక్రవారం రాత్రి తులసినగర్‌లో ఓ కారు అనుమానాస్పదంగా తిరిగిందని స్థానికులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.