అపరిశుభ్రత వాతావరణంలో కూరగాయలు విక్రయిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపానపోవడంలేదు.
రామచంద్రాపురం:అపరిశుభ్రత వాతావరణంలో కూరగాయలు విక్రయిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపానపోవడంలేదు. దానితో మురుగు కంపులోనే కూరగాయలు కొనుక్కొని పొవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఆదివారం అశోక్‌నగర్ సమీపంలోని జాతీయరహదారిపై కూరగాయల సంత నిర్వహిస్తారు. అదే స్థలంలో జీహెచ్‌ఎంసీ పట్టణంలో సేకరించిన చెత్తను డంప్‌చేసి మూడునాలుగు రోజులకు ఒకసారి డంపింగ్ యార్డులకు తరలిస్తుంటారు. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంతం దుర్వాసనతో చెత్తతో నిండిపోయి దారుణంగా తయారయింది.
ఎప్పటిలాగే కూరగాయల వ్యాపారస్తులు ఆ మురుగు కంపులోనే కూరగాయాలు విక్రయించారు. దానితో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ దుర్వాసన కారణంగా చాలా మంది ప్రజలు వాంతులు చేసుకొని స్వల్ప ఆనారోగ్యానికి గురయ్యారు. దీనికి తోడు ఈ మార్కెట్‌లోనే చేపలు కూడా అమ్ముతుంటారు. చేపల వ్యర్థాన్ని వ్యాపారులు రోడ్డు ప్రక్కనే పడేసిపోవడంతో రెండుమూడు రోజులు ఆ ప్రాంతం అంతా దుర్వాసనతో నిండిపోతుంది.
దీని కారణంగా జాతీయరహదారిపై వెళ్లే వాహనదారులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై గతంలో అనేకమార్లు అధికారులకు ఫిర్యాదుచేసిన వారు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. సమస్యను ఎవరికి చెప్పాలో అర్థంకాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రత వాతావరణంలో కూరగాయాలను విక్రయించడం వల్ల అవి తిని తాముకూడా ఆనారోగ్యపాలవుతామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైన అధికారులు స్పందించి అపరిశుభ్ర వాతావరణంలో కూరగాయలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.